పైకి చెప్పరు గానీ, బాహుబలి రికార్డుల్ని బద్దలు కొట్టాలన్న ధ్యేయంతో మొదలెట్టిన చిత్రం ‘సైరా’. ఈ సినిమాని దేశ వ్యాప్తంగా విడుదల చేయాలని, హిందీనాట కూడా.. భారీ వసూళ్లు సాధించాలని వ్యూహ రచన చేశారు. అయితే… ఆ స్థాయికి దగ్గట్టుగా, బాహుబలి పబ్లిసిటీ వ్యూహాల్ని మరిపించేంతగా మాత్రం ప్రచారం చేసుకోలేకపోతున్నారు. ఇంత వరకూ ఈ సినిమాకి సంబంధించిన ప్రోపర్ ఫస్ట్ లుక్ బయటకు రాలేదు. చాలామంది పేరెన్నదగిన నటీనటులు ఉన్నా – వాళ్ల లుక్కులేమీ బయటకు విడుదల చేయలేదు. ఒక్క ముక్కలో చెప్పాలంటే.. సైరాకి పబ్లిసిటీ శూన్యం. అక్టోబరు 2న ఈ సినిమా విడుదల కానుంది. అంటే 60 రోజులు కూడా వ్యవధి లేదు. అందుకే.. ఇప్పుడు స్వయంగా చిరంజీవినే పబ్లిసిటీ విషయంలో రంగంలోకి దిగారని టాక్.
ఈ చిత్రాన్ని హిందీతో పాటు తమిళ, మలయాళ భాషల్లోనూ విడుదల చేయాలనుకుంటున్నారు. తెలుగులో పబ్లిసిటీ గురించి పెద్దగా బెంగ పడాల్సిన అవసరం లేదు. బాలీవుడ్లో మాత్రం ఈ సినిమా కోసం విస్త్రతంగా ప్రచారం చేయాలని చిరు భావిస్తున్నాడు. అక్కడ అమితాబ్ బచ్చన్ అనే ట్యాగ్ లైన్‌ని వాడుకోవాలన్నది చిరు ప్లాన్. ఈ సినిమాలో అమితాబ్ ఓ కీలక పాత్రలో నటించారు. నిడివి కూడా ఎక్కువే. అందుకే… బిగ్ బీ యాంగిల్లో ఈ సినిమాని బాలీవుడ్లో ప్రమోట్ చేయబోతున్నారు. దాదాపుగా ఇది అమితాబ్ సినిమానే అన్నట్టు ట్రైలర్లు, టీజర్లూ కట్ చేసి అక్కడ వదలాలన్నది ప్లాన్. అంతేకాదు.. ప్రత్యేకంచి ఓ ప్రమోషన్ టీమ్‌ని కూడా చిరు ఏర్పాటు చేస్తున్నారు. బాలీవుడ్‌కి ఓ టీమ్, తెలుగుకి ఓ టీమ్, మిగిలిన భాషలకు ఓ టీమ్ పనిచేయబోతోంది. వీటన్నిటినీ చరణ్, ఉపాసనలు కో ఆర్డినేట్ చేయబోతున్నారు. రామ్ చరణ్‌కి సల్మాన్ ఖాన్‌తో మంచి అనుబంధం ఉంది. ఈ సినిమా ప్రమోషన్ కోసం సల్మాన్నీ వాడుకోవాలని చరణ్ భావిస్తున్నాడట. బాలీవుడ్లో ‘సైరా’ కి సంబంధించిన ఈవెంట్ ఒకటి భారీగా నిర్వహించాలని అనుకుంటున్నారు. ఆ వేడుకకు సల్మాన్, సంజయ్ దత్ లను తీసుకురావాలనుకుంటున్నారు. బిగ్ బీ ఎలానూ ఉంటాడు. ఆగస్టు 22.. చిరు పుట్టిన రోజునాడు సైరా నుంచి ఓ టీజర్ రాబోతోంది. అక్కడి నుంచి ‘సైరా’ ప్రమోషన్లని ముమ్మరం చేయాలనుకుంటున్నారు.