కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను ఓ చారిత్రక తప్పిదంగా.. పేర్కొంటూ వస్తున్న కాంగ్రెస్ పార్టీకి.. ఈ వర్షాకాలం.. గొప్ప ఆయుధం ఇచ్చింది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా మేడిగడ్డ నుంచి అన్నారం బ్యారేజీకి గత నెల రోజులుగా 11 టీఎంసీలకుపైగా నీటిని ఎత్తిపోశారు. ఒక్క టీఎంసీకి రూ. కొటి వరకూ కరెంట్ బిల్లు అయింది. అలా.. దాదాపుగా పదకొండు టీఎంసీల వరకూ ఎత్తి పోశారు. అయితే.. ఈ ఎత్తిపోసిన నీటిని నిల్వ చేయడానికి ప్రత్యేకంగా ఏర్పాట్లు లేవు. వాటిని గోదావరిలోనే ఉంచాల్సి వచ్చింది. ఈ లోపే వరద వచ్చింది. శుక్రవారం మానేరు నది నుంచి వరద రావడంతో ఎత్తిపోసిన నీరు మొత్తాన్ని అన్నారం బ్యారేజీ నుంచి ఆరు గేట్లను ఎత్తి దిగువకు వదలాల్సి వచ్చింది. మేడిగడ్డ వద్ద ఎత్తిపోసిన సమయలో గోదావరిలో ఆ సమయంలో ఎలాంటి ప్రవాహం లేదు. ఇప్పుడు వరద కారణంగా.. లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తోంది. ఫలితంగా దాదాపుగా రూ. 20 కోట్ల కరెంట్ ఖర్చుతో ఎత్తిపోసిన నీటిని.. ఈ సారి దిగువకు వదిలేయాల్సి వస్తోంది. ఈ వదిలేయడానికి మాత్రం ఖర్చు లేనట్లే. ..!
దీన్ని కాంగ్రెస్ పార్టీ ఓ అస్త్రంగా మల్చుకునే ప్రయత్నం చేస్తోంది. రెండు రోజులుగా తీవ్రమైన విమర్శలు చేస్తోంది. వైఎస్ హయాంలో భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా చేసిన పొన్నాల లక్ష్మయ్య… తెలంగాణ సర్కార్‌పై కాంగ్రెస్ తరపున ఎటాక్‌కి లీడ్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కేసీఆర్ తుగ్లక్ నిర్ణయాలపై ప్రజలపై మోయలేనంత భారం వేశారని మండిపడ్డారు. నిపుణులు, అనుభవం ఉన్నవాళ్లు ఎంత చెప్పినా.. కేసీఆర్ పట్టించుకోలేదని .. మూడు చిన్న బ్యారేజీలు, మూడు లిఫ్టులు కట్టి కాళేశ్వరం పూర్తయిందని చెప్పుకోవడం సిగ్గుగా లేదా? అని విరుచుకుపడ్డారు. రూ. 20 కోట్ల ఖర్చుతో ఎత్తిపోసిన నీటిని మళ్లీ కిందకు వదిలేయడమే.. కేసీఆర్ ఓ తుగ్లక్ అనడానికి ఇదే ఓ నిదర్శనం అని పొన్నాల అంటున్నారు. కొమురంభీం, పెద్దవాగు, ఎల్లంపల్లి, చౌటుపల్లి హనుమంతరెడ్డి, అలిసాగర్, గుత్ప, దేవాదుల, ఎస్ఎల్బిసి, కల్వకుర్తి, భీమా, కోయిల్‌సాగర్ ఇలా ఏ ప్రాజెక్టు దగ్గర అయినా సరే చర్చలకు రావాలని సవాల్ విసిరారు.
నిజానికి తెలంగాణలో రెండు రోజులుగా.. ఎత్తి పోసిన నీటిని దిగువకు వదిలేయడంపైనే చర్చ జరుగుతోంది. దీనిపై.. గతంలో కాళేశ్వరం ఇంజినీరింగ్ తప్పిదమంటూ పుస్తకాలు రాసిన వారు కూడా.. సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు. అదే సమయంలో… ప్రజల్లోనూ చర్చనీయాంశమయింది. ఈ క్రమంలో.. కాంగ్రెస్ విమర్శలకు.. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై… తెలంగాణ సర్కార్‌కు.. సమర్థవంతమైన వాదనతో.. కౌంటర్ ఇవ్వాల్సిన అవసరం ఏర్పడింది.