వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ముఖ్యమంత్రి హోదాలో మరో సారి ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. ఆయన ఏపీకి సంబంధించిన ప్రత్యేకహోదా.. అని.. మరో ప్రయోజనాల గురించి కేంద్రాన్ని అడుగుతారని… చెబుతున్నారు. అయితే.. అసలు ఎజెండా మాత్రం… ఇటీవలి కాలంలో.. ఏపీ సర్కార్ తీసుకున్న నిర్ణయాలపై.. కేంద్రం వ్యతిరేకత వ్యక్తం చేయడంతో వాటిపై వివరణ ఇవ్వడానికే.. టూర్ పెట్టుకున్నారని… ఢిల్లీ వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. పీపీఏల విషయంలో… కేంద్రం సూచనలు, హెచ్చరికలు పెడచెవిన పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం తన దారిలో తాను వెళ్తోంది. ఈ కారణంతో… కేంద్రం ఆగ్రహంతో ఉందున్న ప్రచారం కూడా జరుగుతోంది. అలాగే పోలవరం ప్రాజెక్ట్ కాంట్రాక్ట్ రద్దు విషయంలోనూ.. కేంద్రం ఏ మాత్రం సంతృప్తిగా లేదన్న విషయం.. కేంద్రమంత్రి పార్లమెంట్ ప్రకటనతోనే తేలిపోయింది.
నిజానికి పోలవరం సాగునీటి ప్రాజెక్టు కేంద్ర పరిధిలో ఉంది. నిర్మాణ పనులను మాత్రమే రాష్ట్రం పర్యవేక్షిస్తోంది. అలాంటప్పుడు.. కేంద్రానికి కనీసం చెప్పకుండా.. కాంట్రాక్టులు రద్దు చేయడం ఏమిటన్న చర్చ ఇప్పటికే కేంద్రంలో నడుస్తోంది. గత టీడీపీ ప్రభుత్వం ఇలాగే టెండర్లు రద్దు చేయాలనే ఆలోచన చేసినప్పుడు అప్పటి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఒప్పుకోలేదు. ఆయన సూచనతో కొత్తగా టెండర్లు పిలవకుండానే నవయుగ కంపెనీని రంగంలోకి తెచ్చి పనులు చేయించారు. అప్పుడు ఒప్పుకోని కేంద్రం ఇప్పుడు ఒప్పుకొంటుందా అనే ప్రశ్న ఉంది. కొత్తగా టెండర్ పిలవాలన్నా దానికి కూడా కేంద్రం ఆమోదం కావాల్సి ఉంటుంది. అదే సమయంలో… నవయుగ కంపెనీ.. నష్టపరిహారం కోసం.. న్యాయపోరాటం చేస్తుందనే ప్రచారం జరుగుతోంది.
అదే జరిగితే.. ప్రాజెక్టు మరింత చిక్కుల్లో పడుతుంది. కేంద్రం వద్ద.. ఏపీ సర్కార్ మరింత చులకన అవుతుంది. అయితే నవయుగతో అవగాహనకు రావడం ద్వారా టెండర్ల రద్దు న్యాయవివాదం కాకుండా చూసుకొనే ప్రయత్నంలో ప్రభుత్వం ఉందని ప్రచారం జరుగుతోంది. ఈ పరిణామాలన్నింటి మధ్య… ముఖ్యమంత్రి జగన్ నరేంద్ర మోదీని కలిసి తన వాదన వినిపించనున్నారు. వివరణ ఇవ్వనున్నారు. అయితే.. కశ్మీర్ వ్యవహారంలో తల మునకలై ఉన్న ప్రధాని ఇప్పుడు వీటి గురించి పట్టించుకొంటారా అన్నది చాలా మందికి అర్థం కాని విషయం.