పోసాని కృష్ణమురళి.. పదే పదే ప్రెస్మీట్ పెట్టి.. తన ఫిట్నెస్ సర్టిఫికెట్ను.. మీడియాకు ప్రదర్శిస్తున్నారు. తానెంతో ఉల్లాసంగా ఉత్సాహంగా ఉన్నానని.. తనకు ఎలాంటి అనారోగ్యం లేదని.. తాను హుషారుగా ఉన్నానని ప్రకటిస్తున్నారు. గతంలో సోషల్ మీడియాలో ఆయన పరిస్థితి సీరియస్గా ఉందని ప్రచారం జరిగింది. అప్పట్లో ఆయన వీడియో రిలీజ్ చేశారు. దాంతో అంతా సైలెంటయిపోయింది. ఇప్పుడు పూర్తిగా తగ్గిపోయిందేమో కానీ.. ప్రత్యేకంగా ప్రెస్మీట్ పెట్టారు. తానేంతో హుషారుగా ఉన్నానని చెప్పుకొచ్చారు. ఇలా ఎందుకు చెప్పుకోవాల్సిందనే ప్రశ్నలకు.. తన వ్యాఖ్యలతోనే సమాధానం చెప్పారు. వైసీపీ తరపున పని చేసిన.. టాలీవుడ్ కు చెందిన వారికి పదవుల పంపకం జరుగుతోంది.
ఫృధ్వీకి పదవి దక్కింది. అలీకి ఎపీఎఫ్డీసీ ఇస్తారని చెబుతున్నారు. మోహన్ బాబుకీ పదవి ఖరారయిందంటున్నారు. అలాగే.. వైసీపీ తరపున ప్రచారం చేసిన వారందరికీ ఏదో పదవి అంటున్నారు. కానీ ఎక్కడా పోసాని పేరు మాత్రం వినిపించడం లేదు. తన ఆరోగ్యం బాగా లేదని.. జగన్ పట్టించుకోవడం లేదమోనన్న ఉద్దేశంతో… తాను ఆరోగ్యంగా ఉన్నా.. పదవి ఇస్తే.. తీసుకుంటానని చెప్పేందుకే ఆయన ఉత్సాహం చూపిస్తున్నారు. ప్రెస్మీట్లో జగన్ను పొగడాల్సినంతగా పొగిడి.. తాను ఆయనకు ఎన్నాళ్ల నుంచి మద్దతుగా ఉన్నానో చెప్పుకొచ్చారు. 2012 ఉప ఎన్నికల్లో జగన్, విజయమ్మ తరుపున ప్రచారం చేశానుని.. అప్పట్లో టాలీవుడ్ నుంచి తాను.. రోజా తప్ప.. ఎవరూ జగన్ వెంట లేరని తెలిపారు. వైసీపీకి ఎంత చేయాలో.. అంతా చేశానని.. పదవి ఇస్తే కాదననని మనసులో మాట బయట పెట్టారు. ఇతరులకు పదవి ఇవ్వడంపై.. కూడా స్పందించారు.
తనకంటే ఎక్కువ కష్టపడ్డారు కాబట్టే జూనియర్స్ కు పదవులు వచ్చాయిని.. చెప్పుకొచ్చారు. ఎక్కువ కష్టపడిన వారికి పదవులు సహజమని.. తనకు కూడా పదవి ఇవ్వాలనే ఆర్థంలో వ్యాఖ్యానించారు. వైసీపీ పెట్టినప్పటి నుంచి జగన్తో ఉన్నానని.. జగన్ సీఎం కావడంతో సంతోషపడ్డానని పోసాని ప్రకటించుకున్నారు. అయితే.. జగన్ సీఎం కావడం.. సినీ పెద్దలకు ఇష్టం లేదని.. నటుడు పృధ్వీ చేసిన వ్యాఖ్యలను పోసాని కృష్ణ మురళి ఖండించారు. పృధ్వీ తొందరపడి మాట్లాడారని అనుకుంటున్నానున్నారు. మొత్తంగా.. పవన్ కల్యాణ్, లోకేష్, శివాజీల విషయంపై స్పందించిన అందరికీ పదవులు ఇస్తున్నారు.. తమకు మాత్రం ఇవ్వడం లేదనే… బాధను పోసాని వ్యక్తం చేశారు. మరి పోసాని బాధను…జగన్ ఎప్పుడు తీరుస్తారో..?