విజయభాస్కర్ – త్రివిక్రమ్ కాంబినేషన్‌లో, నాగ్ నటించిన ‘మన్మథుడు’ ఇంటిల్లిపాదినీ అలరించింది. ఇప్పటికీ ఈ సినిమా టీవీలో వస్తే ఒక్కరూ వదలరు. ఎన్నిసార్లు చూసినా ఛానల్ మార్చబుద్ది కాదు. ఎందుకంటే అదో క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. అదే నాగార్జున మళ్లీ ‘మన్మథుడు 2’ తీస్తున్నాడంటే… తప్పకుండా ఇది కూడా కుటుంబ కథా చిత్రమే అవుతుందని అందరూ భావిస్తారు. ఆ టైటిల్‌పై ఉన్న నమ్మకం అది.
కానీ ‘మన్మథుడు 2’ మాత్రం కాస్త గీత దాటినట్టే అనిపిస్తోంది. ఈ సినిమాకి యూ బై ఏ సర్టిఫికెట్ వచ్చింది. కొన్ని సంభాషణలపై సెన్సార్ బోర్డు అభ్యంతరం చెప్పింది. మ్యూట్‌లు ఎక్కువ పడ్డాయి. రకుల్ స్మోక్ చేసింది. ముద్దు సీన్లున్నాయి. మొత్తానికి.. ఇప్పటి కుర్రతరంకి నచ్చేలా ఈ సినిమాని తీర్చిదిద్దడంలో, ఫ్యామిలీ ఆడియన్స్ కి దూరమైనా ఫర్వాలేదు అనుకుని ఈ సినిమాని తీశారేమో అనిపిస్తోంది.
బూతుల గురించి నాగ్ దగ్గర మాట్లాడితే ‘అవును.. ఈ సినిమాలో ‘ఎఫ్’ వర్డ్స్ ఉన్నాయి అని నిర్మొహమాటంగా చెప్పేస్తున్నారు. పోర్చుగల్‌లో తీసిన సినిమా ఇది. ఆ మాత్రం ఉండకపోతే ఎలా అన్నది నాగ్ ఉద్దేశ్యం. పైగా ఈ సినిమాలో రకరకాల పాత్రలున్నాయి. రకరకాల సందర్భాలున్నాయి. ఒక్కో పాత్ర ఒక్కోసారి ఒక్కోలా బిహేవ్ చేస్తుంది, కొన్ని కొన్నిసార్లు అలా మాట్లాడాల్సివస్తుంది అని సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. అయితే… మన్మథుడులోనూ విదేశీ నేపథ్యం ఉంది. అప్పుడు అలాంటి బూతులు వాడలేదే? కాకపోతే ఈమధ్య బూతులు మనకు కామన్ అయిపోయింది. అవి లేకపోతే… డైలాగు పూర్వవదేమో, ఘాడత రాదేమో అన్న రేంజ్‌లో ఆలోచించడం మొదలెడుతున్నారు జనాలు. నాగ్ కూడా ఇక్కడే కాంప్రమైజ్ అయిపోయి ఉంటాడు. ఈ ప్రయత్నం కుర్రకారు వరకూ ఓకే. మరి మన్మథుడుని ఓన్ చేసుకున్న అప్పటి కుటుంబ ప్రేక్షకులకు నచ్చుతుందా???