స్థానికులకే 75 శాతం ఉద్యోగాలంటూ ఆంధ్రప్రదేశ్ కొత్తగా తీసుకొచ్చిన చట్టం.. దేశ ఆర్థిక, పారిశ్రామిక రంగ నిపుణుల్ని… ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ చట్టంపై… నీతిఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్.. ట్విట్టర్‌లో.. వ్యతిరేక వ్యాఖ్యలు చేశారు. తన అభిప్రాయమన్నట్లుగా… ఏపీ చేసిన చట్టంపై..ఓ ఆంగ్ల పత్రికలో వచ్చిన ఆర్టికల్‌ను షేర్ చేశారు. ఈ బిల్లు సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీస్తుందని ఇంగ్లిష్ పత్రిక తేల్చింది. దేశంలో ప్రతి పౌరుడు ఎక్కడైనా జీవించవచ్చు.. పనిచేసుకోవచ్చని రాజ్యాంగం చెప్పిందని సదరు దినపత్రిక ఆర్టికల్‌లో తెలిపింది. 75శాతం స్థానికులకే అని పేర్కొనడం.. పెట్టుబడుల వాతావరణం, ఉత్పాదకతను దెబ్బతీస్తుందని అభిప్రాయపడింది. అవే అంశాలను అమితాబ్ కాంత్.. తన అభిప్రాయాలుగా పోస్ట్ చేశారు.
నిజానికి ఏపీ సర్కార్.. ఆ చట్టం తెచ్చినప్పటి నుంచి.. జాతీయ స్థాయిలో ఎక్కువగా చర్చ జరుగుతోంది. ఏపీలో.. ఈ చట్టం గురించి పెద్దగా చర్చ జరగడం లేదు కానీ.. పారిశ్రామిక వర్గాల్లో, ఢిల్లీ మీడియాలో మాత్రం.. విస్తృతంగా కవరేజీ దక్కించుకుంటోంది. బిల్లు వల్ల ఏపీ ఎంత తీవ్రంగా నష్టపోతుందో.. చర్చా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ పెద్దల అభిప్రాయం కూడా.. అలాగే ఉందని… అమితాబ్ కాంత్ స్పందన ద్వారా తెలిసిపోయిందన్న అభిప్రాయం ఏర్పడుతోంది. నీతిఆయోగ్ సీఈవో అభిప్రాయానికి కేంద్రంలో మంచి విలువ ఉంటుంది. ఈ క్రమంలో.. అమితాబ్ కాంత్.. స్పందన.. ఏపీ ప్రభుత్వ వర్గాల్లోనూ టెన్షన్ పుట్టించింది.
వెంటనే… ఏపీ సీఎం స్పెషల్ చీఫ్ సెక్రటరీ.. పీవీ రమేష్ సోషల్ మీడియాలో స్పందించారు. బిల్లును మీరు పూర్తిగా చూడలేదని భావిస్తున్నానని.. పీవీ రమేష్ రిప్లయ్ ఇచ్చారు. మీరంటే మాకు చాలా గౌరవం ఉందని .. స్థానికులకు అవకాశం కల్పించాలన్నదే మా ఉద్దేశమని.. సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీసే ఆలోచన లేదని పీవీ రమేష్ చెప్పుకొచ్చారు. బిల్లు మాత్రమే ఆమోదించామని.. నిబంధనలు రూపకల్పన చేయాల్సి ఉందన్నారు. ఉద్యోగాల బిల్లుపై.. ఢిల్లీ స్థాయిలో వస్తున్న స్పందన.. ఏపీ సర్కార్ ను ఇరకాటంలో పెడుతోంది. దీన్ని కేంద్రం.. ఆమోదించకపోతే.. ఎలా అన్న ప్రశ్న ఇప్పటికే ప్రభుత్వ పెద్దల్లో ప్రారంభమయింది.