విద్యుత్ పీపీఎలను రద్దు చేయడమో.. ధరలు తగ్గించేలా చేయడం కోసమో.. చేసే వరకూ.. పట్టు వదల కూడదని.. ఏపీ సర్కార్ నిర్ణయించింది. ఇందు కోసం.. హైకోర్టు ఇచ్చిన స్టే ఆర్డర్లను సైతం పక్కన పెట్టి.. తమదైన రీతిలో ముందుకెళ్తోంది. ప్రస్తుతం.. ఆయా విద్యుత్ సంస్థల నుంచి కొనుగోళ్లు నిలిపివేసినట్లుగా తెలుస్తోంది. దీనిపై.. కొన్ని విద్యుత్ సంస్థలు హైకోర్టులో పిటిషన్లు వేశాయి. ఏపీ సర్కార్ విద్యుత్ కొనుగోలు చేయడం లేదని.. విద్యుత్ ఉత్పత్తి నిలిపివేయమని.. ఆదేశిస్తోందని…ఆరోపించింది. దీనిపై.. హైకోర్టు స్పందించింది. తాము స్టే ఆర్డర్ ఇచ్చినా.. ప్రభుత్వం ఈ చర్యలు తీసుకోవడం ఏమిటని ప్రశ్నించింది. అయితే ప్రభుత్వం మాత్రం…. విద్యుత్ కొనుగోళ్లు నిలిపివేయడం..ఉత్పత్తి తగ్గించాలని కోరడం నిజమే కానీ.. దానికి వేరే కారణాలున్నాయని చెబుతోంది.
సోలార్, విండ్ పవర్ విద్యుత్ సంస్థలకు మొదటగా.. రేట్లు తగ్గించాలని…లేఖలు రాసిన ఏపీ సర్కార్… ఒప్పందాలు రద్దు చేస్తామని…హెచ్చరికలు ఇచ్చింది. దీంతో.. విద్యుత్ సంస్థలు.. అటు పవర్ ట్రిబ్యునల్‌తో పాటు.. ఇటు హైకోర్టును కూడా ఆశ్రయించాయి. రెండు చోట్లా.. విద్యుత్ కంపెనీలకు అనుకూలంగా… రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా… స్టే ఆర్డర్లు వచ్చాయి. దాంతో… వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్కార్.. ఈ సారి అనధికారికంగా… తన దెబ్బను ప్రైవేటు విద్యుత్ కంపెనీలకు రుచి చూపించడం ప్రారంభించింది. కొద్ది రోజులుగా సౌర, పవన విద్యుత్ సంస్థల నుంచి కొనుగోళ్లను తగ్గిస్తూ వస్తోంది. ఇప్పుడు.. పగటి పూట… సంప్రదాయేతర విద్యుత్ ను అసలు కొనుగోలు చేయడం లేదని.. తెలుస్తోంది. కరెంట్ అవసరం లేదని.. సరిపడా ఉందనే వాదనను ఏపీ సర్కార్ తెరపైకి తెస్తోంది.
నిజానికి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే విద్యుత్ కొరత ఉంది. పట్టణాల్లోనే కాదు .. గ్రామాల్లోనే పెద్దఎత్తున కరెంట్ కోతలు అమలవుతున్నాయి. దీనిపై ఎక్కడో చోట ప్రతీ రోజూ నిరసనలు జరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో… రైతులకు పగటి పూటే.. 9 గంటల విద్యుత్ ఇస్తున్నామని ప్రభుత్వం ప్రకటించుకుంది. గృహ, వ్యవసాయ అవసరాలకు తగ్గట్లుగా డిస్కమ్‌లు విద్యుత్‌ను పంపిణీ చేయడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇలా ఎందుకు జరుగుతుందో.. చాలా మందికి అర్థం కాలేదు. దానికి కారణం… ఇలా.. గత ప్రభుత్వంతో పీపీఏలు కుదుర్చుకున్న కంపెనీలను తమదైన శైలిలో దారికి తెచ్చుకోవడానికి.. ఆ కంపెనీల వద్ద నుంచి అనధికారికంగా కొనుగోళ్లు నిలిపివయడమేనని.. ఇప్పుడిప్పుడే వెల్లడవుతోందంటున్నారు. అధికారికంగా కొనుగోళ్లు నిలిపి వేస్తే.. ఆయా విద్యుత్ సంస్థలకు భారీ మొత్తంలో పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. అనధికారికంగా కొనకుండా ఆపేస్తే.. కోర్టుల్లో అవసరం లేనందున కొనుగోలు చేయలేదని చెప్పవచ్చనే వ్యూహాన్ని ఏపీ సర్కార్ అమలు చేస్తోందంటున్నారు. మొత్తానికి ఏపీ సర్కార్.. ప్రజలకు నిరంతరాయంగా కరెంటివ్వడం కన్నా… తమ పట్టుదల కోసం.. విద్యుత్ కంపెనీలను టార్గెట్ చేయడానికే ప్రాధాన్యం ఇస్తోందన్న అభిప్రాయం ఏర్పడుతోంది.