బిగ్‌బాస్ రియాల్టీ షోపై న్యాయపోరాటం చేస్తున్న టీవీ యాంకర్ శ్వేతారెడ్డి… తన పోరాటానికి ఫలితం రావాలనుకుంటున్నారో.. ప్రచారా కావాలనుకుంటున్నారో కానీ… హద్దులు దాటి పోయారు. ప్రెస్‌క్లబ్‌లో ప్రత్యేకంగా మీడియా సమావేశం పెట్టి.. బిగ్ బాస్ హోస్ట్, స్టార్ హీరో నాగార్జునపై.. తిట్ల దండకం వినిపించారు. ఆ తిట్లు కూడా.. పూరి జగన్నాథ్ సినిమా టైటిల్స్ లా లేవు. జంధ్యాల సినిమాల డైలాగ్స్‌లా.. కామెడీగా లేవు. మహిళలు కొళాయిల దగ్గర కొట్లాడుకుంటే.. ఎలాంటి తిట్లు వస్తాయో… అలాంటి తిట్లనే దండకంగా వినిపించారు. ఆమె భాష విని..మీడియా ప్రతినిధులు కూడా.. చెవులు మూసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.
అన్యాయం జరుగుతోందని పోరాడుతూంటే..ఎందుకు స్పందించరని నాగార్జునను ప్రశ్నించారు. టాస్క్‌ల పేరిట కంటెస్టెంట్‌లను మానసికంగా హింసిస్తున్నారని.. మండిపడ్డారు. తాము చేస్తున్న పోరాటాన్నినీటి బుడగ అన్నారని.. మేం కాదు గాలి బుడగలం.. ఓయూ విద్యార్థులకు నాగార్జుననే ఓ గాలి బుడగ అని మండిపడ్డారు. అంతే కాదు. ఒక రోజు మీ భార్య అమలను కోడలు సమంతను బిగ్‌బాస్ హౌస్‌లో వుంచి డబ్బులు సంపాదించండి అని తీవ్రమైన విమర్శలు చేశారు. తప్పుచేయకుంటే బయటికి వచ్చి స్పందించాలి… నాగార్జున ఎందుకు దొంగలాగా దాక్కుంటున్నారని మండిపడ్డారు. నాగార్జున డబ్బులకు ఏమైనా చేస్తావా..?. మీ ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉన్నారు కదా ” అని చెలరేగిపోయారు.
బిగ్‌బాస్ టీవీ టీఆర్పీల్లో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఎన్టీఆర్ హోస్ట్ చేసిన మొదటి సీజన్ కన్నా… నాగార్జున హోస్ట్ చేస్తున్న మూడో సీజన్ రేటింగ్స్ ఎక్కువగా ఉండటంతో ఆ షో టీవీ వ్యూయర్స్ ను ఎంత ఎక్కువగా ఆకట్టుకుందో అర్థం చేసుకోవచ్చు. నిజానికి బిగ్‌బాస్ వ్యవహారం కోర్టులో ఉంది. శ్వేతారెడ్డి, గాయత్రి గుప్తా పోలీసులకు ఫిర్యాదు చేశారు. కోర్టుకు వెళ్లారు.మా టీవీ ప్రతినిధులు కూడా కోర్టుకు వెళ్లారు. దానికి సంబంధించిన న్యాయపరమైన ప్రక్రియ జరుగుతోంది. అయితే శ్వేతారెడ్డి మాత్రం.. వారంలో రెండు మూడు రోజుల పాటు మీడియా సమావేశాలు పెట్టి.. విమర్శల ఘాటు పెంచుకుంటూ పోతున్నారు. అది తిట్ల స్థాయికి వచ్చింది. తర్వత ఏం చేస్తారో మరి..!