2012లో… ఈటీవీ అమ్మకం.. రూ. 2100 కోట్లు..!
ఈటీవీ నెట్‌వర్క్‌కు చెందిన చానళ్లను.. టీవీ18 గ్రూప్ కొనుగోలు చేసింది. ఈ డీల్ విలువ రూ. 2,100 కోట్లు. ఈ డీల్‌లో భారీగా లాభాలు తెస్తున్న… ఈటీవీ తెలుగు, ఈటీవీ 2 కాకుండా.. ఒకటి, రెండు మినహా.. అన్నీ నష్టాల్లో ఉన్న… ఐదు ప్రాంతీయ న్యూస్ చానళ్లలో వందశాతం, నాలుగు ఇన్ఫోటెయిన్‌మెంట్ చానళ్లలో.. యాభై శాతం వాటలకు ఈ మొత్తం విలువ వచ్చింది. ఇది ఎనిమిదేళ్ల కిందట..!
2014లో… మాటీవీ అమ్మకం.. రూ. రెండు వేల కోట్లపైనే..!
మా టీవీని స్టార్ గ్రూప్ కొనుగోలు చేసింది. మా గ్రూప్‌లో ఒక్క మా టీవీ తప్ప.. మ్యూజిక్, సినిమా ఇతర చానళ్లు ఉన్నాయి. అవన్నీ కంటెంట్ వాడుకుని వ్యూయర్ షిప్‌ను కౌంట్ చేసుకోవడానికి తప్ప పనికి రావు. అయినప్పటికీ.. మా గ్రూప్ అమ్మకం విలువ… రూ. రెండు వేల కోట్లకుపైగానే.
2018లో టీవీ9 అమ్మకం.. కేవలం రూ. 400 కోట్లకు అటూ ఇటూ..!
పై రెండు టీవీ చానళ్ల గ్రూప్‌లతో పోలిస్తే.. టీవీ9 గ్రూప్ చానళ్లు ఏ మాత్రం తీసిపోయినవి కావు. టీఆర్పీల పరంగా… టీవీ9 చానల‌్ అడుగు పెట్టిన ప్రతి రాష్ట్రంలోనూ నెంబర్‌వన్‌గా ఉంది. తెలుగులో దరిదాపుల్లో ఏ చానల్ లేదు. కన్నడ, గుజరాతీ, మరాఠీ, ఇంగ్లిష్..ఇలా ఏ భాషలో అయినా.. టీవీ9 తనదైన ముద్ర వేసింది. ఏ చానల్ కూడా నష్టాల్లో లేదు. గత ఏడాది.. టీవీ9 గ్రూప్ ఆదాయం రూ. 300 కోట్లకుపైగా మాటే. అలాంటి… అన్ని చానళ్లకు కలిపి.. మరీ మూడు, నాలుగు వందల కోట్లకే ఎలా అమ్మేశారు..?. ఈ డీల్ నమ్మశక్యమేనా..?
టాప్ ఫైవ్‌లో ఉండే ఒక్క చానల్ విలువే రూ. 400 కోట్లట..!
కొద్ది రోజుల క్రితం.. ఓ తెలుగు టీవీ చానల్ అమ్మకం ప్రతిపాదన వచ్చింది. బీజేపీకి సన్నిహితంగా ఓ ఎంపీ… ఆ చానల్‌ను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపించారు. ఆ చానల్ యజమానికి అమ్మకానికి సిద్ధమైనా… ధర మాత్రం.. రూ. నాలుగు వందల కోట్లకు తగ్గేది లేదన్నారు. ఆ టీవీ చానల్ నెంబర్ వన్ కాదు.. టూ కూడా కాదు. కానీ.. కాస్త గుర్తింపు తెచ్చుకుంది. ఆ కాస్త గుర్తింపు.. అదీ ఒక్క భాషలో ఉన్న చానల్‌కే.. రూ. నాలుగు వందల కోట్లు డిమాండ్ చేస్తూంటే.. టీవీ9 బ్రాండ్‌తో.. దేశం మొత్తం గుర్తింపు తెచ్చుకున్న టీవీ చానళ్లకు ఇంకెంత రేటు పలకాలి..? ఇదే ఇండస్ట్రీ వర్గాలను సైతం ఆశ్చర్య పరుస్తోంది.
టీవీ9 డీల్ వెనుక లోగుట్టు ఉందా..?
టీవీ9 గ్రూప్‌ను.. రూ. నాలుగు, ఐదు వందల కోట్లకు అమ్మేశారన్న ప్రచారం జరిగినప్పుడే.. పారిశ్రామిక వర్గాల్లో చర్చోపచర్చలు జరిగాయి. అంత తక్కువకు డీల్ పైకి మాత్రమే చూపిస్తున్నారు.. అంతర్గతంగా మరో డీల్ ఏదో ఉండే ఉంటుందని… చాలా మంది అనుకున్నారు. కానీ ఎవరూ సీరియస్‌గా తీసుకోలేదు. ఎందుకంటే.. ప్రస్తుతం.. ఆ డీల్ సెట్ చేసుకున్న వాళ్లు పవర్ ఫుల్ కాబట్టి. పైగా.. అమ్మినోళ్లు.. కొన్నోళ్లు.. అంతా బాగానే ఉన్నారు. కానీ ఎప్పుడైతే రవిప్రకాష్ .. వివాదం బయటకు వచ్చిందో.. అప్పట్నుంచే… టీవీ9 డీల్ వ్యవహారంపైనా చర్చ ప్రారంభమైంది. కార్పొరేట్ వర్గాలతో పాటు.. మీడియా వర్గాల్లోనూ ఇది హాట్ టాపిక్ అవుతోంది. తెర వెనుక జరిగిన లీడ్ ఏమిటో బయటకు రావాలన్నట్లుగా ఇప్పుడు జోరుగా చర్చలు సాగుతున్నాయి.
శ్రీనిరాజుకు అంతకు మించి దక్కిందా..?
ఐదారు చానళ్లు కలిపి.. ఏడాదికి.. మూడు, నాలుగు వందల కోట్ల ఆదాయం తీసుకొస్తున్న టీవీ చానళ్లను… మరీ అంతే.. మొత్తానికి శ్రీనిరాజు అమ్మారంటే ఎవరూ నమ్మలేదు. ఎందుకంటే.. ఆయన పారిశ్రామికవేత్త కాదు. పెట్టుబడిదారుడు మాత్రమే. పెట్టుబడి పెట్టి.. ఎంత ఎక్కువ లాభం వస్తే..అంత తీసుకుని వెళ్లిపోతారు. ఇక్కడ కూడా.. అలాగే చూసుకున్నారని చెబుతున్నారు. ఆ డీల్‌లోనే ఆ లాభం రావాలని ఆయన కోరుకోలేదంటున్నారు. ఓ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులో.. ఆయనకు కనీసం రూ. పదహారు వందల కోట్ల రూపాయల విలవైన లబ్ది కలిగేలా…కొంత వాటాను ఇచ్చారని చెబుతున్నారు. ఐ ల్యాబ్స్ పేరిట..టీవీ9 డీల్ తర్వాత చోటు చేసుకున్న వ్యాపార లావాదేవీలు ఈ విషయంపై చర్చనీయాంశమవుతున్నాయి.
మొత్తానికి టీవీ9 అమ్మకం డీల్ అనేది.. క్లోజింగ్ ఇష్యూ కాదు. ఇప్పుడే ప్రారంభమవుతున్న ఇష్యూగా.. భావిస్తున్నారు. కార్పొరేట్ రంగంలోని చీకటి కోణాన్ని టీవీ9 డీల్ వెల్లడిస్తుందని.. అది బయటపడటానికి ఎక్కువ రోజులు పట్టకపోవచ్చని అంటున్నారు. అదే జరిగితే… అంతకు మించిన సంచలనం ఇటీవలి కాలంలో బయటపడి ఉండదు.