తెలంగాణలో భారతీయ జనతా పార్టీ, అధికార పార్టీ తెరాసల మధ్య సంబంధాలు ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. భాజపా అడుగులకు మడుగులు ఒత్తే పరిస్థితిలో తెరాస లేదు. తెరాసను అప్రకటిత మిత్రపక్షంగా భాజపా అస్సలు చూడటం లేదు. రాష్ట్రంలో ప్రతిపక్ష పాత్ర పోషించేది తామే అనే రీతిలో భాజపా దూకుడు పెంచుతోంది. అయితే, ఈ రెండు పార్టీల మధ్యా పరిస్థితి ఇంత స్పష్టంగా ఉంటే… టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంకోలా చూస్తున్నట్టున్నారు. ఇప్పటికీ ఆ రెండు పార్టీలూ రహస్య స్నేహితులే అన్నట్టుగా మాట్లాడుతున్నారు.
తెరాస, భాజపాల మధ్య ప్రస్తుతం నడుస్తున్నది డూప్ ఫైట్ మాత్రమే అని ఉత్తమ్ విమర్శించారు. మోడీ సర్కారుకు అనుకూలంగానే కేసీఆర్ వ్యవహరిస్తున్నారు అన్నారు. సమాచార హక్కు చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్రం బిల్లు తెస్తే, దాన్ని ప్రశ్నించకుండా తెరాస మద్దతు తెలిపిందన్నారు. మున్సిపాలిటీల అధికారాలను కలెక్టర్లకు కట్టబెట్టడం కేసీఆర్ నిరంకుశ విధానాలకు నిదర్శనం అన్నారు. ఈ చట్టంపై తాము కోర్టుకు వెళ్తామనీ, ఇది కోర్టు ముందు నిలబడదన్నారు. ఇలాంటి లోపభూయిష్టమైన చట్టాన్ని తీసుకొచ్చినా భాజపా ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రత్యామ్నాయమనీ, పట్టణ ప్రాంతాల్లో భాజపాకి ఏదో కొత్త ఊపు వచ్చేసినట్టు కేవలం మీడియాలో మాత్రమే ప్రచారం చేసుకుంటున్నారనీ, క్షేత్రస్థాయిలో తాము బలంగా ఉన్నామన్నారు ఉత్తమ్.
భాజపాతో స్నేహంగా ఉండాలని తెరాసకు ఉన్నా… ఆ అవసరం ఇప్పుడు భాజపాకి లేదు. ఎందుకంటే, రాష్ట్రంలో వారి పార్టీని బలోపేతం చేసుకోవాలనుకున్నప్పుడు.. తెరాసతో ఎందుకు సానుకూలంగా ఉంటారు..? ఉత్తమ్ వ్యాఖ్యలు చూస్తుంటే… ఆ రెండు పార్టీలు ఇంకా ఫ్రెండ్లీగానే ఉన్నాయని ప్రజలు అనుకుంటున్నారని ఆయన అనుకుంటున్నట్టున్నారు. తెరాస, భాజపాల మధ్య సంబంధాలు ఏంటీ అనే విశ్లేషణలు చేసే కంటే… ఆ రెండు పార్టీల మధ్య నెలకొన్న పోటీ వల్ల కాంగ్రెస్ పార్టీని మూడో స్థానంలోకి నెట్టేసే ప్రయత్నం జరుగుతోందని కాంగ్రెస్ గ్రహిస్తోందా లేదా అనే అనుమానం కలుగుతోంది. తెరాస, భాజపాలు ఎవరి విధానాలతో విజన్ తో వారు ముందుకు సాగిపోతున్నారు. కాంగ్రెస్ ని పోటీగా ఇద్దరూ చూడని పరిస్థితి. ఇలాంటప్పుడు కాంగ్రెస్ విధానం ఏంటనేది స్పష్టత ఉండాలి. భాజపా, తెరాసలకు ధీటుగా కాంగ్రెస్ కూడా వ్యూహాత్మకంగా ఉందనే అభిప్రాయం ఇంతవరకూ కలిగించే ప్రయత్నం ఆ పార్టీ నేతలే చేయడం లేదు.