కర్ణాటకానికి తాత్కలికంగా తెరపడింది. ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన యడియూరప్ప.. అసెంబ్లీలో బలపరీక్ష నెగ్గారు. కుమారస్వామి సర్కార్ కూలినప్పుడు.. లెక్కలు ఎలా ఉన్నాయో.. ఇప్పుడూ అలాగే ఉండటంతో.. ఆయన గెలుపు లాంఛనం అయింది. మెజార్టీ మార్క్ 104 కాగా.. 106 మందిసభ్యుల మద్దతు యడియూరప్పకు ఉంది. దీంతో మూజువాణి ఓటుతో.. ఆయన గెలుపొందినట్లుగా స్పీకర్ ప్రకటించారు. విశ్వాస పరీక్ష సందర్భంగా.. అటు కుమారస్వామి కానీ.. ఇటు సిద్దరామయ్య కానీ.. యడియూరప్పకు మద్దతు లేదనే వ్యాఖ్యలు చేయలేదు. వారు కూడా.. పరిస్థితి అంగీకరించారు. తాను పధ్నాలుగు నెలల పాటు సీఎంగా ఉన్నానని.. తన కాలంలో తీసుకున్న ఏ నిర్ణయంపైనైనా సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నానని కుమారస్వామి ప్రకటించారు. ప్రజల అభీష్టానికి అనుగుణంగా పాలన సాగిస్తామని.. యడియూరప్ప సభకు హామీ ఇచ్చారు.
మరో వైపు అనర్హతా వేటుపై సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు రెబల్ ఎమ్మెల్యేలు రెడీ అయ్యారు. వారికి అక్కడ ఊరట దక్కడం కష్టమేనని న్యాయనిపుణులు అంచనా వేస్తున్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ టెన్ ప్రకారమే.. స్పీకర్ అనర్హతా వేటు వేశారు. స్పీకర్‌కు ఉన్న విశేషాధికారాల్లో.. న్యాయస్థానాలు అంత తేలికగా జోక్యం చేసుకోవు…కాబట్టి.. వారంతా మాజీలైపోయినట్లే. వారికి ప్రభుత్వంలో ఎలాంటి పదవులు దక్కవు. వారిలో చాలా మంది యడియూరప్ప సీఎం అవుతారని.. తమలో పన్నెండు మందికి మంత్రి పదవులు వస్తాయని వారంతా ఆశగా ఉన్నారు. కానీ సుప్రీంకోర్టు.. స్పీకర్ నిర్ణయాన్ని పెండింగ్‌లో పెడితేనే వారికి ఆశలు ఉంటాయి.
యడియూరప్ప బలం నిరూపించుకోవడంతో ఆర్థిక బిల్లు ఆమోదం లాంఛనం కానుంది. అయితే.. యడియూరప్ప సర్కార్ ఇప్పటికీ మైనార్టీలోనే ఉంది. కర్ణాటక అసెంబ్లీ సభ్యుల సంఖ్య 224. మొత్తంగా మ్యాజిక్ మార్క్ 113. ఇప్పుడు బీజేపీ బలం 106. అనర్హతా వేటుకు గురైన 17 మంది ఎమ్మెల్యేల స్థానాల్లో … ఆరు నెలల్లో ఉపఎన్నికలు జరగడం ఖాయం. వీటిలో… కనీసం.. ఎనిమిది స్థానాలు బీజేపీ గెల్చుకుంటేనే… ప్రభుత్వం నిలబడుతుంది. లేకపోతే.. మళ్లీ అనిశ్చితి ఏర్పడుతుంది.