ఏ ముహూర్తాన ‘క్వీన్’ రీమేక్ మొదలెట్టారో… అప్పటి నుంచీ ఈ ప్రాజెక్టుకు అన్నీ ఇబ్బందులే. దాదాపు మూడేళ్లు గడిచిపోయినా… ఈ సినిమా ఇప్పటి వరకూ విడుదల కాలేదు. కంగనా ‘క్వీన్’ని దక్షిణాదిన నాలుగు భాషల్లో ఒకేసారి రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. తెలుగులో తమన్నా, తమిళంలో కాజల్, మలయాళంలో మంజిమా మోహన్, కన్నడలో పారుల్ `క్వీన్`గా కనిపించనున్నారు. తమిళంలో ఈ చిత్రం ‘పారిస్ పారిస్’ పేరుతో విడుదల కానుంది. షూటింగ్ పూర్తయి, విడుదలకు రెడీ అవుతున్న సమయంలో ఈ చిత్రానికి సెన్సార్ ఇబ్బందులు చుట్టుముట్టాయి.
పారీస్ పారీస్‌లో కొన్ని సన్నివేశాలు, సంభాషణలు అభ్యంతరకరంగా ఉన్నాయని, వాటిని తొలగించాల్సిందే అని తమిళ సెన్సార్ బోర్డు చిత్రబృందాన్ని సూచించింది.కానీ.. దర్శక నిర్మాతలు మాత్రం అందుకు అంగీకరించడం లేదని సమాచారం. టీజర్లో ఓ షాట్‌పై అప్పట్లోనే విమర్శలు వచ్చాయి. ఆ సీన్‌తో సహా.. దాదాపుగా 10 చోట్ల సెన్సార్ అభ్యంతరం చెప్పిందట. సెన్సార్ చెప్పిన మార్పులు చేసుకుంటూ పోతే, సినిమాలో కిక్ మిస్సవుతుందని చిత్రబృందం భయపడుతుంది. బోల్డ్ సన్నివేశాలుంటే… కనీసం యువతరం అయినా థియేటర్ల దగ్గరకు వస్తుందని, సినిమాకి ప్రచారం కలిసొస్తుందని చిత్రబృందం నమ్మకం. ఇప్పుడు అవన్నీ తీసేస్తానంటే ఎలా అని భయపడుతున్నారు. తెలుగులో `దటీజ్ మహాలక్ష్మి` పేరుతో ఈ సినిమా విడుదల అవుతోంది. షూటింగ్ ఎప్పుడో పూర్తయింది. కానీ.. ఇప్పటి వరకూ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లోనే ఉంది. వ్యవహారం చూస్తుంటే తెలుగులోనూ ఈ సినిమాకి సెన్సార్ ఇబ్బందులు తప్పేట్టు కనిపించడం లేదు.