వైకాపా ప్రభుత్వం అనాలోచిత చర్యల వల్ల రాష్ట్రంలో అందరూ ఇబ్బందులు పడుతున్నారన్నారు ఏపీ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు. గుంటూరు కార్యాలయంలో ఆయన కార్యకర్తలతో మాట్లాడారు. రైతు రుణమాఫీని ప్రభుత్వం సక్రమంగా అమలు చేయడం లేదనీ, 4, 5 విడతలు ఇంకా చెల్లించలేదనీ, దీనిపై రైతులతో కలిసి న్యాయపోరాటానికి సిద్ధమౌతామని చంద్రబాబు చెప్పారు. రైతులకు తమ ప్రభుత్వం ప్రాంసరీ నోటు ఇచ్చాక ఎన్నికల సంఘం అడ్డుపడిందనీ, అది ప్రభుత్వం చేసిన వాగ్దామనీ, దాన్ని అమలు చేయాల్సిన బాధ్యత ఏపార్టీ అధికారంలో ఉన్నా రాష్ట్ర ప్రభుత్వంపై ఉంటుందన్నారు.
ప్రజల కోసం ఎన్ని అవమానాలైనా పడతాననీ, సమస్యలపై పోరాటానికి కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని చంద్రబాబు అన్నారు. శాసన సభలో కనీస మర్యాద కూడా ఇవ్వడం లేదనీ, ప్రజాస్వామ్యాన్ని వైకాపా ప్రభుత్వం అపహాస్యం చేస్తోందని విమర్శించారు. సంక్షేమ పథకాలను పేదలకు అందేలా చూడాలిగానీ, అంతేగానీ పార్టీ ప్రాతిపదికగా లబ్ధి చేయడం సరికాదన్నారు. ఓటమి భారం నుంచి బయటపడుతున్నామనీ, మళ్లీ ప్రజల్లో ఆదరాభిమానాలు పెరుగుతున్నాయని కార్యకర్తలకు భరోసార ఇచ్చే ప్రయత్నం చేశారు చంద్రబాబు. అన్న కేంటీన్లను ఎందుకు మూసేశారో చెప్పాలనీ, దాంతో వేల మంది ఉపాధి కోల్పోయారని చంద్రబాబు అన్నారు.
ఇసుక విధానం రద్దు చేయడంతో లక్షల సంఖ్యలో భవన నిర్మాణ కార్మికులు ఉపాధి కోల్పోయారనీ, సొంత ఇంటి కల అనేది ప్రజలకు సాకారం కాకుండా చేశారన్నారు. ఒక నిర్ణయం తీసుకుంటే, దాని ముందూ వెనకా పర్యవసానాలు ఏంటనేవి ఆలోచించాలనీ, ఇదేమీ పిల్లల ఆట కాదంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు. కొత్త ఇసుక విధానం ఎప్పుడో వస్తుందని తీరిగ్గా నాయకులు మాట్లాడుతున్నారనీ, ఇది సరైన పద్ధతి కాదంటూ ట్విట్టర్ వేదికగా చంద్రబాబు అన్నారు. వైకాపా ప్రభుత్వంపై ఇంతవరకూ విమర్శలు మాత్రమే చేస్తున్న టీడీపీ.. ఇప్పుడు తొలిసారిగా పోరాటానికి దిగుతాం అంటున్నారు. రైతులతో కలిసి న్యాయ పోరాటం చేస్తామని చెబుతున్నారు. ఓటమి తరువాత డీలా పడ్డ పార్టీ శ్రేణులకు కొత్త ఉత్సాహం ప్రయత్నం చంద్రబాబు చేస్తున్నారు. రైతుల తరఫున ఈ పోరాటం కార్యరూపం దాల్చితే, పార్టీ శ్రేణులకు ఒక అజెండా దొరికినట్టు అవుతుందని చెప్పొచ్చు.