వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన మార్క్ రాజకీయాలను.. టాలీవుడ్‌పై ప్రదర్శిస్తోందా..? పోసాని కృష్ణమురళీ, ధర్టీ ఇయర్స్ ఫృధ్వీలను పావుగా వాడుకుంటోందా..? అనే అనుమానాలు ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతున్నాయి. సహజంగా.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి.. టాలీవుడ్ పెద్దల మద్దతు లేదు. నాగార్జున లాంటి వారు జగన్‌తో సన్నిహితంగా ఉన్నప్పటికీ.. బహిరంగ మద్దతు ఇవ్వలేదు. వ్యాపార అవసరాలు.. ఇతర కారణాల వల్ల… కొంత మంది.. జగన్‌తో సన్నిహితంగా ఉన్నారు. కానీ.. మిగతా వారు మాత్రం దూరమే పాటిస్తున్నారు. ఎన్నికల సమయంలో.. చిన్న నటులు.. చాలా మంది వైసీపీలో చేరినప్పటికీ.. మెజార్టీ టాలీవుడ్ సైలెంట్‌గా ఉంది. ఎన్నికల్లో గెలిచిన తర్వాత కూడా.. టాలీవుడ్ లైట్ తీసుకుంది. దీంతో.. వైసీపీలోని తమ నేతలతోనే గేమ్ స్టార్ట్ చేశారన్న అభిప్రాయం ప్రారంభమయింది.
ధర్టీ ఇయర్స్ ఫృధ్వీ .. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేసినంందుకు.. జగన్‌కు మద్దతుగా మాట్లాడినందుకు తనకు సినిమా చాన్సులు కూడా రావడం లేదని.. ప్రచారం చేసుకున్నారు. దాంతో ఆయనకు.. జగన్మోహన్ రెడ్డి.. ఎస్వీబీసీ చానల్ చైర్మన్ పదవి ఇచ్చి ఉపాధి చూపించారు. ఈ ఉత్సాహంలో ఫృధ్వీ టాలీవుడ్ పెద్దలపై తీవ్రమైన విమర్శలు చేశారు. జగన్మోహన్ రెడ్డి సీఎం కావడం.. వారెవరికీ ఇష్టం లేదన్నారు. ఇంత వరకూ.. జగన్‌కు ఒక్క సారి కూడా.. శుభాకాంక్షలు చెప్పలేదని గుర్తు చేశారు. అదే సమయంలో.. చంద్రబాబు గెలిచి ఉంటే.. విమానాలేసుకుని అమరావతిలో వాలి పోయేవాళ్లని… అంటున్నారు. ఫృధ్వీ వ్యాఖ్యలు టాలీవుడ్లో సహజంగానే చర్చనీయాంశం అయ్యాయి.
అయితే.. అనూహ్యంగా ఇప్పుడు… వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మరో హార్డ్ కోర్ సపోర్టర్.. పోసాని కృష్ణమురళీ రంగంలోకి దిగారు. ఫృధ్వీ వ్యాఖ్యలను తప్పు పట్టారు. తొందరపాటుతో అన్నారని… తీర్మానించారు. జగన్మోహన్ రెడ్డిపై.. టాలీవుడ్ పెద్దలకు వ్యతిరేకత లేదని.., వారు ఆయనను కలవడానికి ఆసక్తిగా ఉన్నారన్నట్లుగా చెప్పుకొచ్చారు. నిర్మాత సురేష్ బాబు. జగన్ అపాయింట్మెంట్ కూడా అడిగారని చెప్పుకొచ్చారు. ఓ వైపు ఫృధ్వీ విమర్శలు చేస్తూంటే.. మరో వైపు.. పోసాని మాత్రం టాలీవుడ్ పెద్దల్ని వెనకేసుకొస్తున్నారు.
ఇదంతా.. ప్రణాళిక ప్రకారం చేస్తున్నారని.. రాజకీయ వ్యూహాల గురించి అవగాహన ఉన్న వాళ్లు అంచనా వేస్తున్నారు. ముందుగా.. ఫృధ్వీతో.. బ్లాక్‌మెయిలింగ్ తరహా ప్రకటనలు చేయించి.. ఆనక తానున్నానని పోసాని ముందుకు వచ్చారని… అంటున్నారు. టాలీవుడ్ పెద్దల్ని… వైసీపీకి దగ్గర చేసేందుకే ఈ వ్యూహం అంటున్నారు. ఎవరికైనా అధికార పార్టీ అండ కావాలి కాబట్టి… ఈ వ్యూహం ఎంతో కొంత వర్కవుట్ అయినా.. ఆశ్చర్యపోవాల్సిందేమీ లేదన్న అభిప్రాయం కూడా టాలీవుడ్లో ఏర్పడిపోతోంది.