వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజుల్లోనే .. టిక్కెట్ త్యాగం చేసిన బాబాయ్ వైవీ సుబ్బారెడ్డిని టీటీడీ చైర్మన్గా నియమించారు. పది రోజుల్లో పాలక మండలిని నియమిస్తామన్నారు. కానీ 40 రోజులు గడిచిపోయినా పాలక మండలి ఊసే లేదు. సామాజిక సమీకరణాల్లో భాగంగా.. మంత్రి పదవులు దక్కని అనేక మంది ఎమ్మెల్యేలు తమకు టీటీడీలో చోటు కల్పించాలని ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తున్నారు. ఎన్నికలకు ముందు కనీసం రెండు వందల మందికి.. అధికారంలోకి వస్తే టీటీడీ బోర్డులో అవకాశం కల్పిస్తామనే హామీ ఇచ్చారు. వారంతా.. ప్రభుత్వ పెద్దల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. ఇక ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ఒత్తిళ్లు, బీజేపీ నేతల నుంచి వచ్చే సిఫార్సులు కూడా.. చాలా ఎక్కువగానే ఉన్నాయన్న ప్రచారం జరుగుతోంది.
గతంలో టీటీడి పాలకమండలిలో 15 మంది సభ్యులు ఉండేవారు. ప్రస్తం.. దీన్ని 27కు పెంచి.. మరింత మందికి అవకాశం కల్పించాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది. నామినేటడ్ పోస్టులలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 50శాతం .. మళ్లీ అందులో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టం చేయడంతో.. పాలకమండలి విషయంలో కొత్త చిక్కు ముడులు వచ్చి పడ్డాయి. దీంతో.. ప్రభుత్వ పెద్దలు కసరత్తును కూడా తాత్కలికంగా నిలిపి వేసినట్లుగా చెబుతున్నారు. చైర్మన్ ఉన్నా… పాలకమండలి లేకపోవడంతో పాలనపరమైన నిర్ణయాలు తీసుకున్నే అవకాశం లేదు. దీంతో చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పరిశీలనకే పరిమితమవుతున్నారు.
పాలకమండలి నియమాకం పూర్తయ్యిన వెంటనే వైవి పలు కీలక నిర్ణయాలు తీసుకోవాలని వైవీ సుబ్బారెడ్డి భావిస్తున్నారు. వీఐపీ బ్రేక్ దర్శనం… సహా అనేక అంశాలపై ఇప్పటికే.. కొన్ని ప్రకటనలు చేశారు. టీటీడీలో అవినీతిని బయట పెడతానని సవాల్ కూడా చేశారు. ఈ క్రమంలో.. ఆయన టీటీడీ ఈవోకు ఇప్పుడు ప్రాధాన్యం తగ్గించేశారు. గతంలో పని చేసిన ధర్మారెడ్డిని ఢిల్లీ నుంచి తీసుకొచ్చారు. ధర్మారెడ్డి నేతృత్వంలో… టీటీడీని పరిపాలించాలనుకుంటున్న వైవీ సుబ్బారెడ్డికి పాలకమండలి ఏర్పాటు కాకపోవడం… నిరాశ కలిగిస్తోంది.