ఆర్థికంగా వెనకుబడిన వర్గాలకు కేంద్రం ఇచ్చిన పది శాతం రిజర్వేషన్లలో ఐదు శాతం కాపులకూ ఇస్తూ.. గత సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని జగన్ ఉపసంహరించారు. ఉరుము లేని పిడుగులా… ఉన్నతాధికారులతో కానీ… కాపు మంత్రులతో కానీ.. కాపు ఎమ్మెల్యేలతో కానీ … ఒక్క సారి కూడా దీనిపై చర్చలు జరిపిన దాఖలాలు లేని సర్కార్.. ఇలాంటి నిర్ణయం తీసుకుంటుందని ఎవరూ ఊహించలేకపోయారు. కానీ రాత్రికి రాత్రే ఆదేశాలొచ్చేశాయి. ఇక ఏమీ చేయలేని పరిస్థితి. వైసీపీకి చెందిన కాపు మంత్రులు, కాపు ఎమ్మెల్యేలు కూడా.. ఏమీ మాట్లాడలేని స్థితిలో ఉండిపోయారు. ఇప్పుడిప్పుడే.. ఎవరూ నోరు మెదిపే పరిస్థితి లేదు. అయినా… సీఎం జగన్మోహన్ రెడ్డి మాత్రం… కాపు ఎమ్మెల్యేలకు.. నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏమిటో… ప్రజలకు ఏం చెప్పాలో… వివరించాలనుకుంటున్నారు.
కాపులకు ఇచ్చిన ఐదు శాతం కోటాను జగన్ రద్దు చేసేశారన్న ప్రచారం కాపు వర్గంలోకి వెళ్లిపోతోంది. చట్ట ప్రకారం అంతా ఓకే అయినా.. సర్టిఫికెట్ల జారీని నిలిపివేయడమే కాకుండా.. ఇప్పుడు పూర్తిగా తీసేశారన్న భావన ఆ వర్గంలో ఉంది. ఇది మరింత వ్యతిరేకతకు దారి తీయకుండా.. ఏం చేయాలో జగన్మోహన్ రెడ్డి.. కాపు ఎమ్మెల్యేలకు.. విడమర్చి చెప్పనున్నారు. వాస్తవాలను ప్రజలకు చెప్పాలని.. ఆయన దిశానిర్దేశం చేయబోతున్నారు. ప్రత్యేకంగా దీని కోసం కాపు ఎమ్మెల్యేలతో భేటీని ఏర్పాటు చేశారు. చట్టవిరుద్ధమైన రిజర్వేషన్లు చంద్రబాబు ఇచ్చారని.. వాటిని ఎలాగూ కోర్టులు కొట్టి వేస్తాయని… జగన్ చెప్పే అవకాశం ఉందంటున్నారు.
నిర్ణయం తీసేసుకున్న తర్వాత తమను ఇన్వాల్వ్ చేయడం ఎందుకున్న అభిప్రాయం.. వైసీపీ కాపు ఎమ్మెల్యేల్లో వస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. సీఎం జగన్మోహన్ రెడ్డి.. ఎలాంటి కసరత్తు లేకుండా.. నిర్ణయం తీసేసుకున్నారు. ఇప్పుడు.. అందరి ఆమోదంతో నిర్ణయం తీసుకున్నట్లుగా కనిపించడానికి కాపు ప్రజాప్రతినిధులతో భేటీ ఏర్పాటు చేస్తున్నారని వారు నమ్ముతున్నారు. ఎలాగూ కేంద్రం రిజర్వేషన్లు కల్పించే అవకాశం లేదు. ఏదో విధంగా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సింది పోయి.. మొత్తానికే పోయినా.. ఏమీ మాట్లాడకపోతే.. వ్యతిరేకత వస్తుందని.. వైసీపీ కాపు నేతలూ భయపడుతున్నారు. మరి ఈ భయాన్ని జగన్కు చెబుతారో .. లేదో..?