ప్రముఖ తెలుగు పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్‌ను సెర్బియా పోలీసులు అరెస్ట్ చేయడం కలకలం రేపుతోంది. ఆయన అరెస్ట్ మూడు, నాలుగు రోజుల కిందటే జరిగినప్పటికీ.. వైసీపీ ఎంపీలు.. కేంద్రానికి లేఖ రాసిన తర్వాతే అసలు విషయం బయటకు వచ్చింది. వైసీపీకి చెందిన 22 మంది ఎంపీలు… ఇంత వరకూ ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం.. ఒక్క సారి కూడా.. కేంద్రానికి లేఖ రాయలేదు. తొలి సారి.. 22 మంది సంతకాలతో లేఖ తీసుకుని.. కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ వద్దకు వెళ్లారు. నిమ్మగడ్డను… ఆధారాలు లేని కేసులో అరెస్ట్ చేశారని.. విడిపించడానికి దౌత్య ప్రయత్నాలు చేయాలని కోరారు. ఏమైనా కేసులు ఉంటే.. భారత్‌లో విచారించవచ్చని వారు కోరినట్లు తెలుస్తోంది.
అయితే.. విదేశాంగ మంత్రి మాత్రం.. నిమ్మగడ్డ అరెస్ట్ పై.. పూర్తి సమాచారం.. కేంద్రానికి వచ్చిందని తెలిపారు. సెర్బియా దౌత్య కార్యాలయానికి సమాచారం వచ్చిందని.. అది సివిల్ కేసు కావడంతో… దౌత్యపరంగా.. ఎలాంటి సాయమూ చేయలేమని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. కావాలంటే.. కుటుంబసభ్యులతో మాట్లాడటానికి.. బెయిల్ కోసం చేసే ప్రయత్నాల్లో కొంత వరకు సాయం చేస్తామని చెప్పినట్లు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. వాన్‌పిక్ పోర్టు ప్రాజెక్ట్ విషయంలో.. తమను మోసం చేశారని “రస్ అల్ ఖైమా” తమ దేశంలోనే కేసు పెట్టింది. చాలా కాలంగా.. నిమ్మగడ్డ ప్రసాద్ కోసం.. వెదుకుతోంది. ఇండియాలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖ రాసినా.. స్పందన లేకపోవడంతో.. ఇంటర్ పోల్ నోటీసు జారీ చేసి… సైలెంట్‌గా ఎదురు చూస్తూ కూర్చుంది. చివరికి ఆయన సెర్బియాకు వెళ్లినట్లుగా తెలుసుకుని అక్కడి పోలీసుల సహకారంతో.. నిమ్మగడ్డను అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది.
సెర్బియాతో.. రస్ అల్ ఖైమాకు ఉన్న నేరస్తుల అప్పగింత ఒప్పందాలు, ఇంటర్ పోల్ నోటీసుల ఆధారంగా… నిమ్మగడ్డ ప్రసాద్ ను గుర్తించి బెల్ గ్రేడ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముందుగా నిమ్మగడ్డ ప్రసాద్‌ను అరెస్ట్ చేసిన విషయం.. వైసీపీ నేతలకే తెలిసింది. ఓ రకంగా వారి ద్వారానే ఈ విషయం మీడియాకు తెలిసింది. వైఎస్ హయాంలో.. వాన్ పిక్ ప్రాజెక్ట్ ను చేపట్టారు. గల్ఫ్ లోని ఓ చిన్న దేశం అయిన రస్ అల్ ఖైమా తో కలిసి నిమ్మగడ్డ ప్రసాద్.. వాడరేవు, నిజాంపట్నం ఇండస్ట్రియల్ కారిడార్ సంస్థను ప్రారంభించారు. దీని కోసం దాదాపుగా రూ. 850 కోట్లు రస్ అల్ ఖైమా పెట్టుబడి పెట్టింది. కానీ ఈ డబ్బులన్నీ ఆగిపోయాయి. వివాదం పరిష్కారానికి నిమ్మగడ్డ సిద్ధంగా లేకపోవడంతో.. కేసు నమోదు చేసింది రాక్..!