పోలవరం స్పిల్‌వే, హెడ్‌వర్క్స్ పనులు, హైడల్ విద్యుత్ ప్రాజెక్ట్ నిర్మాణ పనులు చూస్తున్న నవయుగ కంపెనీకి ఏపీ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. పనులు ఎక్కడివక్కడ నిలిపివేయాలని.. నోటీసులు ఇచ్చింది. ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పోలవరంపై నిపుణుల కమిటీని నియమించారు. నిపుణుల కమిటీ ఆధారంగా పోలవరం రివర్స్ టెండరింగ్ కు వెళ్లబోతున్నామని.. అసెంబ్లీలోనే అధికారికంగా ఏపీ సర్కార్ ప్రకటిచింది. ఈ క్రమంలోనే తాజా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రాజెక్టు నిర్మాణంలో నిబంధనలన్నీ అతిక్రమించారని.. రూ.3,128.31 కోట్లు అదనపు చెల్లింపులు జరిగాయంటూ ప్రభుత్వం నియమించిన రిటైర్డ్ ఇంజనీర్ల కమిటీ రెండు దఫాలుగా నివేదికలు సమర్పించింది. అవకతవకలు జరిగాయని నిర్ధారించుకున్న ఏపీ ప్రభుత్వం ప్రస్తుత వ్యవస్థతో కాకుండా కొత్త కాంట్రాక్టు సంస్థలతో ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయడం మంచిదని ప్రభుత్వం భావిస్తోంది.
నిజానికి నవయుగ కంపెనీకి పనులు అప్పగించింది.. కేంద్ర ప్రభుత్వమే. 2013లో హెడ్‌వర్క్స్ పనులను ట్రాన్స్‌స్ట్రాయ్ దక్కిచుకుంది. కానీ పనులు చేయలేకపోయింది. అంచనాల కంటే… 14 శాతం తక్కువకు టెండర్ వేసింది ట్రాన్స్ట్రాయ్. కానీ గిట్టుబాటు కాక పనులు చేయలేకపోయింది. ట్రాన్స్ ట్రాయ్ కు 60సి కింద నోటీసులు జారీ చేసి కొత్త టెండర్లను అప్పట్లో ఏపీ ప్రభుత్వం ఆహ్వానించింది. అయితే అప్పటి కేంద్ర జలవనలశాఖ కార్యదర్శి అమర్జీత్ సింగ్ ఈ టెండర్లను నిలిపివేశారు. ట్రాన్స్ ట్రాయ్ అంగీకరించిన మైనస్ 14శాతం ధరలకు పనులు చేపట్టడానికి ఎవరైనా ముందుకు వస్తే.. ఇవ్వాలని సూచించారు. ఈ మేరకు నవయుగ సంస్థ ముందుకు వచ్చింది. గడ్కరీ ఆమోదంతో.. నవయుగ పనులు చేపట్టింది.
నవయుగ పనులను కూడా ముందుకు పరుగెత్తించింది. పోలవరం స్పిల్ వే లో రికార్డు స్థాయిలో కాంక్రీటు వేసి నవయుగ సంస్థ గిన్నీస్ బుక్ లో కూడా ఎక్కింది. రివర్స్ టెండరింగ్‌కు వెళ్లాలనుకున్న ఏపీ సర్కార్… అలా నవయుగకు కాంట్రాక్ట్ ఇవ్వడం నిబంధనలకు విరుద్ధమని నిర్ణయించుకుని.. పనులు ఆపేయాలని నోటీసులు ఇచ్చింది. నవయుగను తొలగించడం పై పోలవరం ప్రాజెక్టు అథారిటీ, కేంద్ర జలవనరులశాఖ ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. జాతీయ ప్రాజెక్టు కావడంతో పోలవరం ప్రాజెక్టులో ఎటువంటి మార్పులు చేయలన్నా, కొత్తగా టెండర్లు పిలవాలన్నా కేంద్రం అనుమతి తీసుకోవాల్సి ఉంది. ఇప్పుడు నోటీసులు ఇవ్వడంతో.. పనులన్నీ ఆగిపోవడం ఖాయమే. మళ్లీ.. కేంద్రం… అంగీకరించి.. కొత్త టెండర్లు పిలిచి.. అదీ కూడా.. ఇప్పుడు చేస్తున్న ధరల కంటే.. తక్కువకే పనులు చేసే సంస్థలు వస్తేనే మళ్లీ పనులు ప్రారంభమవుతాయి. లేకపోతే… పోలవరం ఆగినట్లే..!