సమర్థత లేని నాయకుల వల్లనే తాము ఓడిపోవాల్సి వచ్చిందనే సంచలన వ్యాఖ్యలు చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. తాను స్వార్థంతో రాజకీయాలు చేయాలనుకుంటే.. ఓ పదిమందిని వెంటేసుకుని వేరే పార్టీలో కలిసిపోయేవాడినని వ్యాఖ్యానించారు. జనసేనతో గొడవ పెట్టుకున్నారనీ, లేదంటే తెలుగుదేశం పార్టీ గడచిన ఎన్నికల్లో గెలిచి ఉండేదన్నారు. ఏదో ఒకరోజు దేశమంతా జనసేనవైపు చూసేలా చేస్తామని నాయకులకు భరోసా ఇచ్చారు. ఎవరైనా సరే అమలు చేయలేని హామీలు ఇవ్వడం సరికాదన్నారు. ఏపీలో మద్యపాన నిషేధాన్ని దశలువారీగా సీఎం జగన్ అమలు చేయలేరన్నారు. మెజారిటీ ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకోకుండా ఇలాంటివి అమలు సాధ్యం కాదన్నారు.
జనసేనాని తాజాగా చేస్తున్న విశ్లేషణలు చూస్తుంటే… ఎవరు తనవాళ్లు, ఎవరు అవకాశవాదులు అనేది ఆయనకి స్పష్టంగా, చాలా త్వరగా అర్థమౌతున్నట్టుగా ఉంది. రాజమండ్రి పార్లమెంటు నియోజక వర్గానికి సంబంధించిన విశ్లేషణ జరుగుతుంటే… జనసేన తరఫున పోటీ చేసిన ఆకుల సత్యనారాయణ కనిపించించని పరిస్థితి. మరో ఉదాహరణ… విశాఖ నుంచి పోటీ చేసిన జేడీ లక్ష్మీనారాయణ, ఎన్నికల్లో ఓటమి తరువాత పార్టీ కార్యక్రమాల్లో కీలకంగా కనిపించడమే లేదు. ఇలాగే, జనసేన ఓటమి తరువాత కొందరు ముఖం చాటేసిన పరిస్థితి చూస్తున్నాం. ఎన్నికల ముందు సీట్ల కోసం పాకులాడే వారు ఎవరూ, పార్టీ కోసం నిజంగానే నిలబడేది ఎవరూ అనే స్పష్టత ఇప్పుడు జనసేనానికి అనుభవపూర్వకంగా తెలుస్తోందని చెప్పొచ్చు.
సుదీర్ఘ ప్రయాణ కోసం తాను రాజకీయాల్లోకి వచ్చానని పవన్ మొదట్నుంచీ చెబుతున్నారు. వాస్తవం చెప్పాలంటే, చాలామందికి ఈ మాటపై విశ్వాసం కలగలేదు. ఎన్నికల తరువాత మళ్లీ సినిమాలంటూ వెనక్కి వెళ్లిపోతారనీ, అన్నయ్య చిరంజీవిలానే వ్యవహరిస్తారనే అభిప్రాయం చాలామందిలో ఉంది. అయితే, ప్రస్తుతం పవన్ విశ్లేషిస్తున్న తీరు చూస్తుంటే… ఆయన మొదట్నుంచీ చెబుతున్నట్టుగానే సుదీర్ఘ కాల ప్రజా జీవితం కొనసాగిస్తారనే విశ్వాసం కొంత కలుగుతున్న పరిస్థితి. సమర్థవంతమైన నాయకత్వం లేదని ఆయనే చెబుతున్నారు. తప్పుల్ని గుర్తించామంటున్నారు. ఇకపై 365 రోజులూ ప్రజాక్షేత్రంలో ఉండాలంటున్నారు. ఒక ఓటమి నేర్పించిన పాఠాలను జనసేనాని త్వరగా గ్రహిస్తున్నట్టుగా చెప్పొచ్చు. అయితే, ఈ అనుభవంతో భవిష్యత్తు కార్యాచరణ ఎంత పక్కాగా నిర్మించుకుంటారనేది ఇక్కడ ముఖ్యం.