విజయ్ దేవరకొండ `హీరో` సినిమా ఆగిపోయిందన్న వార్తలు టాలీవుడ్ అంతా చక్కర్లు కొడుతున్నాయి. అయితే మైత్రీ మూవీస్ మాత్రం.. ‘మేం ఈ సినిమా ఆపలేదు… త్వరలో కొత్త షెడ్యూల్ మొదలెడతాం’ అని చెబుతున్నాయి. నిజానికి ఈ సినిమా విషయంలో ఏం జరిగింది?? ఏం జరుగుతోంది?? ఆరా తీస్తే..??
ఆనంద్ అన్నామలై అనే ఓ కొత్త దర్శకుడు ‘హీరో’ అనే స్క్రిప్టుతో విజయ్ దేవరకొండ దగ్గరకు వచ్చాడు. ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో తీయాలని మైత్రీ మూవీస్ ఫిక్సయ్యింది. స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో సాగే సినిమా ఇది. ఇందులో విజయ్ రేసర్‌గా కనిపించబోతున్నాడు. ఇందుకు సంబంధించిన షూటింగ్ కూడా మొదలైంది. తొలి షెడ్యూల్లో రేసులకు సంబంధించిన ఎపిసోడ్ తెరకెక్కించారు. అందుకోసం ఏకంగా రూ.6 కోట్ల ఖర్చు తేలింది. తీరా చూస్తే.. తీసిన సన్నివేశాలు సరిగా రాలేదని టాక్. దాంతో మైత్రీ మూవీస్ అప్రమత్తమైంది. ఈ కథని తెరకెక్కించే సత్తా దర్శకుడికి ఉందా? లేదా? అనే అనుమానాలు రావడంతో షూటింగ్‌ని తాత్కాలికంగా ఆపేశారు. ఇప్పుడు ఈ స్క్రిప్టులో మార్పులూ చేర్పులూ జరుగుతున్నాయి. తిరగరాత వల్ల సినిమా బాగా వచ్చిందనుకుంటే.. సెప్టెంబరు నుంచి కొత్త షెడ్యూల్ మొదలవుతుంది. లేదంటే లేదు. ఒకవేళ స్క్రిప్టు బాగా వచ్చి, కథపై నమ్మకం కలిగినా – దర్శకుడు ఈ సినిమాని అనుకున్నది అనుకున్నట్టు తీస్తాడన్న భరోసా కలిగితే ఆనంద్ అన్నామలైనే దర్శకుడిగా కొనసాగిస్తారు. లేదంటే ఆనంద్ అన్నామలై ప్లేసులోకి మరో దర్శకుడు వచ్చి చేరతాడు. ఈ సినిమాకి ముందుగా అనుకున్న బడ్జెట్ రూ.న50 కోట్లు. ప్రస్తుతం బడ్జెట్‌కి కోత పెట్టే పనులూ కొనసాగుతున్నాయి. `హీరో` సినిమాకి పూర్తిగా బ్రేకులు పడలేదని, కాకపోతే ఆ అవకాశాలున్నాయని వీటిపై స్పష్టత రావడానికి కొంత సమయం పడుతుందని తెలుస్తోంది. ఒకవేళ `హీరో` ప్రాజెక్టు మెటీరియల్ అవ్వకపోతే, ఆ సినిమా స్థానంలో మరో ప్రాజెక్టు చేసి ఇస్తానని విజయ్ దేవరకొండ మైత్రీ మూవీస్‌కి మాట ఇచ్చినట్టు సమాచారం.