ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన మంగళవారం నాడు సాయంత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో భేటీ కాబోతున్నారు. ఈ సందర్భంగా విభజన హామీల అమలుతోపాటు మరోసారి ప్రత్యేక హోదా అంశం కూడా మరోసారి కేంద్రం ముందు ప్రస్థావించే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే, ఈ నేపథ్యంలో భాజపా ఎంపీ జీవీఎల్ నర్సింహారావు హోదాపై మరోసారి కేంద్రం వాదననే వినిపించారు. అంతవరకూ ఆగితే బాగుండేది, ఓ పోలిక తీసుకొచ్చి మరీ హోదా అడుగుతున్నవారంతా అంతే అన్నట్టుగా వ్యాఖ్యానించారు!
భాజపా తల్చుకుంటే క్షణాల్లో కాశ్మీరు అంశంపై నిర్ణయం తీసుకున్నట్టుగా, ఏపీకి సంబంధించిన ప్రత్యేక హోదాపైగానీ, తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపకంపైగానీ ఎందుకు నిర్ణయం తీసుకోవడం లేదనే మీడియా ప్రశ్నకు జీవీఎల్ సమాధానం ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా గురించి ప్రత్యేకంగా మాట్లాడుకునేదీ, చర్చించాల్సిందంటూ ఏమీ లేదన్నారు. అలాంటి ఒక వ్యవస్థ అంటూ లేదని చాలాచాలా స్పష్టంగా కేంద్రం ఇదివరకే చెప్పిందన్నారు. జమ్మూ కాశ్మీర్ మాదిరిగానే కొంతమంది శక్తులు హోదా గురించి మాట్లాడుతున్నారని జీవీఎల్ వ్యాఖ్యానించారు!! వారి రాజకీయ ప్రయోజనాల కోసమే హోదాని వాడుకుంటున్నారని అన్నారు. ఎవరు ఏం చేసినా అది వచ్చే అవకాశం కనిపించడం లేదన్నారు! సీట్ల పెంపు అంశం చట్టంలో ఉంది కాబట్టి, దానిపై కేంద్రం సానుకూలంగా స్పందించే అవకాశం ఉంటుందన్నారు. అయితే, ఇప్పటికిప్పుడు ఏపీలో ఎన్నికలంటూ లేవు కాబట్టి, కొంత సమయం తీసుకున్నాక కేంద్రం దీనిపై సానుకూలంగా స్పందిస్తుందని చెప్పారు.
హోదా ఇచ్చే అవకాశం లేదని భాజపా చెబుతూనే ఉంది, అదేం కొత్త విషయం కాదు! కానీ, ఈ సందర్భంలో… జమ్మూ కాశ్మీర్ మాదిరిగానే కొన్ని శక్తులు హోదా అంశాన్ని రెచ్చగొడుతున్నాయని జీవీఎల్ అనడం… అసందర్భం! ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో పార్లమెంటులో ఇచ్చిన హామీ అది. అదేదో ఒక పార్టీకి చెందిన రాజకీయాంశం కాదు. ఏపీలో గత అధికార పార్టీ టీడీపీ ఆ హామీ అమలు చేయాలంటూ కేంద్రాన్ని కోరింది, ఇప్పుడు అధికారంలో ఉన్న వైకాపా కూడా అదే డిమాండ్ ను కేంద్రం ముందు ఉంచుతూ వస్తోంది. హోదా అనేది కేవలం టీడీపీ డిమాండ్ గా మాత్రమే ఉన్నట్టయితే, ఇప్పుడు అధికారంలో ఉన్న వైకాపా దాని గురించి ఎందుకు ప్రయత్నిస్తుంది? ఇది ఏపీ ప్రజల డిమాండ్. స్పెషల్ స్టేటస్ ఇస్తామనేది కేంద్ర ప్రభుత్వమే ఇచ్చిన హామీ. అలాంటప్పుడు, ఇదేదో కొన్ని శక్తుల డిమాండ్ అంటూ జీవీఎల్ పోలిక తెస్తూ మాట్లాడటం ఎంతవరకూ సబబుగా ఉందో ఆయనకే తెలియాలి!!