జనసేన పార్టీ కాకినాడలో జరుపుతున్న సమీక్ష సమావేశాలలో ఆ పార్టీ నేత పంతం నానాజీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ ని జైలు జీవితం గడిపిన దొంగ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.
జనసేన నేత పంతం నానాజీ మాట్లాడుతూ, ఎన్నికల్లో తమ పార్టీ ఓటమికి చెందడానికి తగినంత సమయం లేకపోవడం, ఆఖరు నిమిషంలో నాయకులను ప్రకటించడం, సంస్థాగత బలం లేకపోవడం వంటి కారణాలే తప్పించి మరేమీ కాదని వీటిని సరిచేసుకుంటే తప్పకుండా జనసేన పార్టీకి అద్భుతమైన భవిష్యత్తు ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు. అయితే పవన్ కళ్యాణ్ కి జనసేన అభిమానుల తరపునుండి ఆయన ఒక విజ్ఞప్తి చేశారు. పవన్ కళ్యాణ్ పాదయాత్ర చేయడం వంటి ఏదో ఒక కార్యక్రమం ద్వారా రోడ్డు ఎక్కాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రజల మనసు చూరగొనడానికి ఇదే మార్గం అన్న ఉద్దేశ్యం తో మాట్లాడుతూ, 16 నెలలు జైలు జీవితం గడిపిన దొంగ కూడా కొన్నేళ్ల పాటు రోడ్డెక్కితే దొర అయిపోయాడని, అలాంటిది ఎటువంటి మచ్చలేని పవన్ కళ్యాణ్ లాంటి నాయకులు రోడ్డెక్కి ఒక సంవత్సరం పాటు ప్రజల మధ్య తిరిగితే ప్రజలు తప్పకుండా జనసేన పార్టీని ఆదరిస్తారని ఆయన వ్యాఖ్యానించారు. ఇక పవన్ కళ్యాణ్ రక్షణ బాధ్యత కార్యకర్తల మైన తాము తీసుకుంటామని ఆయన వ్యాఖ్యానించారు.
ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ని జైలు జీవితం గడిపిన దొంగ అంటూ ఆయన వ్యాఖ్యానించడం ప్రస్తుతం సంచలనం సృష్టిస్తోంది.