శుక్రవారం నుంచి ముద్రగడ పద్మనాభం దీక్షకు కూర్చోబోతున్న నేపథ్యంలో దానిని విరమింపజేయడానికి తుది ప్రయత్నంగా తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఆయనతో మంతనాలకు వెళ్లారు. తమ పార్టీకి చెందిన ప్రభుత్వం తమ లక్ష్యం కోసం నిర్దిష్టమైన పనులు ఇప్పటికే ప్రారంభించింది గనుక.. దీక్ష చేయవద్దంటూ ఆయనను కోరడానికి వెళ్లారు. అయితే వెళ్లిన వారు కాస్తా తాము ప్రభుత్వం తరఫున దూతల్లాగా తెలుగుదేశం పార్టీ ప్రతినిధుల్లాగా రాలేదని.. కేవలం సమాజం పట్ల బాధ్యత ఉన్న ఎమ్మెల్యేలుగా మాత్రమే వచ్చామని.. సన్నాయి నొక్కులు నొక్కడం విశేషం.
ముద్రగడ దీక్ష అనేది చంద్రబాబునాయుడు సర్కారులో ప్రకంపనలు రేకెత్తిస్తున్న మాట వాస్తవం. కాపుగర్జన పేరిట ఆయన పిలుపు ఇస్తే తుని లో ఎంతటి హింస చెలరేగినదో అందరికీ తెలుసు. ఇప్పుడు మళ్లీ ముద్రగడ నిరాహార దీక్షకు పిలుపు ఇచ్చినప్పటికీ.. దాని పట్ల ప్రభుత్వంలో చాలా భయాలున్నాయి. నిజానికి ముద్రగడ ఇంట్లోనే దీక్ష చేస్తానని ఎవ్వరూ రావొద్దని, ఎవరికి వారు తమ ఇళ్లలోనే దీక్ష లు చేయాలని అంటున్నారు. కానీ ఆయన మాటకు స్పందన ఆయన చెబుతున్నట్లుగా ఉండకపోవచ్చు. మరోవైపు పోలీసులు కూడా ఎవ్వరినీ దీక్ష కోసం జిల్లాకు రావొద్దని అంటున్నారు. 5 వేల మందికి పైగా పోలీసుల్ని మోహరించారు. ఇదంతా చాలా భారీ ఏర్పాట్లు కింద లెక్క. ప్రభుత్వంలో దీక్ష పట్ల భయానికి నిదర్శనాలు.
ఇంత జరుగుతూ ఉంటే.. దీక్షకు కొన్ని గంటల ముందు ముద్రగడతో మంతనాలకు వెళ్లిన తెలుగుదేశం ఎమ్మెల్యేలు మాత్రం.. తాము ప్రభుత్వం తరఫున రాలేదని చెప్పడం ఎందుకో అర్థం కావడం లేదు. ప్రభుత్వం తరఫున దూతలుగా రావడం తప్పేమీ కాదు. అలా దూతలను పంపినంత మాత్రాన చంద్రబాబు కిరీటం ఒరిగిపోయిందని జనం ఎవ్వరూ అనుకోరు. చంద్రబాబు మెట్టు దిగి వచ్చేసినట్టు కాదు. చివరివరకు దీక్షను ఆపడానికి ఒక ముఖ్యమంత్రిగా ఆయన చేయదగిన అన్ని ప్రయత్నాలు మనస్ఫూర్తిగా చేశాడనే మంచిపేరే ఆయనకు కూడా వస్తుంది. నిజానికి ముద్రగడ తాజా డిమాండ్లను తెలుసుకుని రావడం తప్ప ఈ కాపు ఎమ్మెల్యేలు చేసింది కూడా ఏమీ లేదు. మరి శుక్రవారం ఉదయం 9 గంటలలోగా చంరదబాబునాయుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.