తెలంగాణ నీటి అవసరాలకు తిరుగులేని, తరుగులేని ప్రాజెక్టుగా కాళేశ్వరాన్ని నిర్మించామని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిన సంగతి తెలిసిందే. గత పాలకుల చేతుల్లో ఈ ప్రాజెక్టు ఉంటే నిర్మాణానికి ఇరవయ్యేళ్లు పట్టేదన్నారు. డిజైన్ మార్చి, బుర్ర ఉపయోగించి ఈ కలను సారాకారం చేసుకున్నామన్నారు. తాను గోదావరి మీదుగా ఎప్పుడు వెళ్లినా, కారు ఆపి చిల్లర డబ్బులేసి మొక్కేవాడినని, ఆ కోరిక నెరవేరిందన్నారు కేసీఆర్. అయితే, ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై సెటైర్ వేశారు టీపీసీసీ ప్రచార కమిటీ ఛైర్ పర్సన్ విజయశాంతి.
వేల కోట్ల ఖర్చుతో ఒక్క కాళేశ్వరం కట్టామని ముఖ్యమంత్రి కేసీఆర్ గొప్పలు చెబుతున్నారనీ, హైదరాబాద్ రోడ్ల మీదికి ఇప్పుడు ఒక్కసారి వెళ్లి చూస్తూ… అలాంటి కాళేశ్వరాలు అడుగుకొకటి చొప్పున కనిపిస్తుంటాయని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు విజయశాంతి. వరద నీరు రావడంతో ప్రాజెక్టులు కళకళలాడుతాయనీ, అలాగే హైదరాబాద్ లో కూడా వాన నీటితో రోడ్ల మీద గుంతలన్నీ నీటితో నిండిపోయి, బురదతో కళకళలాడుతున్నాయని ఎద్దేవా చేశారు. ఎక్కడ ఏ సమస్య ఉన్నా గత పాలకులదే తప్పు అన్నట్టు మాట్లాడుతూ… వారు నిర్వహించాల్సిన బాధ్యతల నుంచి తప్పుకుంటారని విమర్శించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మురునీటిని వ్యవస్థపై, నగరంలో రోడ్లపై ఏనాడైనా శ్రద్ధ పెట్టారా అని ప్రశ్నించారు.
విజయశాంతి విమర్శల్లో ఒకటైతే వాస్తవం… గత వారం రోజులుగా హైదరాబాద్ లో పడుతున్న వర్షాల వల్ల రోడ్లు చాలావరకూ పాడైపోయాయి. కాలనీల్లో మురునీరు రోడ్ల మీదికి వస్తోంది. ఇక ట్రాఫిక్ జామ్ లు చెప్పాల్సిన పనేలేదు! గడచిన వారం రోజులుగా ఉదయమూ సాయంత్రమూ హైటెక్ సిటీ మొదలుకొని, పంజాగుట్ట వరకూ ట్రాఫిక్ కష్టాలు తీవ్రంగా ఉన్నాయి. గతంలో… రోడ్ల మీద గుంత కనిపిస్తే ఒకప్పుకోననీ, తాను అన్ని రోడ్లపై పర్యటించి మరీ సమస్యల్ని చూస్తానని కేటీఆర్ అన్నారు. కొద్దిరోజులు అలానే వర్షం పడుతున్న సమయంలో కూడా ఆయన రోడ్ల మీదకి వచ్చారు. దాంతో, వర్షాకాలంలో రోజువారీ సమస్యలకి పరిష్కారం లభిస్తుందని అప్పుడు అందరూ ఆశించారు. అది కొద్దిరోజుల హడావుడిగానే ముగిసిపోయింది. ఇప్పుడు ట్రాఫిక్ జామ్ ల గురించి, మురికి కాల్వలు పొంగి పొర్లుతున్న పరిస్థితి గురించి నాయకులేం మాట్లాడటం లేదు! ప్రస్తుతం దగ్గర్లో గ్రేటర్ తప్ప వేరే ఎన్నికలు లేవు. ఏమో, ఆ ఎన్నికల షెడ్యూల్ వచ్చాక… నగర ప్రజల కష్టాలు నాయకులకు గుర్తొచ్చేస్తాయేమో!