రాజ్యసభ చైర్మన్గా వెంకయ్యనాయుడు.. విలువలను వదిలేసి.. తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యులను… బీజేపీలో విలీనం చేశారని.. తాను ఎప్పటికీ అలా చేయబోనని.. ఆంధ్రప్రదేశ్ స్పీకర్ తమ్మినేని సీతారాం సంచలన వ్యాఖ్యలు చేశారు. మీడియా నిర్వహించిన మీట్ ది ప్రెస్లో వెంకయ్యనాయుడుతో పోల్చుకుని మరీ తన నిబద్ధతను చాటుకునేందుకు తమ్మినేని సీతారాం తాపత్రయపడ్డారు. విలీనాల విషయంలో తాను అసలు రాజీ పడే ప్రశ్నే లేదన్నారు. “పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని పూర్తి స్థాయిలో అమలు చేస్తాను. పార్టీ విలీన వ్యవహారాల్లో నేను అసలు రాజీ పడను. చట్టం ప్రకారం అది నేరం.. నిబంధనలకు విరుద్ధంగా నేను నడుచుకోనని” ప్రకటించేశారు. కొద్ది రోజుల క్రితం.. నలుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరారు. మొత్తం టీడీపీకి ఆరుగురు సభ్యులు ఉన్నారు. నిబంధనల ప్రకారం.. టీడీపీ రాజ్యసభ పక్షాన్ని విలీనం చేయవచ్చంటూ.. వెంకయ్యనాయుడు ఉత్తర్వులు జారీ చేసి.. ఆ మేరకు వారిని బీజేపీ సభ్యులుగా ప్రకటించారు. ఇది వివాదాస్పదం అయినా.. వెంకయ్యనాయుడు ఆ తర్వాత దానిపై స్పందించలేదు.
అయితే.. రాజ్యాంగంలో కానీ ప్రజాప్రాతినిధ్య చట్టంలో కానీ.. ఎక్కడా.. లేజిస్లేచర్ పార్టీలు విలీనం కావడం అనేది లేదని.. చెబుతున్నారు. పార్టీ విలీనాలు మాత్రమే ఉంటాయంటున్నారు. పార్టీ విలీనం కానప్పుడు.. లెజిస్లేచర్ పార్టీ విలీనం అనేది ఉండదని.. వారు పార్టీ ఫిరాయించినట్లేననన్న వాదన ఉంది. కానీ.. దీనిపై న్యాయస్థానాలు కూడా స్పష్టమైన తీర్పు ఇవ్వకపోవడం.. కొన్ని రాష్ట్రాల్లో ఈ తరహా విలీనాలు జరిగిపోవడంతో.. అధికారంలో ఉన్న పార్టీలకు ఇదో అస్త్రం అయిపోయింది. తెలంగాణలో టీఆర్ఎస్… ఈ తరహా టేకోవర్లను.. కాంగ్రెస్, టీడీపీలపై విజయవంతంగా సాగించింది. కేంద్రంలోని బీజేపీ …గోవా సహా పలు చోట్ల విలీన ప్రక్రియ నిర్వహించారు. ప్రతిఘటన ఎదురు కాలేదు.
అయితే.. తమ్మినేని.. ఉపరాష్ట్రపతి పేరు చెప్పి మరీ.. విలీన ప్రక్రియ నేరమన్నట్లుగా.. తాను అలా చేయనని మాట్లాడటం ఆసక్తికరంగా మారింది. భారతీయ జనతా పార్టీ.. టీడీపీ ఎమ్మెల్యేలపై కన్నేసింది.. కొద్ది రోజుల్లో ఎమ్మెల్యేలందర్నీ లాగేసుకుని.. ప్రతిపక్ష స్థానానికి రావాలనుకుంటోందని.. ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో.. బీజేపీ కీలక నేతలు సునీల్ ధియోధర్ లాంటి వాళ్లు.. తామే ప్రతిపక్షమన్నట్లుగా ప్రకటలు చేస్తున్నారు. అయితే.. తమ్మినేని సీతారం మాత్రం.. ఈ విషయంలో బీజేపీకి షాకిచ్చేలా ఉన్నారు. ఎమ్మెల్యేలను ఎలాగోలా లాక్కున్నా… ప్రతిపక్ష హోదా దక్కనీయకుండా.. వారందరిపై వేటు వేస్తానని చెప్పకనే చెప్పేశారు.