రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు కాస్త జోరు పెంచినట్టే కనిపిస్తోంది. ఈమధ్యే హిందీతో తొలి విజయాన్ని అందుకుంది. దే దే ప్యార్ దేతో అక్కడి ప్రేక్షకుల మనసుల్ని గెలుచుకుంది. ఇప్పుడు మన్మథుడు 2తో టాలీవుడ్‌కి మరోసారి హాయ్ చెప్పబోతోంది. ఇండియన్ 2లోనూ ఓ కీలక పాత్ర దక్కించుకుంది. ఈ శుక్రవారమే `మన్మథుడు 2` రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా రకుల్ ప్రీత్ తో చిట్ చాట్.
హాయ్ రకుల్…
హాయ్ అండీ..
ఈ సినిమాలో మీ పాత్ర ఎలా ఉండబోతోంది?
ఇందులో అవంతిక గా కనిపించబోతున్నాను. నా పాత్రలో అన్ని రకాల ఎమోషన్స్ ఉన్నాయి. ఈమధ్య కాలంలో ఇలాంటి పాత్ర నేను చేయలేదు.
కాస్త బోల్డ్ నెస్ కూడా ఉన్నట్టు కనిపిస్తోంది..
మీరు.. దేని గురించి అడుగుతున్నారో నాకు తెలుసు. ఈ సినిమాలో సిగరెట్ తాగిన సీన్ ఉంది. దాని కోసమే కదా? సిగరెట్లు తాగితే బోల్డ్నెస్ అయిపోతుందా? అవంతిక అనే అమ్మాయి సిగరెట్లు తాగడం గురించిన కథ కాదిది. సిగరెట్లు తాగే అలవాటున్న అవంతిక కథ ఇది. అయినా హీరోలు సిగరెట్ తాగితే తప్పు లేదు కానీ, హీరోయిన్లు కాలిస్తే తప్పొచ్చిందా? బయట సమాజంలో, రోడ్డు మీద ఇంకా చాలా చాలా విషయాలే జరుగుతున్నాయి. వాటి గురించి ఎవ్వరూ మాట్లాడరు. సినిమాలో కాస్త బోల్డ్నెస్ చూపించగానే సంస్క్రృతి, సంప్రదాయాలు గుర్తొస్తాయి. సినిమాల ద్వారా చెడు అలవాట్లని ప్రోత్సహించడం లేదు. అలాంటి సన్నివేశాలు వస్తున్నప్పుడు మద్యపానం, ధూమపానం హానికరం అని స్లైడింగ్ కూడా వేస్తున్నాం కదా?
ఇలాంటి సన్నివేశాల్ని తెలుగు ప్రేక్షకుల స్వీకరిస్తారనే అనుకుంటున్నారా?
– ఈమధ్య మన సినిమాలు చాలా మారాయి. కథానాయిక పాత్రని రకరకాలుగా చూపిస్తున్నారు. అర్జున్ రెడ్డి లాంటి సినిమాలు వచ్చాయి కదా? అందులో ముద్దులు ఎక్కువయ్యాయని మాట్లాడుకున్నారు కూడా.
ఇదే సమయంలో పెళ్లి చూపులు, బ్రోచేవారెవరురా, క్షణం.. లాంటి చిన్న సినిమాలు బాగా ఆడుతున్నాయి. కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాల్ని ఆదరిస్తున్నారు. మాస్ సినిమాలూ వర్కవుట్ అవుతున్నాయి. ఇవన్నీ మంచిపరిణామాలు. మీడియా కూడా తెలుగు సినిమా పరిణామ క్రమాన్ని సరైన దృష్టితో చూస్తే బాగుంటుంది.
దే దే ప్యార్ దే, మన్మథుడు 2… ఈ రెండు సినిమాల్లోనూ మీకంటే వయసెక్కువ ఉన్న హీరోలతో నటించారు. అలా సీనియర్లతో నటిస్తుంటే, యువ హీరోలతో సినిమాలు చేసే అవకాశం రాలేదన్న భయాలు లేవా?
– ఈ రెండు సినిమాల్లోనూ నేను చేసిన పాత్రలేంటో ఒక్కసారి ఆలోచించుకుంటే.. ఈ ప్రశ్న తలెత్తదు. ఈ రెండు కథల్లోనూ హీరోలు నాకంటే రెండింతలు వయసెక్కువ వాళ్లే. కథ ప్రకారం వాళ్ల వయసులో నేను సగం ఉండాలి. నేనేదో ఓ కమర్షియల్ సినిమా ఒప్పుకుని, నాలుగు పాటలు, రొమాంటిక్ సన్నివేశాలతో కాలక్షేపం చేయడం లేదు కదా? కథలో బలమైన పాత్ర వచ్చినప్పుడు వయసైపోయిన హీరోలతోనూ నటించాల్సిందే. దే దే ప్యార్ దే బాలీవుడ్లో వంద కోట్లు సాధించింది. అంటే నా ఛాయిస్ తప్పు కాదనే కదా అర్థం.
రాహుల్ రవీంద్రన్తో మీకు ఇది వరకే పరిచయం. ఓ దర్శకుడుగా తన పనితనం ఎలా ఉంది?
రాహుల్‌ని బడే భయ్యా అని పిలుస్తాను. ఓసారి రాఖీ కూడా కట్టాను. తను నన్ను చెల్లాయిలా చూస్తాడు. సెట్లో మాత్రం చాలా కొత్తగా కనిపించాడు. చాలా క్లారిటీ ఉన్న దర్శకుడు. రచనా నైపుణ్యం కూడా నన్ను ఆకట్టుకుంది. ఈ సినిమా మొదలవ్వకముందే పూర్తి స్క్రిప్టు నా చేతుల్లో పెట్టాడు. కథేంటి? నా పాత్ర ఎలా ప్రవర్తిస్తుంది? మిగిలిన పాత్రలతో నాకున్న అనుబంధం ఎలాంటిది? ఇవన్నీ నాకు ముందే స్పష్టంగా తెలియడం వల్ల… నటించడం చాలా తేలికైంది.
సీనియర్ హీరోయిన్లంతా లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తున్నారు. మీరెందుకు అలాంటి కథల్ని ఎంచుకోవడం లేదు?
– నాకూ చేయాలనే వుంది. మంచి పాత్రలు రావాలి కదా? ఓ కమర్షియల్ సినిమాలో కథానాయిక పాత్రని శక్తిమంతంగా తీర్చిదిద్దినా అది లేడీ ఓరియెంటెడ్ సినిమానే అవుతుంది. అయినా నా చేతుల్లో ఉన్నవి 365 రోజులే. అన్ని రకాల పాత్రలూ, అన్ని రకాల సినిమాలూ చేయడానికి టైమ్ సరిపోవడం లేదు.
మంచి పాత్ర వస్తే పారితోషికం తగ్గించుకోవడానికైనా సిద్ధమేనా?
– రానివ్వండి.. అప్పుడు చూద్దాం.
చిలసౌ చూశారా?
– తొలి రోజు తొలి ఆట చూశా. రాహుల్‌ని అన్నయ్య అని పిలుస్తా అని చెప్పాను కదా? నేను చూడకపోతే
బాగుంటుందా?
మన్మథుడు చూశారా?
– ఈ సినిమా ఒప్పుకున్న తరవాత నేను చేసిన మొదటి పని అదే. నాకు ఆ సినిమా బాగా నచ్చింది.