ఎన్నికల్లో ఓటమి అనంతరం టీడీపీ సీనియర్ నేత, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ పై సొంత పార్టీలోనే అసంతృప్తులు వ్యక్తమౌతున్న సంగతి తెలిసిందే. ఇంకోపక్క, ఆయన కుటుంబ సభ్యులపై ఆరోపణలూ కేసులూ కూడా తెర మీదికి వచ్చాయి. ఈ నేపథ్యంలో, తనపై అధికార పార్టీ రాజకీయ కక్ష సాధింపులకు దిగుతోందని కోడెల అంటూ వస్తున్నారు. ఢిల్లీ స్థాయిలో ఓ ముఖ్యనేత సిఫార్సుతో తన కుటుంబ సభ్యులపై కేసులు పడకుండా చేసే ప్రయత్నం చేశారనీ ఈ మధ్య కొన్ని కథనాలు వినిపించాయి! అయితే, ఇప్పుడు సొంత పార్టీలో మొదలైన అసమ్మతి ఏంటంటే… సత్తెనపల్లి పార్టీ ఇన్ ఛార్జ్ బాధ్యతల నుంచి కోడెలను తప్పించాలని.
వాహనాలపై ర్యాలీగా బయలుదేరిన కొంతమంది టీడీపీ నేతలు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుని కలుసుకున్నారు. కోడెల శివప్రసాద్ వల్ల పార్టీ నాశనమైందనీ, ఆయన్ని తప్పించకపోతే టీడీపీకి భవిష్యత్తు లేకుండా పోతుందంటూ చంద్రబాబుకి ఫిర్యాదు చేశారు. కోడెల వద్దు, చంద్రబాబు ముద్దు అనీ, కె టాక్స్ వసూలు చేసిన కోడెలను తప్పించాలంటూ ప్లకార్డులు పట్టుకుని టీడీపీ రాష్ట్ర కార్యాలయం దగ్గర నిరసనకు దిగారు. అయితే, ఇదే సమయంలో చంద్రబాబు నాయుడు కూడా పార్టీ కార్యాలయానికి వచ్చి, అసమ్మతి నేతలతో మాట్లాడారు. కోడెలపై స్థానికంగా వ్యక్తమౌతున్న అసమ్మతి, సత్తెనపల్లి నేతలతో ఆయనకి ఉన్న అభిప్రాయభేదాలు తనకు తెలుసుననీ, అన్నీ ఆలోచించి నిర్ణయం తీసుకుంటానని నచ్చజెప్పే ప్రయత్నం చంద్రబాబు చేశారు. దాంతో అసమ్మతి నేతలు కాస్త చల్లబడ్డారు.
నిజానికి, కోడెల మీద ఇప్పుడు వ్యక్తమౌతున్న అసమ్మతి ఎన్నికల ఫలితాలు వచ్చిన దగ్గర్నుంచీ వినిపిస్తున్నదే. మరీ ముఖ్యంగా, కోడెల కుమారుడు, కుమార్తెల అక్రమాలపై సొంత పార్టీ వర్గాల్లోనే చాలా విమర్శలున్నాయి. అవి చంద్రబాబు నాయుడుకి తెలియనవేం కావు! ఇప్పుడు ఆయన్ని పార్టీ బాధ్యతల నుంచి తప్పించాలంటూ సొంత పార్టీ వారే రోడ్డెక్కుతున్న పరిస్థితి వచ్చింది. అయితే, వెంటనే చర్యలు తీసుకునే అవకాశాల్లాంటివీ ఇప్పుడు కనిపించడం లేదు! ఎందుకంటే, అసమ్మతి నేతల అనంతరం… కోడెల కూడా చంద్రబాబును కలిసి వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు. అయితే.. ప్రస్తుతం పార్టీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్న పరిస్థితి ఉందనీ, ముందుగా వాటిపై దృష్టిపెట్టాలనీ, ఆ తరువాత ఇలాంటి సమస్యల్ని పరిష్కరించుకుందామని చెప్పినట్టు సమాచారం. మరి, భవిష్యత్తులో కోడెలపై చర్యలంటూ ఉంటాయా, సీనియర్ నేత విషయంలో చంద్రబాబు ఎలా వ్యవహరిస్తారనేది చూడాలి.