ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అన్న క్యాంటీన్లు మూత పడ్డాయి. రుచిగా, శుచిగా తక్కువ ధరకే భోజనం పెడుతున్న అన్న క్యాంటీన్లకు విశేష ఆదరణ ఏర్పడింది. పేద ప్రజలు, నిరాశ్రయులు, వీధుల వెంట తిరిగేవారు ఇలా అనేకమందికి ఆకలి తీర్చేందుకు గత టిడిపి ప్రభుత్వం అన్న క్యాంటీన్ ఏర్పాటు చేసింది. తొలుత నగరాల్లో ప్రారంభించిన క్యాంటీన్లకు మంచి ఆదరణ లభించడంతో పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో సైతం నెలకొల్పారు. మొత్తం 210 అన్న క్యాంటీన్లు మూడు పూటలా.. కార్మికులు, పేదలు, అనాధల కడుపు నింపాయి. అయితే కొత్తగా వచ్చిన జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ అన్న క్యాంటీన్ ల నిర్వహణ భారంగా భావించింది. అన్న క్యాంటీన్లకు భోజనం సరఫరా చేసేందుకు అప్పటి ప్రభుత్వం అక్షయపాత్ర ఫౌండేషన్ కు మూడు సంవత్సరాలకు కాంట్రాక్ట్ ఇచ్చింది.
ఈ కాంట్రాక్ట్ ముగియకముందే బుధవారం రాష్ట్ర ప్రభుత్వం ఉన్నతాధికారులు క్యాంటీన్లను మూసివేయాలని అక్షయపాత్ర ఫౌండేషన్ ప్రతినిధులకు మౌఖికంగా ఆదేశాలు ఇచ్చారు. దీంతో అక్షయపాత్ర ఫౌండేషన్ గురువారం ఉదయం నుంచి క్యాంటీన్లను మూసివేసింది. అసెంబ్లీలో అన్న క్యాంటిన్లు మూసి వేయడం లేదని… ఆదరణ లేని వాటిని గుర్తించి విడతల వారీగా మూసివేస్తామని చెప్పుకొచ్చారు. కానీ పూర్తిగా మూసేశారు. అన్న క్యాంటీన్లలో రుచిగా, శుచిగా అల్పాహారం, భోజనం వడ్డిస్తుండటంతో నగరాలు, పట్టణాలకు వివిధ పనులపై వచ్చే పేద, మధ్య తరగతి వర్గాలు అన్న క్యాంటీన్లకు ఆకర్షితులయ్యారు.
తక్కువ ధరకు మంచి భోజనం దొరుకుతుండటంతో అన్న క్యాంటీన్లలో అనేక మంది భోజనాలు చేస్తున్నారు. పేదల కడుపు నింపుతున్న క్యాంటీన్ లను మూసి వేయడం సరికాదని వైసీపీ నేతలు కూడా అంటున్నారు. తెలంగాణలో కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో.. హైదరాబాద్లో ఐదు రూపాయకే భోజనం పథకం ప్రవేశపెట్టారు. కేసీఆర్ దాన్ని మరింత విస్తృత పరిచారు కానీ.. తగ్గించలేదు. కానీ ఏపీ సర్కార్ మాత్రం.. రాజకీయ కారణాలతోనే అన్న క్యాంటీన్లను మూసివేసిందనే విమర్శలు వస్తున్నాయి. పేదల ఆకలి తీర్చడంలో.. రాజకీయం చూడకూడదన్న సూచనలు వస్తున్నాయి. కానీ పట్టించుకునేవారెవరు..?