ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇజ్రాయెల్ పర్యటనకు వెళ్లారు. అదేమి అధికారిక పర్యటన కాదు. పూర్తిగా అధ్యాత్మిక పర్యటన. ఆయన తన ఇష్ట దైవాన్ని స్మరించుకోవడానికి భద్రత ఖర్చు.. రూ. ఇరవై రెండు లక్షలు ఏపీ సర్కార్ పెట్టుకున్నప్పటికీ.. సొంత ఖర్చుతో ఇజ్రాయెల్ వెళ్లారు. అక్కడ అధికారిక కార్యక్రమాలు ఏమైనా ఉంటాయని కాని.. ఒప్పందాలు చేసుకుంటామని కానీ.. చెప్పలేదు. అయితే.. జగన్ ఇజ్రాయెల్ పర్యటన నుంచి వచ్చిన తర్వాత.. ఢిల్లీలోని ఆ దేశ రాయబారి మాత్రం.. ఓ ప్రకటన విడుదల చేశారు. నీటి నిర్ లవణీకరణపై ఏపీతో ఒప్పందం చేసుకున్నామని ప్రకటించారు. తమ సాంకేతికత ఏపీకి ఇతోధికంగా ఉపయోగపడుతుందని ట్విట్టర్లో పోస్టు చేశారు.
ఇజ్రాయెల్ రాయబారి ప్రకటన.. ఏపీలో.. చర్చనీయాంశం అయింది. కశ్మీర్ హడావుడిలో.. పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు కానీ.. ఏపీలో నిజంగానే.. ఇజ్రాయెల్ తరహాలో.. సముద్రపు నీటిని మంచినీరుగా మార్చే ప్రాజెక్టుకు ఒప్పందం చేసుకున్నారా.. అన్న ఆశ్చర్యం కనిపిస్తోంది. కారణం .. ఆ ప్రకటన ఇజ్రాయెల్ రాయబారి చేశారు కానీ.. ఏపీ సర్కార్ నుంచి మాత్రం ఒక్కటంటే.. ఒక్క ప్రకటన కూడా అధికారికంగా రాలేదు. కనీసం ఇజ్రాయెల్ రాయబారి ప్రకటనపై అవుననో.. కాదనో కూడా స్పందించలేదు. అందుకే..ఏపీ ప్రజల్లో ఆసక్తి వ్యక్తమవుతోంది.
ఏస్తుక్రీస్తును దర్శించుకోవడానికి.. ఇజ్రెయిల్ వెళ్లిన జగన్ అక్కడ ఉప్పునీటి శుద్ది చేసే ప్లాంట్ ను సీఎం సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడి అధికారులు ఉప్పు నీటిని తాగునీరుగా మార్చే మెకానిజం మరియు ప్రాజెక్టుకు సంబంధించిన ఆర్థిక వ్యవస్థ, వ్యయంపై ప్రదర్శన ఇచ్చారు. ప్రాజెక్టుకు ఏర్పాటుకు పెట్టిన ఖర్చు, కార్యాచరణ ఖర్చుల గురించి వివరించారు. అక్కడ శుద్ది చేసిన నీటిని ముఖ్యమంత్రి సహా అధికారులు రుచి చూశారు. ఆ ఫోటోలన్నింటినీ విడుదల చేశారు. అయితే.. ఒప్పందం కుదుర్చుకున్నట్లుగా.. కానీ కనీసం ఆ ఆలోచన ఉందన్న విషయాన్ని కూడా ప్రభుత్వం బయటపెట్టలేదు. అసలు ఆ ప్రాజెక్ట్ ఏపీకి అవసరమా లేదా.. అన్నదానిపై.. చర్చ కూడా జరగకుండా…ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుందనే విషయాన్ని ఎవరూ నమ్మలేకపోతున్నారు. కానీ ఇజ్రాయెల్ సర్కారే.. ఒప్పందం కుదిరిందని ప్రకటిస్తోంది.