ఆంధ్రప్రదేశ్ సర్కార్.. ఏ రోజు మాట ఆ రోజు మర్చిపోతున్నట్లుగా ఉంది. ప్రజలను స్వయంగా కలిసి .. వారి బాధలు విని అక్కడికక్కడే పరిష్కారం చూపాలన్న ఆశయంతో.. సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రజాదర్భార్ నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా విడుదల చేశారు. ఆగస్టు ఒకటో తేదీ నుంచి ప్రజాదర్బార్ ఉంటుందని.. గతంలో ఘనంగా మీడియాకు కూడా చెప్పారు. కానీ.. ఒకటో తేదీ రానే వచ్చింది. కానీ.. సీఎం జగన్ మాత్రం..జెరూసలేం పర్యటనకు వెళ్లిపోయారు. అధికారులు కూడా.. సైలెంటయిపోయారు. మరి గతంలో చేసిన ప్రకటనకు.. కనీసం.. సవరణ అయినా.. ప్రకటించాలన్న ఆలోచన కూడా చేయలేదు.
నిజానికి ప్రజాదర్బార్ విషయంలో… ప్రభుత్వం, అధికారులు….పదే పదే తప్పులు చేస్తున్నారు. జూన్ నెలాఖరులోనే… వైఎస్ రాజశేఖర్ రెడ్డి తరహాలో ప్రజాదర్బార్‌ను జగన్ జూలై ఒకటో తేదీ నుంచి ప్రారంభించబోతున్నారని.. ఆయన క్యాంప్ ఆఫీసులో… ప్రజలను కలుస్తారని ప్రకటించారు. జూన్ 29వ తేదీన సీఎంవో నుంచి దీనిపై అధికారిక ప్రకటన వచ్చింది. ప్రతీ రోజూ.. ప్రజాదర్బార్‌లో పాల్గొన్న తర్వాతే సీఎం తన రోజువారీ అధికారిక కార్యక్రమాలు, శాఖాపరమైన సమీక్షల్లో పాల్గొంటారని గొప్పగా ప్రకటించారు. కానీ జూన్ 30వ తేదీనే మళ్లీ వాయిదా ప్రకటన చేశారు. ఏర్పాట్లు పూర్తి చేయలేకపోయామని.. ఆగస్టు ఒకటి నుంచి… ప్రజాదర్బార్ ఉంటుందని ప్రకటించారు. కానీ ఆగస్టు ఒకటి వచ్చే సరికి.. సైలెంట్‌గా ఉండిపోయారు.
నిజానికి జూలై ఒకటో తేదీన ప్రజాదర్బార్ ఉంటుందనే ప్రచారంతో… అప్పట్లో పెద్ద ఎత్తున జనం తరలి వచ్చారు. తొక్కిసలాట కూడా జరిగింది. అంటే.. ప్రజల్లో… జగన్మోహన్ రెడ్డికి తమ ఇబ్బందులు చెప్పుకోవాలన్న ఆతృత ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి సమయంలో.. ప్రజాదర్బార్ విషయంలో.. ప్రజలకు మరింత క్లారిటీ ఇవ్వాల్సింది. కానీ.. ముందుగా ప్రకటించినట్లు ఆగస్టు ఒకటి నుంచి ప్రజాదర్బార్ ఉండదని.. అధికారిక ప్రకటన కూడా చేయడానికి అధికారులు సంకోచించారు. దీంతో ప్రజలు ఊసూరుమనాల్సి వచ్చింది. ఎప్పటి నుంచి జరుగుతుందో అయినా చెప్పాలని… ఆయనకు తమ బాధలు వినిపింంచాలనుకునేవాళ్లు కోరుకుంటున్నారు.