బాహుబలి విడుదల సమీపిస్తున్నకొద్దీ అంచనాలు పెరిగిపోతున్నాయి. అంచనాలు పెరిగేకొద్దీ ఆ చిత్రానికి సంబంధించిన నటీనటులకు, సాంకేతిక నిపుణులకు ఒత్తిడి పెరిగిపోవటం సహజం. అయితే బాహుబలి యూనిట్ సభ్యులుమాత్రం దీనికి భిన్నంగా ఉన్నారు. దానికి కారణం చిత్ర ఫలితంపై వారికి ఉన్న నమ్మకం. ప్రభాస్‌ను తెలుగు360.కామ్ కలిసినపుడు ఆయనలో ఈ నమ్మకం మరింత స్పష్టంగా కనిపిస్తోంది. ఈ చిత్రం తన తమిళ తెరంగేట్రానికి సరైన లాంచ్‌ప్యాడ్ అవుతుందని ప్రభాస్ విశ్వాసం వ్యక్తం చేశారు. బాహుబలి నిర్మాణ అనుభవాలను ఆయన తెలుగు360.కామ్‌తో పంచుకున్నారు.
చిత్రానికి పడిన శ్రమ గురించి మాట్లాడుతూ, చారిత్రక కథాంశంతో కూడిన సినిమాలు చేయాలని అందరికీ ఉంటుందిగానీ, ఈ చిత్రం ఊహలకందనంత భారీస్థాయి చారిత్రక చిత్రమని చెప్పారు. ఇందులోని సెట్లు, యుద్ధ సన్నివేశాలు, దృశ్యాలు భారతీయ సినిమా పరిశ్రమలో ముందెన్నడూ చూడనివని అన్నారు. రాజమౌళి మొదట ఈ చిత్రానికి ఒకటిన్నర సంవత్సరం పడుతుందని అనుకున్నారని, అయితే ఆయన పనితీరు తెలిసి ఉండటంతో తాను రెండున్నరేళ్ళు పడుతుందని అనుకున్నానని, తీరా చూస్తే అది మూడున్నరేళ్ళు పట్టిందని చెప్పారు. అయినా తనకేమీ అసంతృప్తిలేదని, ఈ చిత్రం 50 ఏళ్ళ తర్వాతైనా తాను గర్వంగా చెప్పుకునేటట్లు ఉంటుందని అన్నారు. ఉత్తర భారతదేశంలో తనను ఆదరిస్తారో, లేదో తెలియదుగానీ, సినిమానుమాత్రం అందరూ ఇష్టపడాలనుకుంటున్నట్లు చెప్పారు. మామూలుగా తన నటన తనకు తృప్తి కలిగించదని, అయితే ఈ చిత్రంలోమాత్రం తాను చూసిన కొద్ది భాగంకూడా ఎంతో సంతోషం కలిగించిందని తెలిపారు.
చిత్ర ఇతివృత్తంగురించి మాట్లాడుతూ, ఇది మామూలు కమర్షియల్ సినిమా అయినప్పటికీ, ఒక కళాత్మకత కలగలిపి ఉంటుందని ప్రభాస్ చెప్పారు. రమ్యకృష్ణ, అనుష్క, తమన్నా పాత్రలద్వారా మహిళాశక్తిని అద్భుతంగా చూపిస్తారని తెలిపారు. రోహిణి పాత్రకూడా బాగుంటుందని చెప్పారు. కాటప్ప పాత్ర ఎంతో లోతైనదని, పై మూడు పాత్రలలో ఎన్నో పార్శ్వాలుంటాయని తెలిపారు. కథను ప్రధానంగా రాజమౌళి నమ్ముతారని, దానికోసం విజువల్స్ సృష్టిస్తారని, విజువల్స్ కోసం కథను తయారు చేయరని అన్నారు. మొదటి భాగాన్ని, రెండో భాగాన్ని ఆయన విడగొడతారో అని తామందరం తలలు పగలకొట్టుకున్నామని, కానీ రాజమౌళి సరైన పాయింట్ దగ్గర విడగొట్టారని ప్రభాస్ చెప్పారు. ఆ విషయంలో రాజమౌళి దిట్ట అని అన్నారు. ఫస్ట్ పార్ట్ చివరలో కథ పూర్తి కానప్పటికీ, ఒక చిన్న ట్విస్ట్‌తో క్లైమాక్స్ ఫీలింగ్ తెప్పించారని, ప్రేక్షకులు సంతృప్తితోనే బయటకెళతారని అన్నారు.
షూటింగ్ విశేషాలగురించి వివరిస్తూ, చిత్రీకరణ చేసిన ప్రదేశాలలో కేరళ, బల్గేరియాతనకు బాగా నచ్చాయని ప్రభాస్ చెప్పారు. తనకు చెట్లు, పచ్చదనం అంటే బాగా ఇష్టమని, కేరళ, మహాబలేశ్వర్‌లలోని అడవులలో షూటింగ్ చేశామని తెలిపారు. పాతకాలంలో చారిత్రక చిత్రాలు తీసినవారు ఎంతో కష్టపడి ఉంటారని, అయితే ఇప్పుడు పెరిగిన సాంకేతిక పరిజ్ఞానంవలన అంతా సులువైపోయిందని చెప్పారు. బాహుబలి – 2 షూటింగ్ సెప్టెంబర్‌లో మొదలవుతుందని, అప్పటివరకు తాను విరామం తీసుకుంటానని ప్రభాస్ తెలిపారు.