ఎన్నికల్లో ఓటమి తరువాత గణనీయమైన మార్పు దిశగా విశ్లేషణలు చేస్తున్నారు జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్. గడచిన మూడు రోజులుగా వరుసగా సమీక్షలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. నాయకత్వ లోపమే ఓటమికి కారణమని పవన్ బహిరంగంగానే ఇప్పటికే చెప్పారు. అయితే, ఆ లోపాన్ని గుర్తించారు కాబట్టి, మరో నాలుగేళ్లలో కొత్త నాయకత్వాన్ని తయారు చేసుకునే దిశగా ప్రణాళికల్ని సిద్ధం చేయాలని పవన్ కల్యాణ్ భావిస్తున్నారని జనసేన వర్గాలు అంటున్నాయి. మరో నాలుగేళ్ల తరువాత పార్టీ సీట్ల కేటాయింపులు ఎలా ఉంటాయనేదానిపై ఇప్పట్నుంచే ఒక ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నారట!
జనసేనలో కొత్త రక్తం నింపుతామని మొదట్నుంచీ పవన్ చెబుతూ వచ్చారు. కొత్త రాజకీయాలు చేస్తామన్నారు. కానీ, తీరా ఎన్నికలకు వచ్చేసరికి… చాలామంది కొత్తవారికే సీట్లు కేటాయించారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన కొందర్ని చేర్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అంతేకాదు, వివిధ రంగాలకు చెందిన కొందరు సీనియర్లను కూడా చేర్చుకుని టిక్కెట్లు ఇచ్చారు. ఇక్కడే కొన్ని తప్పిదాలు జరిగాయని జనసేనాని గుర్తించారట. అందుకే, కొత్త నాయకత్వాన్ని ఇప్పట్నుంచే తయారు చేసుకోవాలనేది వ్యూహంగా తెలుస్తోంది. ప్రతీ నియోజక వర్గం నుంచి ముగ్గురు నాయకులను చొప్పున సిద్ధం చేయాలని ఆలోచిస్తున్నారని సమాచారం. దీంతోపాటు, రాష్ట్రంలో సమస్యల్ని ఎప్పటికప్పుడు గుర్తించడం కోసం ఐదుగురు సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేయాలనీ, ఏదైనా ఒక సమస్య మీద పవన్ కల్యాణ్ ఆందోళన కార్యక్రమాల్లాంటివి చేపట్టాలనుకుంటే ఆ కమిటీ ముందుగానే ఆ సమస్యపై అధ్యయనం చేసి సమగ్ర నివేదికను పవన్ కు అందించే బాధ్యతలు నిర్వహిస్తుందని చెబుతున్నారు.
గత ఎన్నికల్లో జనసేన తరఫున పోటీకి దిగిన దాదాపు అందరు అభ్యర్థులూ ఒక్క పవన్ ఇమేజ్ ను నమ్ముకుని మాత్రమే ముందుకు సాగారు. అంతేగానీ, సొంతంగా ఆయా నియోజక వర్గంలో గుర్తింపు సాధించుకోలేని పరిస్థితి ఉంది. వచ్చే ఎన్నికల నాటికి ఈ పరిస్థితి ఉండొద్దనీ, జనసేన తరఫున ప్రతీ నియోజక వర్గంలో కీలకంగా వ్యవహరించేవారుండాలనీ, అది కూడా వీలైనంత మంది యువతకు అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో ఇప్పట్నుంచీ పవన్ ఉన్నారని సమాచారం. ముందుచూపుతో ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని అనుకోవడం… వినడానికి బాగానే ఉంది. నియోజక వర్గానికి ముగ్గురు నాయకుల్ని తయారు చేయడం కూడా ఓకే! కానీ, ఎన్నికలు వచ్చేసరికి… ఈ ముగ్గుర్లో ఎవరికి సీటిస్తారు, మిగతా ఇద్దరూ అసంతృప్తికి గురవకుండా పార్టీకి పనిచేయాలంటే వారిని ఎలా బుజ్జగిస్తారనే ప్లాన్ కూడా ఉండాలి కదా. ఎందుకంటే, ఇప్పడు నాయకత్వం అవసరమనీ ప్రాతినిధ్యం పెంచాలనీ తొందరపడితే, అప్పుడు ఆధిపత్య పోరు తెరమీదికి రాకూడదు కదా. ఆ పరిస్థితిని కూడా అంచనా వేసి ముందుకెళ్తే మంచిదే.