“అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో సీపీఎస్ రద్దు చేస్తాం… కమిటీల పేరుతో కాలయాపన చేయను.. ” అని ఎన్నికల ప్రచారం హామీ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు… కమిటీలతోనే కాలక్షేపం చేస్తున్నారు. మొదటి కేబినెట్ సమావేశంలో… సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి.. పాత పెన్షన్ విధానాన్ని తీసుకొచ్చేందుకు జగన్ నిర్ణయించారని.. ప్రకటించారు. దాని కోసం.. బుగ్గున రాజేంద్రనాథ్ రెడ్డి నేతృత్వంలో కమిటీ వేశారు. ఆ కమిటీ ఇంకా పని ప్రారంభించిందో లేదో క్లారిటీలేదు. రెండు నెలలు గడిచిపోయాయి. కానీ ఇప్పుడు కొత్తగా మరో కేబినెట్ సబ్ కమిటీని నియమించారు. ఈ కమిటీకి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి నేతృత్వం వహిస్తారు. ఆదిమూలపు సురేష్, పెద్దిరెడ్డి, ఆళ్ల నాని సభ్యులుగా ఉంటారు.
ఈ కమిటీ సీపీఎస్ విధానంపై.. చంద్రబాబు సర్కార్ వేసిన టక్కర్ కమిటీ ఇచ్చిన నివేదికను పరిశీలిస్తుంది. సీపీఎస్ విధానంపై ఈ ఏడాది ఫిబ్రవరి 28న చంద్రబాబు ప్రభుత్వానికి టక్కర్ కమిటీ నివేదిక సమర్పించింది. ఈ కమిటీ నివేదికలో.. కంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దు చేసే విచక్షణాధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉరదని తేల్చింది. టక్కర్ నేతృత్వంలో ఏర్పాటుచేసిన నిపుణుల కమిటీ ప్రభుత్వానికి 141 పేజీల నివేదికను సమర్పించింది. సీపీఎస్ ను రద్దు చేసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని చెబుతూనే రెండు ఆప్షన్లను కూడా ప్రభుత్వం ముందు ఉంచింది. సీపీఎస్ రద్దు చేయడం లేదా..సీపీఎస్ ను కొనసాగించి … పాత పెన్షన్ విధానం వల్ల వచ్చే ప్రయోజనాలన్నింటినీ కల్పించడం… ఆప్షన్లుగా ఇచ్చింది.
బుగ్గన నేతృత్వంలోని కమిటీ… ఠక్కర్ కమిటీ ఇచ్చిన నివేదికను పరిశీలించి… ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతుంది. దాని ఆధారంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. అయితే… ఇది కాలయాపనకేనని ఉద్యోగ సంఘాలు ఆగ్రహిస్తున్నాయి. వారంలో సీపీఎస్ రద్దు చేస్తామన్న ప్రకటనను గుర్తు చేస్తున్నాయి.