శకునం చెప్పే బల్లి కుడితిలో పడినట్లుగా… ప్రజలందరికీ నీతులు చెప్పే తెలుగు మీడియా చానళ్లు మాత్రం.. అక్రమాలకు పాల్పడుతూ అడ్డంగా దొరికిపోతున్నాయి. ఐదు తెలుగు టీవీ చానళ్లపై.. ” బ్రాడ్కాస్ట్ ఆడియెన్స్ రీసెర్చ్ కౌన్సిల్ ” బార్క్ కేసులు పెట్టింది. అక్రమ పద్దతుల్లో.. రేటింగ్‌ను తెచ్చుకునేందుకు నేరానికి పాల్పడ్డారని ఆరోపించింది. బార్క్ టీవీ చానళ్లకు రేటింగ్ ఇచ్చే సంస్థ. ఏ టీవీ అత్యధిక ప్రేక్షకాదరణ పొందుతుందో.. తెలుసుకునేందుకు .. ప్రత్యేకంగా కొన్ని ఏర్పాట్లు చేసుకుంటుంది. బార్క్ ఇచ్చే రేటింగ్స్ ఆధారంగానే… అడ్వర్టైజింగ్ ఏజెన్సీలు.. ఆయా టీవీ చానళ్లకు ప్రాధాన్యం ఇస్తాయి. ఎంత ఎక్కువ రేటింగ్స్ వస్తే.. ప్రకటనలు అంత ఎక్కువగా వస్తాయి.
అందుకే.. టీవీ చానళ్లు బార్క్ రేటింగ్లను విశ్లేషించేందుకు చేసుకున్న ఏర్పాట్లను కూడా మ్యానిపులేట్ చేశాయి. ఈ విషయంలో ఐదు తెలుగు చానళ్లు అక్రమాలకు పాల్పడినట్లు ఆధారాలు లభించాయి. ఈ విషయంపై తెలంగాణ అధికారులకు.. బార్క్ ప్రతినిధులు ఫిర్యాదు చేశారు. కేసులు నమోదయ్యాయి. అయితే… అక్రమాలకు పాల్పడిన ఆ టీవీ చానళ్ల పేర్లను మాత్రం బార్క్ బయట పెట్టలేదు. దేశవ్యాప్తంగా మొత్తం 12 టీవీ చానళ్లు.. ఇలా ప్రేక్షకులు చూడకపోయినా.. ఎక్కువ రేటింగ్ వచ్చిందని చెప్పుకోవడావికి… అక్రమాలకు పాల్పడ్డాయి. వీటిలో ఐదు తెలుగు చానళ్లే. అందుకే.. ఈ చానళ్లపై కేసులు పెట్టడమే కాదు… బార్క్ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారు. అసలు ఆయా టీవీ చానళ్లకు రేటింగ్స్ ఇవ్వడం నిలిపివేయడమో.. మరొకటో చేసే అవకాశం ఉంది.
తెలుగు టీవీ చానళ్లు మీడియా పేరుతో.. నీతులు వల్లిస్తున్నాయి కానీ… అటు వృత్తి పరంగా.. ఇటు వ్యాపారపరంగా చేయాల్సిన అక్రమాలన్నింటినీ చేస్తున్నారు. ప్రజా సంక్షేమం కోసమే… తాము వార్తలిస్తున్నామని గంభీరమైన ప్రకటనలు చేస్తూ… రాజకీయ పార్టీల ప్రాపకం కోసం వార్తల్ని బయాస్ చేస్తున్నారు. ఇటీవలి కాలంలో.. తెలుగు మీడియాలో… కొంత మంది రియల్ ఎస్టేట్, కాంట్రాక్టర్ల ప్రాబల్యం పెరిగిపోయింది. ప్రధానమైన టీవీ చానళ్లన్నీ.. వారి చేతుల్లోకి వెళ్లిపోయారు. అప్పట్నుంచి.. మరింత తేడా కనిపిస్తోంది. ఈ తరుణంలో… బార్క్ కూడా.. ఐదు టీవీ చానళ్ల అక్రమాలను బయట పెట్టింది.