తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల కోసం ప్రత్యేకమైన వ్యూహాన్ని సిద్దం చేసుకుంటోంది. సామాజిక సమీకరణాల సంగతి పక్కన పెడితే.. సింగిల్ లైన్ మేనిఫెస్టోను రెడీ చేసుకుంది. ఆ సింగిల్ లైన్లో.. ప్రతి ఇంటికి రూ. పది లక్షలు అని ఉంటుంది. ఏంటి.. మున్సిపల్ ఎన్నికల్లో గెలిస్తే.. కాంగ్రెస్ ప్రతి ఇంటికి రూ. పది లక్షలు ఇస్తుందా..అని ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. కాంగ్రెస్ పార్టీ ఇవ్వదు. ఇస్తామని చెప్పరు కూడా. ఇవ్వాలనే డిమాండ్‌తో.. మున్సిపల్ ఎన్నికల్లో ముందుకెళ్లబోతున్నారు. ప్రజల్లో సెంటిమెంట్‌ను రేపి… “మా పది లక్షలు.. మాకివ్వండి..” అనే పద్దతిలో ప్రభుత్వంపై విరుచుకుపడేలా.. వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు.
ఇటీవల సీఎం కేసీఆర్ తన సొంత గ్రామం చింతమడకలో పర్యటించి ఇంటికి పదిలక్షలు ఇస్తున్నట్లు ప్రకటించారు. దీన్నే కాంగ్రెస్ అందుకుంది. కేసీఆర్ నిర్ణయాన్ని ప్రశంసిస్తూనే… రాజకీయం ప్రారంభించింది. ప్రభుత్వ నిర్ణయం ఆధారంగా తెలంగాణ ప్రజల్లో సెంటిమెంట్ ను రగిలించడానికి చింతమడక పథకాన్ని ఉపయోగించుకోవడానికి ప్లాన్ గీశారు. ఒక ముఖ్యమంత్రికి రాష్ట్రంలోని ప్రజలంతా సమానమే. అలాంటప్పుడు అన్ని ప్రాంతాల ప్రజలను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత కేసీఆర్ మీద ఉంది. రాష్ట్ర ఖజానా ప్రజాలందరిది. అందుకే చింతమడక మాదిరిగానే రాష్ట్రంలోని అన్ని కుటుంబాలకు పది లక్షలు ఇవ్వాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు.
ఈ రూ. పది లక్షల అంశాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లి తమకు పది లక్షలు ఎందుకు ఇవ్వరు అనే సెంటిమెంట్ ను ప్రజల్లో రగిలించాలని ప్లాన్ చేస్తున్నారు. ఇది మున్సిపల్ ఎన్నికల్లో వర్కవుట్ అయితే.. ముందు ముందు దీన్ని అసెంబ్లీ ఎన్నికలకూ తీసుకెళ్లొచ్చు. అసెంబ్లీ ఎన్నికల నాటికి దీన్నో ప్రచారాస్త్రంలా చేసుకుంటే.. ఐదేళ్లలో ఒక్కో కుటుంబానికి ప్రభుత్వం నుంచి రూ. పది లక్షలు అందిస్తామని చెప్పుకోవచ్చు. పథకాలన్నీ కలిపితే.. ఒక్కో నిరుపేద కుటుంబానికి ఏడాదికి.. రెండు లక్షల వరకూ అందుతాయన్న విశ్లేషణ ఇప్పటికే ఉంది. దీన్ని కాంగ్రెస్ పార్టీ మరింత మెరుగుపరిచి… అసెంబ్లీ ఎన్నికల నాటికి సింగిల్ లైన్ మేనిఫెస్టోగా.. ఇంటికి రూ. పది లక్షలు ప్రకటించినా ఆశ్చర్యం లేదనే వాదన వినిపిస్తోంది.