ఓ హత్య జరుగుతుంది.
చేసిందెవరో తెలీదు. దాని చుట్టూ ఓ మానభంగం వ్యవహారం. వీటికి సంబంధం లేని ఓ మిస్సింగ్ కేస్. ఇలా మూడు కేసుల చుట్టూ మలుపులు తిరుగుతున్న కథ `ఎవరు`. అడవిశేష్, రెజీనా, నవీన్ చంద్ర ప్రధాన పాత్రలు పోషించిన సినిమా ఇది. పీవీపీ సంస్థ నిర్మించింది. ఈనెల 15న విడుదల అవుతోంది. గూఢచారితో అడవిశేష్ సినిమాలపై ఆసక్తి పెరిగింది. కంటెంట్ ఉన్న కథల్ని ఎంచుకుంటాడన్న నమ్మకం ఏర్పడింది. ఈ ట్రైలర్‌తో ఆ అంచనాలు మరింత పెరగడం ఖాయం. ఓ అవినీతి పరుడైన పోలీస్ అధికారిగా అడవిశేష్ కనిపించనున్నాడు. మర్డర్ కేసులో ఇరుక్కున్న అమ్మాయిగా రెజీనా నటించింది. నవీన్ చంద్ర పాత్రేమిటన్నది ఆసక్తికరం. ఈ కేసుని అడవిశేష్ ఎలా సాల్వ్ చేశాడు? ఇందులో వచ్చిన మలుపులేంటి? ఆ ప్రశ్నలకు సమాధానం ఎలా దొరికింది? అనేదే ఈ సినిమా కథ. ట్రైలర్లో చూపించిన షాట్లూ, ఇచ్చిన ఆర్.ఆర్.. ఇవన్నీ మంచి టెంపోలోనే సాగాయి. టీజర్, ట్రైలర్ రెండింటిలోనూ ఇంటెన్సిటీ స్పష్టంగా కనిపిస్తోంది. అది వెండి తెరపైనా ప్రతిబింబించగలిగితే.. ఎవరు కూడా హిట్ చిత్రాల జాబితాలో చేరిపోయినట్టే.