వైకాపా అధికారంలోకి వచ్చిన దగ్గర్నుంచీ, ఆ పార్టీ నాయకులు చెయ్యాల్సిన పాలనపై కంటే… గతంలో జరిగిన అవినీతి గురించే ఎక్కువగా ఆరోపణలు చేస్తున్న సంగతి చూస్తున్నాం. టీడీపీ హయాంలో జరిగిన అవకతవకల్ని తవ్వి తీస్తామనీ, ఐదేళ్ల చంద్రబాబు నాయుడు పాలనని జల్లెడ పడతామనీ, కేసులేస్తామనీ, జైల్లో పెడతామని… ఇలా చాలామంది ఎప్పటికప్పుడు ఉద్వేగభరింతంగా మాట్లాడుతుంటారు! జరిగితే చెయ్యొచ్చు, చెయ్యాలి కూడా, తప్పు లేదు. ఇప్పుడు, తాజాగా ఎస్వీబీసీ ఛైర్మన్ గా నియమితులైన సినీ హాస్య నటుడు పృథ్వి కూడా అదే పంథాలో మాట్లాడుతున్నారు!
హైదరాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ… తిరుమల కొండ మీద తాను రాజకీయాలు అస్సలు మాట్లాడను అని ఒట్టుపెట్టుకున్నా అన్నారు. కానీ, అమరాతి వెళ్తే తన మాటలు తూటాలు బాగానే పేలుతాయనీ, తన విమర్శలు దాడి ఆగదనీ, జగనన్నకి సైనికుడిగా నిలబడతానని అన్నారు. కొండ దిగితే తాను వైసీపీకి హార్డ్ కోర్ టెర్రరిస్ట్ అని చెప్పుకున్నారు! తనకు పార్టీ ఇచ్చిన బాధ్యతల్ని ఇగోలకు పోకుండా నిర్వర్తిస్తాననీ, ఐడీ కార్డు మెళ్లో వేసుకుని రోజూ వస్తానని పృథ్వీ అన్నారు. పోసానితో తనకి ఎలాంటి విభేదాలు లేవనీ, త్వరలోనే ఆయనకి కూడా పార్టీ నుంచి మంచి గుర్తింపు లభిస్తుందన్నారు! గతంలో ఎస్వీబీసీలో కొన్ని అవకతవకలు జరిగాయనీ, వాటన్నింటిపైనా దృష్టి సారించి జరిగిన అవినీతిని వెలుగులోకి తెస్తా అన్నారు పృథ్వి!
అప్పుడే గతంలో జరిగిన అవినీతిని బయటకి తెస్తా అంటున్నారు పృథ్వీ! గతంలో అంటే, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ఎస్వీబీసీ ఛైర్మన్ గా విధులు నిర్వహిస్తూ వచ్చారు కదా. ఆయన తప్పుకున్నాక… ఆ ఖాళీ అయిన ప్లేసుని పృథ్వికి వైకాపా ప్రభుత్వం ఇచ్చింది. ఆయన చేస్తున్న వ్యాఖ్యల్ని బట్టీ చూస్తుంటే… రాఘవేంద్రరావు హయాంలో ఎస్వీబీసీలో అవకతవకలు జరిగాయని చెప్తున్నారా అనే అనిపిస్తోంది. అవినీతి జరిగినట్టు పక్కగా ఆధారాలుంటే, లేదంటే ఎక్కడైనా ఏదైనా పనిలో తేడా కనిపిస్తే ఇలాంటి ఆరోపణలు చేస్తే కొంత అర్థవంతంగా ఉంటుంది. ఇలా ఆధారాల్లేకుండా ఆరోపణలకు దిగేస్తుంటే…. వైకాపా నాయకులంతా గత పాలనలో అవినీతి వెలికితీతే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారు కాబట్టి, తాను కూడ అదే కోవలో పనిచేయాలేమో మాట్లాడాలేమో ఆరోపించాలేమో అనే మైండ్ సెట్ తో ఆయన ఈ వ్యాఖ్యానాలు చేశారనే మీనింగే వస్తోంది!