ఎన్నికల్లో ఓటమి తరువాత పార్టీ పటిష్టతపై ద్రుష్టిపెడుతున్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. తాజాగా పార్టీ పోలిట్ బ్యూరో, పొలిటికల్ ఎఫైర్స్ కమిటీలను ప్రకటించి సీనియర్లకు బాధ్యతలు అప్పగించిన సంగతి తెలిసిందే. జనసేన పార్టీ మొట్టమొదటి పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశం విజయవాడలో జరిగింది. ఈ సమావేశానికి పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్ తోపాటు, నాగబాబు కూడా హాజరయ్యారు. పాలిట్ బ్యూరోతో పార్టీని మరింత బలోపేతం చేయడంపై పవన్ చర్చించారు.
ఈ సందర్భంగా ఎన్నికల ముందు వైకాపా ఇచ్చిన హామీల అమలుపై కూడా ద్రుష్టి పెట్టాలని చర్చించారు. నలభై ఐదేళ్లకు పెన్షన్ ఇస్తామంటూ సీఎం జగన్ ఇచ్చిన హామీపై కూడా చర్చ జరిగింది. దీంతోపాటు, అధికార పార్టీ ఎక్కడ ఇచ్చిన మాట తప్పుతోందో గుర్తించి, ప్రజల తరఫున నిత్యం పోరాటాలు చేయడానికి పార్టీ నాయకులు సిద్ధంగా ఉండాలని ఈ సమావేశంలో చర్చించుకున్నారు. మరో నాలుగేళ్లు సమయం ఉంది కాబట్టి, పార్టీని అన్ని స్థాయిల్లో బలోపేతం చేసుకోవడానికి దీన్ని సద్వినియోగం చేసుకుందామని నేతలతో పవన్ అన్నారు. మరో రెండ్రోజులపాటు పార్టీ కార్యాలయంలో సమావేశాలను ఏర్పాటు చేశారు. కాకినాడ, నర్సాపురం, నర్సరావుపేట… ఇలా కొన్ని పార్లమెంటు నియోజక వర్గాలకు సంబంధించిన గడచిన ఎన్నికల్లో జనసేన పార్టీ పనితీరుపై నేతలతో పవన్ చర్చించబోతున్నారు.
ఏ పార్టీ అయినా ముందుగా పైస్థాయి నుంచి కింది స్థాయి వరకూ కమిటీలు బలోపేతం చేసుకుని ఎన్నికలకు వెళ్తుంది. జనసేన కూడా గడచిన ఎన్నికల ముందు కమిటీల మీద ద్రుష్టి పెట్టింది. నిజానికి, 2014 ఎన్నికల నాటికే జనసేన పార్టీ ఉంది. ఆ సమయంలో టీడీపీ, భాజపా కూటమికి మద్దతు ఇచ్చింది. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చెయ్యలేదు. నిజానికి, అప్పట్నుంచే ఈ కమిటీల మీద, క్షేత్రస్థాయిలో సొంత బలాన్ని పెంచుకోవడంపై ద్రుష్టి పెట్టి ఉంటే సరిపోయేది. కానీ, గడచిన అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేసరికి.. పార్టీకి అంత సమయం లేకుండా పోయింది. దీంతో, పార్టీ బాధ్యతలూ ప్రచారమూ అన్నీ పవన్ ఒక్కరే భుజాన వేసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు, మరో నాలుగేళ్ల లక్ష్యం పెట్టుకుని పార్టీ బలోపేతంపై పవన్ ద్రుష్టి పెడుతున్నారు. ఈ నాలుగేళ్లనూ సద్వినియోగం చేసుకుంటే… ఒక నిర్ణయాత్మక శక్తిగా జనసేన ఎదిగే అవకాశం ఉంది. మరి, ఈ సమాయాన్ని ఎంతవరకూ సద్వినియోగం చేసుకుంటారో చూడాలి.