ఆర్టికల్ 370 రద్దు, జమ్మూకశ్మీర్ విభజన గురించి లోక్‌సభలో అమిత్ షా చేసిన ప్రసంగాల్లో…. ఆంధ్రప్రదేశ్ ప్రస్తావన కూడా ఉంది. ఆర్టికల్ 370కి… 371కి సంబంధం లేదని… అమిత్ షా స్పష్టం చేశారు. ఈ ఆర్టికల్‌కు సంబంధించి ఏపీ, కర్ణాటక సహా.. మరికొన్ని రాష్ట్రాలు ఆందోళన పడాల్సిన అవసరం లేదని తేల్చేశారు. ఈ ఆర్టికల్ 371తో ఏపీకి ఏం సంబంధం అనేది.. అమిత్ షా ప్రకటన తర్వాత చాలా మందికి ఆసక్తి కలిగించిన అంశం. ఆర్టికల్ 371 ద్వారా అనేక రాష్ట్రాలకు కొన్ని ప్రత్యేక హక్కులు కల్పించారు. ఈ ఆర్టికల్ ప్రకారం మహారాష్ట్రలోని విదర్భ, మరట్వాడాల్లోను, గుజరాత్ లోని కచ్ ప్రాంతంలోను ప్రత్యేక అభివృద్ధి కమిటీలు ఏర్పాటు చేశారు. ఈ కమిటీలకు ఆ ప్రాంతాలలోని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలలో సరైన వాటా ఇచ్చే ప్రత్యేక అధికారాలు వుంటాయి.
అలాగే 371-బి అస్సాంకు, 371-సి మణిపూర్ కు, 371-ఎఫ్ సిక్కింకు, 371-హెచ్ అరుణాచల్ ప్రదేశ్‌కు, 371-ఐ గోవాకు ఇలాంటి ప్రత్యేక సదుపాయాలు కల్పించింది. స్థలాల కొనుగోళ్లు, అమ్మకాల విషయంలో ఆర్టికల్ 370 జమ్మూ-కాశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక సదుపాయం కల్పించినట్లే, ఆర్టికల్ 371-ఎ నాగాలాండ్‌కు, 371-జి మిజోరాంకు ప్రత్యేక సదుపాయాలు కల్పించింది. ఆర్టికల్ 371ఎ, ఆర్టికల్ 371-జి ప్రకారం నాగాలాండ్, మిజోరాం లో కూడా ఆయా రాష్ట్రాలకు చెందని వారు అక్కడి భూములు కొనగూడదు. అమ్మకూడదు.ఈ విషయాలలో భారత పార్లమెంటు చేసే చట్టాలు కూడా ఆ రాష్ట్రాలకు వర్తించవు.
ఈ ఆర్టికల్ ప్రకారమే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో కూడా 1/70 చట్టం అమలులో వుంది. ఆ చట్టం ప్రకారం ఈ రెండు తెలుగు రాష్ట్రాలలోని గిరిజన ప్రాంతాలుగా ప్రకటించబడ్డ ప్రాంతాలలో గిరిజనులు మాత్రమే భూములు కొనాలి. అమ్మాలి. గిరిజనేతర ప్రజలు, వారు భారతీయులైనా సరే ఆ ప్రాంతాలలో భూములు కొనరాదు. అమ్మరాదు. ఇప్పుడు 370లా… ఆర్టికల్ 371ని కూడా రద్దు చేస్తారేమోన్న ఆందోళన.. ఆయా రాష్ట్రాల్లో వస్తుందన్న ఉద్దేశంతో.. ముందుగానే.. అమిత్ షా ఈ తరహా ప్రకటన చేశారు.