తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ నేత.. బొండా ఉమామహేశ్వరరావు… వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఆయనతో.. వైసీపీ నేతలు సంప్రదింపులు జరిపారని.. ఆయన కూడా .. పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపించారని చెబుతున్నారు. అయితే.. బొండా ఉమ మాత్రం.. సెంట్రల్ నియోజకవర్గం ఇన్చార్జ్ పదవి కోసమే పట్టుబడుతున్నారు. కానీ అక్కడ వైసీపీ తరపున మల్లాది విష్ణు ఎమ్మెల్యే గా ఉన్నారు. ఆయనను కాదని.. బొండా ఉమను పిలిచి ఇన్చార్జ్ పదవి ఇవ్వలేదు. అందుకే..ఈ విషయంలో ప్రత్యామ్నాయాలపై చర్చలు జరుపుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి విజయవాడ తూర్పు నియోజకవర్గంలో… సరైన నేత లేరు. ఆ స్థానం లో ఇన్చార్జ్ గా ఉండాలని వైసీపీ నేతలు ప్రతిపాదించినట్లు చెబుతున్నారు.
విజయవాడ తూర్పు నియోజకవర్గంలో.. గత ఎన్నికల్లో వైసీపీ తరపున బొప్పన భవకుమార్ పోటీ చేశారు. అంతకు ముందు.. మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి కూడా.. టీడీపీ నుంచి టిక్కెట్ కోసం.. వైసీపీలోకి చేరారు. కానీ ఆయనకూ అవకాశం దక్కలేదు. ఓడిపోయిన నేత.. ప్రస్తుత ఇంచార్జ్ ఇద్దరు ఉన్న సమయంలో… తాను అక్కడకు కొత్తగా వెళ్తే ఎవరూ సహకరించరన్న ఉద్దేశంతో బొండా ఉమ ఆగిపోయారని అంటున్నారు. తూర్పు నియోజకవర్గంలో.. ఎమ్మెల్యేగా గద్దె రామ్మోహన్ విజయం సాధించారు. ఆయనను ఎదుర్కోవాలంటే.. కలసి కట్టుగా అందరూ ఉండాలని బొండా ఉమ కోరుకుటున్నారు. కానీ వైసీపీలో పరిస్థితులు అలా లేవనుకుంటున్నారు. అందుకే.. తనకు సెంట్రల్ నియోజకవర్గమే కావాలంటున్నట్లుగా తెలుస్తోంది. గత ఎన్నికల్లో బొండా ఉమ.. కేవలం 20 ఓట్ల తేడాతోనే ఓడిపోయారు.
అయితే.. బొండా ఉమ వైసీపీలో చేరిక చర్చలు సాగుతున్నప్పటికీ.. టీడీపీ కూడా.. ఆయన వెళ్లిపోతే మంచిదన్న ఉద్దేశంలో ఉన్నట్లుగా చెబుతున్నారు. నిజానికి గతంలో కాపు సమావేశాలు పెట్టినప్పుడే… విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ప్రత్యామ్నాయ నేత కోసం.. తెలుగుదేశం పార్టీ ఆన్వేషణ ప్రారంభించింది. పార్టీ నేతల నుంచి అభిప్రాయసేకరణ జరిపింది. దీంతో.. బొండా ఉమ.. పార్టీపై అసంతృప్తి వ్యక్తం చేసి.. కొన్నాళ్లు దూరంగా ఉన్నారు. అయితే.. తర్వాత చంద్రబాబు జోక్యం చేసుకోవడంతో… పార్టీలోనే ఉంటానన్నారు. కానీ.. ఇప్పుడు ఆయన అధికారపార్టీ ఆఫర్ ఇవ్వడంతో అటు వైపు మొగ్గుచూపుతున్నారన్న ప్రచారం జరుగుతోంది. బొండా ఉమ పార్టీ మారితే… టీడీపీలోనే ఉన్న వంగవీటి రాధాకృష్ణకు.. లైన్ క్లియర్ అవుతుందన్న అభిప్రాయం కూడా ఉంది.