భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా.. హోంమంత్రిగా కూడా బిజీగా ఉన్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ను నియమించుకున్నా.. ఆయన కొన్ని ప్రత్యేకమైన లక్ష్యాలను పెట్టుకున్నారు. ఆ లక్ష్యాల్లో తెలంగాణ ఉంది. అందుకే.. తెలంగాణపై ప్రత్యేక దృష్టి పెట్టారు. నేరుగా రంగంలోకి దిగుతున్నారు. తానే.. తెలంగాణలో.. క్రియాశీలక సభ్యత్వం తీసుకోబోతున్నారు. అమిత్ షాకు ప్రాధమిక సభ్యత్వం.. గుజరాత్లో ఉంది. కానీ.. క్రియాశీలక సభ్యత్వాన్ని మాత్రం తెలంగాణలో తీసుకోవాలనుకుంటున్నారు. యాభై మందిని చేర్పిస్తే.. క్రియాశీలక సభ్యత్వం వస్తుంది. అందుకే.. తెలంగాణలో ఆయన ఇంటింటికి తిరిగి యాభై మందిని చేర్పించబోతున్నారు. ఆగస్టు పదిహేను తర్వాత ఆయన పర్యటన ఉండనుంది.
కర్ణాటకలో బీజేపీ సర్కార్ ఏర్పాటు చేసినప్పటి నుంచి.. తెలంగాణ నేతల ఉత్సాహం మామూలుగా లేదు. నేడు కర్ణాటక.. రేపు తెలంగాణ అంటూ.. ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఈ స్లోగన్ను.. క్యాడర్లోకి తీసుకెళ్లేందుకు… ముఖ్యనేతలు కూడా..తెలంగాణకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శులు రామ్మాధవ్, మురళీధర్ రావు తరచూ తెలంగాణలో పర్యటిస్తూ.. అలాంటి ఊపు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. బీజేపీకి ఓ మాదిరి నేతలున్నా… గ్రామస్థాయిలో బలం లేదు. నియోజకవర్గ స్థాయిలోనూ గట్టి నేతలు లేరు. ముందుగా బలపడాలంటే.. వీరిని ఆకర్షించాలి. అందుకే.. భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యాలయం నుంచి.. నేతల చేరికలను ప్రొత్సహిస్తున్నారు. ఇతర ప్రధాన పార్టీల్లోని నేతలను గుర్తించి… వారిని పార్టీలోకి తీసుకొచ్చేందుకు … సామ, బేద, దాన, దండోపాయాల్ని ప్రదర్శిస్తున్నారు.
ఇప్పటికే.. తెలంగాణలో.. పలువురు టీడీపీ, కాంగ్రెస్ నేతలే కాదు.. సోమారపు సత్యనారాయణ లాంటి టీఆర్ఎస్ నేతలు కూడా చేరిపోయారు. ఆషాఢం కాబట్టి.. మరికొందరు ఆగిపోయారని.. శ్రావణంలోనే.. తెలంగాణ టూర్ కి రాబోతున్న అమిత్ షా సమక్షంలో.. భారీ చేరికలు ఉంటాయని.. ఇప్పటికే బీజేపీ నేతలు ప్రకటించారు. మిగిలిపోయిన కాంగ్రెస్, టీడీపీ నేతలు కాదు… అధికార పార్టీ నుంచే వచ్చి చేరబోతున్నారని… బీజేపీ నేతలంటున్నారు. ఇందులో..కొన్ని పెద్ద పెద్ద పేర్లు కూడా ఉన్నాయంటున్నారు. అమిత్ షాకే.. తెలంగాణలో క్రియాశీలకం అయితే.. ఇక బీజేపీ హడావుడికి ఏ కొదువ ఉంటుంది..?