కొన్ని సినిమాలు థియేటర్ లో ఆడుతున్నపుడు మాత్రమే బావుంటాయి. ఇంకొన్ని థియేటర్ నుండి బయటికి వచ్చేసినా.. మనతో పాటుగా వచ్చేస్తాయి. మరికొన్ని నలుగురు మాట్లడుకున్నప్పుడు గుర్తు చేసుకొని మాట్లాడుకోవడానికి బావుంటాయ్. కానీ కొన్ని సినిమాలు చరిత్రగా నిలిచిపోతాయి. అలాంటి చరిత్రనే ‘మగధీర’. ఈ సినిమా వచ్చి నేటికి సరిగ్గా పదేళ్ళు. ఒక్కసారి ఈ సినిమాని సింహాలోకనం చేసుకుంటే.. గొప్పగా చెప్పుకునే అంశాలు బోలెడు.
”అగ్గది… సిరంజీవి కొడుకు దెబ్బ”
ఒక స్టార్ హీరో కొడుకు.. మరో స్టార్ హీరో అయిపోవడం అంత ఈజీ కాదు. చాలా మంది వారసులు వచ్చారు. వెళ్లారు. కానీ తండ్రి వారసత్వాన్ని నిలబెట్టాడనే పేరు తెచ్చుకున్నావారేంతమంది ?! ఎవరు సంగతి ఏమో కానీ.. చిరంజీవి అనే ఒక మెగా స్టార్ కొడుకు..’మగధీరుడు’ అనిపించుకున్నాడు. ఆ అద్భుతం జరిగింది ‘మగధీర’తోనే. రామ్ చరణ్,, చిరుతగా ఎంట్రీ ఇచ్చినా.. అది జస్ట్ ఓ వెల్కమ్ డ్రింక్ గానే అనిపించింది అభిమానులకు. కానీ విందు భోజనం పెట్టడానికి ఎంతో కాలం పట్టలేదు. రెండో సినిమాతోనే అభిమానుల ఆకలి తీర్చేశాడు రామ్ చరణ్. ”అగ్గది…సిరంజీవి కొడుకు దెబ్బ”అని చొక్కాలు విప్పేసి థియేటర్ లో చిందులు వేసిన అభిమానుల ఆనందానికి నేటికి పదేళ్ళు.
మగధీర సీజను:
శత్రువులని చెండాడే ధీరుడు
శతద్రువంశ యోధుదు
కాల భైరవ..
ఒక్కసారి ఈ డైలాగ్ గుర్తుకుతెచ్చుకుంటే చాలు. కళ్ళముందు మగధీర సీజన్ కదులుతుంది. ఒకటికాదు రెండు కాదు ఏకంగా రెండు నెలలు పాటు ఒకే ఒక సినిమా గురించి మాట్లాడుకున్నారు. ఎక్కడ విన్నా.. పంచదార బొమ్మ.. బంగారు కోడి పెట్ట, ధీరధీర…ఇవే పాటలు. నలుగురుకుర్రాళ్ళు కలిస్తే చాలు.. ”అ బైక్ గాల్లోకి ఎలా ఎగిరింది ? అబ్బా .. ఆ హార్స్ రైడింగ్ ఏంట్రా బాబు.. సిరంజీవి కూడ ఎప్పుడూ ఇలా చేయలేదు. డ్యాన్సులు కూడహే. ఏం సినిమారా బాబు.. రామ్ చరణ్ కేకహః. రాజమౌళి కూడ్రబాబు ”.. ఇవే మాటలు. టోటల్ గా సినిమా కంటూ ఓ సీజన్ ని సొంతం చేసుకున్న ఘనత మగధీరకే దక్కుతుంది.
యాక్షన్ పీక్స్.. డ్యాన్స్ రాక్స్ :
”ఒకొక్కడ్ని కాదు షేర్ ఖాన్ వందమందిని ఒకేసారి రమ్మను” ఈ డైలాగ్ కొన్నాళ్లు పాటు జనాల రింగు టోన్. అంతలా పేలింది. అయితే కేవలం డైలాగ్ లో రైమింగ్ ఉన్నంతమాత్రానా పేలిందని అనుకుంటే పొరపాటే. థియేటర్ లో కేవలం డైలాగ్ కొట్టి ఆగిపోలేదు. నిజంగానే వందమందిని ఊచకోత కోశాడు భైరవ. మాములుగా కాదు.. అప్పటివరకూ అంత షాలిడ్ యాక్షన్ తెలుగు ప్రేక్షకులు చూడలేదు. ఇదే కాదు.. సినిమాలో ప్రతి యాక్షన్ సీన్ ని ఫీక్స్ లో డిజైన్ చేశారు. ఇక రామ్ చరణ్ అభిమానులు మామూలు సర్ ప్రైజ్ లు ఇవ్వలేదు. అభిమానులు కోరుకునే దాని కంటే ఎక్కవ ఎనర్జీ పంచాడు. బంగారు కోడి పెట్టలో డ్యాన్స్ గురించి ఇప్పటికీ జనాలు చెప్పుకుంటారు. ప్రతి పాటలో కూడ ఒక సిగ్నేచర్ స్టెప్ ఉండేలా చూసుకున్నాడు. అన్నిటికంటే పెద్ద సర్ ప్రైజ్ మెగా ఎంట్రీ. జస్ట్ ఒక్క సీన్ కి అలా వచ్చి ఇలా వెళ్ళిపోతారు చిరంజీవి. చిరు-చరణ్ లని అలా ఒకే ఫ్రేములు చూడ్డానికి మెగా అభిమానులకు రెండు కళ్ళు సరిపోలేదు.
టాలీవుడ్ లో హాలీవుడ్ :
మగధీర విజువల్ వండరని మళ్ళీ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగు సినిమా పరిశ్రమలో బోలెడు క్లాసిక్కులు. మాస్టర్ పీసులు. ట్రెండ్ సెట్టర్లు, పాత్ బ్రేకింగులు. కానీ మగధీరకు ఒక స్పెషాలిటీ వుంది. తెలుగుతెరపై మగధీర అంతా పెద్ద స్కేల్ సినిమా ఎవరూ తీయలేదు అప్పటివరకు. అదొక విజువల్ ట్రీట్. విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్, సెట్స్, ఆర్ట్ వర్క్. విజువల్ డెప్త్ లో ఉన్నత స్థాయి హాలీవుడ్ సినిమాకి తీసిపోని సినిమా మగధీర. ముఖ్యంగా ఈ సినిమా కలర్ కరక్షన్ అద్బుతం. ఫ్లాష్ బ్యాక్ లో వచ్చిన ఎపిసోడ్ కి రాజమౌళి పెట్టిన ఎఫర్ట్ మాటల్లో చెప్పలేం. ఒక్క ఫ్రేంని కూడ లైట్ తీసుకోలేదు. బాహుబలి కంటే అద్భుతమైన కలర్ కరెక్షన్.. మూడ్.. మగధీరలో చూడొచ్చు. ప్రతీ ఫ్రేమ్ లోనూ ఒక హాలీవుడ్ సినిమాని తీర్చిదిద్దినట్లుగా తీర్చిదిద్దారు రాజమౌళి. ఈ సినిమాలో ఆయన టేకింగ్ గురించి ఇప్పటికే చెప్పుకున్నాం. కానీ టెక్నికల్ గా రాజమౌళి చూపిన శ్రద్ధ మాటల్లో చెప్పలేం. సినిమా చేసే అర్ధం చేసుకోవాలి.
ఛత్రపతి పెంచిన కసి :
కొంచెం వెనక్కి వెళ్లి ఓ సంగతి చెప్పుకుందాం. రాజమౌళి.. ఒకేసారి మగధీర అంత పెద్ద స్కేల్ సినిమా ఎలా తీశారు? అసలు ఈ ఆలోచన ఆయనకి ఎందుకు వచ్చింది? ఈ ప్రశ్నలకు సమాధానం ‘ఛత్రపతి’ సినిమా. ఛత్రపతి బిగినింగ్ లో ఓ సొరచేప తో ఫైట్ వుంటుంది. రాజమౌళి మొదటిసారి.. ఒక గ్రాఫిక్ ఎపిసోడ్ ని రాసుకున్న సినిమా ఇది. సినిమా పూర్తి చేసి, పోస్ట్ ప్రొడక్షన్ కూడా పూర్తి చేసి.. కేవలం ఆ ఒక్క ఎపిసోడ్ కోసం గ్రాఫిక్స్ కంపెనీల చుట్టూ తిరిగారు. వాళ్ళు ఇచ్చే పుట్ పుట్ నచ్చలేదు. సినిమా రిలీజ్ కి టైం దగ్గర పడుతుంది. ఓ పేరున్న కంపెనీకి ఇస్తే.. వాళ్ళు ఈ రోజు, రేపు అని తిప్పారు. ఒక దశలో బీపీ పెరిగి ఏడుపు కూడా వచ్చేసిందని స్వయంగా ఆయనే చెప్పారు. కానీ ఆ కోపం, బాధ ఆయన మనసులో పెట్టుకున్నారు. కసి పెరిగింది. విజువల్ ఎఫెక్ట్స్ అంతు చూడాలనుకున్నారు. వాటి గురించి తెలుసుకోవడం మొదలుపెట్టారు. ఒక స్టూడెంట్ గా నేర్చుకున్నారు. మొత్తం గ్రిప్ లో పెట్టుకున్నారు. మగధీరతో అంతు చూశారు. మగధీర ఇచ్చిన స్ఫూర్తితోనే ఈగ, బాహుబలి లాంటి కలలని వెండితరపై ఆవిష్కారించారు. ఒకరకంగా చెప్పాలంటే బాహుబలికి మగధీర సమయంలోనే భీజం పడిందని ఆయనే చెప్తారు.
జాతకాలు మారిపోయాయి:
మగధీర సినిమా చాలా మంది జాతకాలు మార్చేసింది. రామ్ చరణ్ మెగా వారసుడు అనిపింకుంటే.. రాజమౌళి టాలీవుడ్ స్పిల్ బర్గ్ అనిపించుకున్నారు. అప్పటివరకూ సోసోగా వుండే కాజల్.. నిజంగానే టాలీవుడ్ కి పంచదార బొమ్మగా మారింది. మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఆ మధ్య కాలంలో అన్ని బడా సినిమాల్లో ఆమెనే హీరోయిన్. షేర్ ఖాన్ గా చేసిన శ్రీహరికి సరికొత్త ఇమేజ్ తెచ్చింది మగధీర. ఈ సినిమా తర్వాత శ్రీహరి చేసిన పాత్రలు అన్నీ ఇన్ని కావు. ఇక మార్కెట్ పరంగా కూడా తెలుగు పరిశ్రమ స్టామినా ఏమిటో చూపించిన సినిమా మగధీర. సరిగ్గా తీస్తే తెలుగు సినిమా ప్యాన్ ఇండియా బిజినెస్ చేయగలదని నిరూపించింది మగధీర.