ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో ఖాళీ అయిన మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల ఆగస్టు 26వ తేదీన జరగనున్నాయి. దీనికి సంబంధించిన ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేశారు. ఎమ్మెల్సీలుగా ఉన్న కరణం బలరామకృష్ణ మూర్తి, ఆళ్ల నాని, కోలగట్ల వీరభద్రస్వామి ఎమ్మెల్యేలుగా గెలిచారు. దీంతో వారు తమ పదవులకు రాజీనామా చేశారు. వాటిని భర్తీ చేయబోతున్నారు. మూడు స్థానాలు వైసీపీకే దక్కబోతున్నాయి. టిక్కెట్లు ఇవ్వలేకపోయిన నేతలకు.. జగన్ ఎమ్మెల్సీ హామీ ఇచ్చారు. ఇలాంటి వారు ఓ వంద మంది ఉంటారన్న చర్చ వైసీపీలో ఉంది.
ఎమ్మెల్యేగా గెలవకపోయినా మంత్రివర్గంలోకి మోపిదేవి వెంకట రమణకు కేబినెట్ లో స్థానం కల్పించారు. తప్పనిసరిగా వెంకట రమణకు సీఎం జగన్ ఎమ్మెల్సీ పదవి ఇవ్వాల్సి ఉంది. ఆరు నెలల్లో ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీగా ఎన్నికవ్వాల్సి ఉండటంతో పదవి ఇవ్వకతప్పని పరిస్థితి ఏర్పడింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి ఓడిపోయిన మాజీ ఐపీఎస్ అధికారి ఇక్బాల్ కు ఎమ్మెల్సీ పదవి ఇస్తానని జగన్ గుంటూరులో జరిగిన రంజాన్ విందులో హామీ ఇచ్చారు. ఈ హామీ మేరకు ఇక్బాల్ కూడా ఎమ్మెల్సీ పదవిని ఇవ్వనున్నారు. మరో పదవి కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర పోటీ నెలకొంది. పలువురు నేతలు ఈ పదవి కోసం ఆశలు పెట్టుకున్నారు. తమకు పదవి ఇవ్వాలని పార్టీలోని కీలక నేతల ద్వారా తెరవెనుక లాబీయింగ్ ప్రారంభించారు.
కర్నూల్ జిల్లా బనగానపల్లికి చెందిన చల్లా రామకృష్ణారెడ్డికి మూడో ఎమ్మెల్సీ పదవి దక్కుతుందనే ప్రచారం జరుగుతోంది. చిలకలూరిపేటకు చెందిన మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ జిల్లా పార్టీ అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ కు కూడా మంత్రి పదవిని ఇస్తానని జగన్ ఎన్నికల ప్రచారంలో చెప్పారు. అక్కడ అభ్యర్థి విడదల రజినిని గెలిపిస్తే మర్రి రాజశేఖర్ కు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మంత్రి చేస్తానని హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆ హామీ మేరకు తనకు ఎమ్మెల్సీ పదవి లభిస్తుందేమోనని రాజశేఖర్ ఎదురుచూస్తున్నారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం అభ్యర్థిగా పోటీచేయాలని భావించిన లేళ్ల అప్పిరెడ్డి స్థానంలో ఏసురత్నానికి టికెట్ ఇచ్చారు. అప్పట్లో అప్పిరెడ్డికి పార్టీ అధికారంలోకొచ్చిన వెంటనే పదవి ఇస్తామని జగన్ ప్రకటించారు. దీంతో అప్పిరెడ్డి కూడా ఎమ్మెల్సీ పదవి కోసం ప్రయత్నిస్తున్నారు.