దేశంలో భాగంగా ఉన్నప్పటికీ.. తాము ప్రత్యేకమని… కాదంటే.. విడిపోతామని.. కశ్మీర్ నుంచి తరచూ వచ్చే హెచ్చరికలకు.. మోడీ, అమిత్ షా జంట… ఒకే ఒక్క నిర్ణయంతో చెక్ చెప్పారు. దేశ విభజన నాటి నుండి సమస్యగా ఉండిపోయిన కశ్మీర్ విషయంలో కేంద్ర ప్రభుత్వం… ఎవరూ ఊహించని నిర్ణయం తీసుకుంది. ఆర్టికల్ 370ని రద్దు చేసేశారు. వెంటనే రాష్ట్రపతి ఉత్తర్వులు కూడా జారీ చేసేశారు. కేంద్రం… జమ్మూకశ్మీర్‌ను మూడు భాగాలుగా విభజించింది. జమ్మూ, కశ్మీర్, లద్ధాఖ్‌లను కేంద్రపాలిత ప్రాంతాలుగా కేంద్రం ప్రకటించింది. అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతాలుగా జమ్మూ,కశ్మీర్ ఏర్పడనున్నాయి. చట్టసభ లేని కేంద్రపాలిత ప్రాంతంగా లద్ధాఖ్ ఏర్పడనుంది. కేంద్రం తాజా నిర్ణయంతో.. టిబెట్, చైనా, గిల్గిత్-బాల్టిస్థాన్ సరిహద్దులుగా కలిగిన లద్ధాఖ్ కేంద్ర పాలిత ప్రాంతమైంది.
ఆర్టికల్ 370 రద్దుతో సున్నితమైన సమస్యకు పరిష్కారం..!
కశ్మీర్ దేశంలో భాగం అయినప్పటికీ.. భాగం కాదన్న అభిప్రాయాన్ని కల్పించే పరిస్థితిని.. ఆర్టికల్ 370 కల్పిస్తోంది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 జమ్ము-కశ్మీర్‌కు ప్రత్యేక రాష్ట్రం హోదాను ఇచ్చింది. 1947లో భారత్-పాకిస్తాన్ విభజన జరిగినప్పుడు జమ్ము-కశ్మీర్ రాజు హరి సింగ్ స్వతంత్రంగా ఉండాలనుకున్నారు. కానీ తర్వాత ఆయన కొన్ని షరతులతో భారత్‌లో విలీనం అయ్యేందుకు అంగీకరించారు. ఆ తర్వాత భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 370 నిబంధనను రూపొందించారు. దీని ప్రకారం జమ్ము-కశ్మీర్‌కు ప్రత్యేక అధికారాలు ఉంటాయి. దాని ప్రకారం.. ఆ రాష్ట్రానికి ప్రత్యేకమైన రాజ్యాంగం ఉంది. అంటే.. రక్షణ, విదేశాంగ విధానాలు, కమ్యూనికేషన్ అంశాల మినహా వేరే ఏ అంశానికి సంబంధించిన చట్టాన్ని రూపొందించాలన్నా, అమలు చేయాలన్నా కేంద్రం జమ్ము-కశ్మీర్ ప్రభుత్వం అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. జమ్ము-కశ్మీర్ రాజ్యాంగంలో సెక్షన్ 35ఎ ఉంది. ఇది ఆర్టికల్ 370లో భాగం కూడా. ఇప్పుడు ఈ రెండింటిని.. కేంద్రం రద్దు చేసి.. రాష్ట్రపతి గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు.
దేశవ్యాప్తంగా సంబరాలు.. జయహో మోడీ..!
ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ.. కేంద్రం తీసుకున్న నిర్ణయంతో.. కశ్మీర్ మినహా దేశవ్యాప్తంగా.. సంబరాలు మిన్నంటాయి. ఇక .. .కశ్మీర్ విషయంలో.. ఎవరూ సందేహపడాల్సిన పని లేదని.. దేశం లో అధికారికంగా భాగమయిందని అంటున్నారు. దేశవ్యాప్తంగా జయహో మోడీ.. అమిత్ షా నినాదాలు హోరెత్తాయి. బీజేపీని వ్యతిరేకించేవాల్లు కూడా.. సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారని అభినందనలు గుప్పించారు. దశాబ్దాల స్వప్నం సాకారమయిందన్న ఓ ఉత్సాహం.. దేశంలో కనిపిస్తోంది.
కశ్మీర్లో మాత్రం ఉద్రిక్త పరిస్థితులు..!
ఆర్టికల్ 370ని రద్దు చేయడం కశ్మీర్ రాజకీయ పార్టీలకు ఏ మాత్రం ఇష్టం లేదు. అదే చేస్తే.. తాము భారత్‌లో భాగం కాబోమని.. అప్పటి ఒప్పందాలను గుర్తు చేస్తున్నారు. “370 భారత్, జమ్ము-కశ్మీర్ మధ్య బంధానికి ఒక లింకు లాంటిది. ఉంటే ఆర్టికల్ 370 అయినా ఉండాలి లేదంటే భారత్‌లో కశ్మీర్ భాగం కాకుండా అయినా ఉండాలనేది.. నేషనల్ కాన్ఫరెన్స్ అభిప్రాయం. ఇక పీడీపీ పార్టీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ అయితే.. ముందు నుంచి వేర్పాటువాదంతోనే ఉన్నారు. అందుకే.. పార్లమెంట్లో.. కశ్మీర్‌కు చెందిన ఎంపీలు చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. రాజ్యాంగాన్ని కూడా చించేశారు. ముందుంది ముసళ్ల పండుగని.. ముఫ్తీతో పాటు..అబ్దుల్లా కూడా వార్నింగ్ ఇచ్చారు. అయితే.. వారి బెదిరింపులు… పిల్లి కూతలేనని నిరూపించగలిగే సత్తా.. మోడీ, ,షాలకు ఉందనేది.. దేశ ప్రజల నమ్మకం.