పోలవరం ప్రాజెక్టుపై కేంద్రం అనూహ్యమైన ఉత్తర్వులు ఇచ్చింది. ఆ ప్రాజెక్టు పర్యావరణ అనుమతులు ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలంటూ… షోకాజ్ నోటీసు జారీ చేసింది. పోలవరం ప్రాజెక్టుకు సాయం అందించాలని… ప్రధానికి, కేంద్రమంత్రులకు.. సీఎం జగన్మోహన్ రెడ్డి వినతి పత్రాలు అందిస్తున్న సమయంలోనే… ఈ షోకాజ్ నోటీసు జారీ కావడం కలకలం రేపుతోంది. 2005లో పోలవరం, అనుబంధ ప్రాజెక్టులపై కేంద్ర పర్యావరణశాఖకు చెందిన చెన్నై అధికారులు తనిఖీలు నిర్వహించారు. వీరు … పర్యావరణ అనుమతుల్ని ఉల్లంఘించారని కేంద్రానికి నివేదిక సమర్పించారు. ఈ నివేదిక ఆధారంగా.. కేంద్రం… పోలవరం ప్రాజెక్ట్ పర్యావరణ అనుమతుల్ని ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలని నోటీసులు జారీ చేసింది.
నిజానికి .. 2015లో పోలవరం పర్యావరణ ఉల్లంఘనలపై .. జాతీయ హరిత ట్రిబ్యునల్‌లో పిటిషన్ దాఖలయింది. అప్పట్లో విచారణ జరిపిన ఎన్జీటీ పోలవరం పనులు నిలిపి వేయాలని.. స్టాప్ ఆర్డర్ ఉత్తర్వులు ఇచ్చింది. దీనిపై కేంద్ర పర్యావరణ శాఖ.. స్టే ఆర్డర్ ఇచ్చింది. ప్రతీ సారి ఏడాది పాటు.. ఈ స్టేపై ఆర్డర్ ఇస్తూ వస్తోంది. ఇటీవల ఈ స్టే ఆర్డర్ గడువు ముగియడంతో.. ఈ సారి రెండేళ్ల పాటు పొడిగింపు ఇచ్చారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రత్యేకంగా ఈ విషయంలో జోక్యం చేసుకున్నారు. ఇలా రెండేళ్ల పాటు పనులపై స్టాప్ ఆర్డర్ ఉత్తర్వులపపై స్టే ఇచ్చిన కొన్ని రోజులకే అదే కారణంతో.. మళ్లీ షోకాజ్ నోటీసు జారీ చేయడం… రాష్ట్ర ప్రభుత్వ వర్గాల్లోనూ కలకలం రేపుతోంది.
నిజానికి.. విభజన చట్టంలో… పోలవరానికి .. అన్నీ అనుమతులు ఇచ్చేసినట్లేనన్న క్లాజ్‌ను చేర్చారు. అయినప్పటికీ.. వివిధ రకాల అనుమతుల పేరుతో.. పోలవరం ప్రాజెక్ట్ కు నోటీసులు వస్తూనే ఉన్నాయి. కేంద్ర పర్యావరణ శాఖ స్టే ఇచ్చిన ఉత్తర్వులకు సంబంధించిన అంశంలోనే.. ఇప్పుడు .. షోకాజ్ నోటీసులు పంపినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే.. పోలవరం ప్రాజెక్టు పనులు నిలిచిపోయాయి. కాంట్రాక్ట్ సంస్థలను.. వెళ్లిపోవాలని ఏపీ సర్కార్ ఆదేశించింది. రీ టెండరింగ్ కు వెళ్లేందుకు ఏపీ సీఎం రెడీ అవుతున్నారు. ఈ సమయంలో.. అసలు పోలవరమే ఆగిపోయే పరిస్థితి వచ్చిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.