మొదటి సారి “కేఫ్ కాఫీ డే”కి వెళ్లి బిల్లు కట్టి వచ్చేటప్పుడు…అబ్బా ఒక్క కాఫీ షాప్తోనే కోట్లు సంపాదించేస్తున్నార్రా బాబూ.. అని.. అనుకోని వారు ఉండరు. ఎందుకంటే… అక్కడ రేట్లు అలాగే ఉంటాయి. పూర్తి హైఫై గా.. కప్పు కాఫీనే వందల్లో వసూలు చేసే.. ఈ “కేఫ్ కాఫీ డే” ఓనర్ కూడా.. అప్పుల పాలయ్యారు. తాను వ్యాపారాన్ని లాభదాయకంగా నిర్వహించలేకపోతున్నానని…చెప్పి… అదృశ్యమయ్యారు. కొన్ని వేల ఎకరాల సొంత కాఫీ తోటలు ఉన్న.. “కేఫ్ కాఫీ డే” యజమాని వీజీ సిద్ధార్థ..అదృశ్యం.. దేశం మొత్తం కలకలం రేపుతోంది. ఆయనకు వేల కోట్లు ఆస్తులున్నాయని.. విజయవంతమైన వ్యాపారవేత్త అని.. దేశం మొత్తానికి తెలుసు. కానీ.. అంతర్గతంగా.. ఆయన వ్యాపార నష్టాలతో సతమతమవుతున్నారని.. ఆయన అదృశ్యం.. ఆ తర్వాత ఆయన పేరుతో బయటపడిన లేఖలే వెల్లడిస్తున్నాయి.
“కేఫ్ కాఫీ డే” యజమానికి వీజీ సిద్ధార్థ. ఆయన వ్యాపార ప్రస్థానం ఎలా సాగిందో.. దేశంలో ఏదో మూల… ప్రతి పత్రికలోనూ కథనాలు వస్తూంటాయి. ఆయన.. కర్ణాటక మాజీ సీఎం ఎస్ఎం కృష్ణ అల్లుడు కూడా. ఆయన మంగళూరులోని నేత్రావతి నది వంతెనపై నడుచుకుంటూ వెళ్లి కన్పించకుండా పోయారు. ఫోన్ మాట్లాడుతూ వంతెన వద్దకు వెళ్లారని ఆ తర్వాత కనిపించలేదని.. కారు డ్రైవర్ చెప్పడంతో…నదిలోకి దూకేశారేమోన్న అనుమానంతో నేత్రావతి నదిని జల్లెడ పడుతున్నారు. “లాభదాయక వ్యాపారాన్ని సృష్టించడంలో విఫలమవుతున్నా. సుదీర్ఘకాలం నుంచి పోరాడుతూనే ఉన్నా. ఇక పోరాడే ఓపిక నాకు లేదు. అందుకే అన్ని వదిలేస్తున్నా. ఓ ప్రయివేటు ఈక్విటీలోని భాగస్వాములు షేర్లను బైబ్యాక్ చేయమని నన్ను బలవంతపెడుతున్నారు. నా తప్పులన్నింటికీ నాదే బాధ్యత. నేను విఫల వ్యాపారవేత్తను. నన్ను క్షమించండి” అనే ఓ లేఖను ఉద్యోగులకు రాసినట్లుగా చెబుతున్నారు. ఈ లేఖను మీడియా సంస్థలు ప్రసారం చేశాయి.
2017లో… వీజీ సిద్ధార్థ సంస్థలపై ఆదాయపు పన్ను శాఖ దాడులు చేసింది. ఈ దాడుల్లో రూ.రెండు వేల కోట్లకుపైగా అక్రమాస్తులు వెలుగు చూశాయని.. ఐటీ శాఖ మీడియాకు లీకులు ఇచ్చింది. అప్పటికే… వీజీ సిద్ధార్థ మామ… ఎస్ఎం కృష్ణ కాంగ్రెస్ ను వదిలి బీజేపీలో చేరారు .నోట్ల రద్దు నిర్ణయం ప్రకటించాక విజీ సిద్ధార్ధ సంస్థల నుంచి బ్యాంక్ లకు భారీ నగదు డిపాజిట్ అయినట్లుగా తేలడంతో.. ఆ దాడులు జరిగాయని చెబుతున్నారు. వీజీ సిద్ధార్థ ఉద్యోగులకు రాసినట్లుగా చెబుతున్న లేఖలో.. ఐటీ వేధింపుల గురించి కూడా ప్రస్తావించారు. కొన్నాళ్ల క్రితం.. టాలీవుడ్ ప్రముఖుల్లో ఒకరైన… ఆనంద్ సినీ సర్వీసెస్ యజమాని.. రవిశంకర్ ప్రసాద్ కూడా.. ఇలా.. యానాంలో… నడుచుకుంటూ వెళ్లి అదృశ్యమయ్యారు. మూడు, నాలుగు రోజుల తర్వాతే ఆయన మృతదేహాన్ని కనిపెట్టగలిగారు.