మేము ఒక్కరం ఒకవైపు… మిగతావారంతా మరొకవైపు అన్నట్టుగా మాట్లాడుతున్నారు తెలంగాణ భాజపా అధ్యక్షుడు లక్ష్మణ్. తాజాగా ఓ ప్రెస్ మీట్లో మాట్లాడుతూ… 2023 లేదా అంతకన్నా ముందుగా ఎన్నికలు ఎప్పుడు వచ్చినా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది తామేననీ, ప్రత్యామ్నాయం భాజపా మాత్రమే అన్నారు. తెరాస మీద రాష్ట్రంలో తీవ్రమైన వ్యతిరేకత ఉందన్నారు. రాబోయే రోజుల్లో భాజపాని ఎదుర్కోవడం తెరాసకు సింగిల్ గా కష్టమౌతుందనీ, ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీతో కలిసే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే ఆ రెండు పార్టీలూ చాలాసార్లు కలిసి పనిచేశాయని గుర్తు చేశారు.
ఇప్పటికే తెరాస, ఎం.ఐ.ఎంలు కలిసి ఉన్నాయి కాబట్టి… వీరితోపాటు కాంగ్రెస్ ని కూడా సమీప భవిష్యత్తులో చేర్చుకుంటారన్నారు లక్ష్మణ్. ఈ మూడు పార్టీలు కలిసినా తమను ఎదుర్కోవడం కష్టమే అన్నారు. తెరాస కారు డ్రైవింగ్ సీట్లో ఎం.ఐ.ఎం. ఉందని సాక్షాత్తూ అసదుద్దీన్ స్వయంగా చెప్పారని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుతూ… 12 మంది శాసన సభ్యులను కాపాడుకోలేని ఉత్తమ్ కుమార్ రెడ్డి తమపై విమర్శలు చేయడం సరికాదన్నారు. తెరాసతో చెట్టపట్టాలేసుకుని గతంలో తిరిగింది కాంగ్రెస్ పార్టీ అవునో కాదో ఉత్తమ్ చెప్పాలన్నారు. కాంగ్రెస్ పార్టీ హాస్పిటల్లో ఉందనీ, గాంధీ భవన్ ని ఖాళీ చేసి అద్దెకి ఇచ్చేస్తే మంచిదని లక్ష్మణ్ ఎద్దేవా చేశారు.
ఇంతకీ, భాజపా ప్రయత్నం ఏంటంటే… రాష్ట్రంలో తాము చాలా బలపడుతున్నామనే అభిప్రాయం కలిగించడం. ఇప్పటికే తెరాస నేతలు ఏమంటున్నారూ… మేం నంబర్ వన్, రెండో ప్లేస్ కోసం భాజపా కాంగ్రెస్ లు పోటీ పడుతున్నాయన్నారు. అంతేకాదు, మున్సిపల్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా భాజపాకి దక్కకూడదంటూ ప్రధాన పోటీ భాజపాతో మాత్రమే అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఈ క్రమంలో భాజపా తమకంటే తక్కువే అనే అభిప్రాయాన్ని వారు ప్రచారం చేసుకుంటున్నారు. కాబట్టి, తమని తాము చాలా బలవంతులుగా ప్రొజెక్ట్ చేసుకోవాలంటే… తమని ఎదుర్కోవడానికి మూడు పార్టీలు కలిసినా సాధ్యం కాదనే విధంగా ఇప్పుడు లక్ష్మణ్ మాట్లాడుతున్నారు. అంటే, అంత బలపడ్డామని చెప్పడానికే ఈ వ్యాఖ్యలు. ప్రాక్టికల్ గా చూసుకుంటే… ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కాంగ్రెస్ తో అంటకాగే అవకాశం, అవసరం తెరాసకి లేదు. ఇప్పటికీ తెరాసకు ప్రధాన ప్రత్యర్థి పార్టీ కాంగ్రెస్సే. ఆ స్థాయికి భాజపా వచ్చిందో లేదో అనేది కనీసం కొన్ని ఎన్నికలు గడిచాక తెలుస్తుంది.