ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో.. కలవాలి అనుకున్న వాళ్లందర్నీ కలిసేశారు. తొలి రోజు పర్యటనలో అమిత్ షాను .. కలవాల్సి ఉన్నప్పటికీ… ఆయన పార్లమెంట్లో.. ఆర్టికల్ 370, కశ్మీర్ విభజన బిల్లుపై.. చర్చలో బిజీగా ఉన్నారు. దాంతో.. సాధ్యం కాలేదు. అయితే.. బుధవారం రాత్రి పది గంటల సమయంలో.. జగన్మోహన్ రెడ్డి అమిత్ షాను కలిశారు. దాదాపు గంట సేపు చర్చలు జరిపారు. రెండో రోజు… రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ఆర్థిక మంత్రి, ఉపరితల రవాణా మంత్రులను.. జగన్ కలిశారు. మొదటి రోజే ప్రధాని మోడీని కలిశారు. దాంతో.. కలవాలనుకున్న వాళ్లందర్నీ.. జగన్మోహన్ రెడ్డి కలిసినట్లయింది. అయితే.. అనూహ్యంగా ఆయన ఢిల్లీ పర్యటన పొడిగించుకున్నారు. రాయలసీమ పర్యటన వాయిదా వేసుకున్నారు.
వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెగ్యులర్ షెడ్యూల్ ప్రకారం… గురువారం.. అనంతపురం, కడప జిల్లాల్లో పర్యటించాల్సి ఉంది. అనంతపురం జిల్లాలో.. తొలి మేడిన్ ఆంధ్రా కారును విడుదల చేయాల్సి ఉంది. కానీ.. జగన్మోహన్ రెడ్డి.. ఈ కార్యక్రమానికి వెళ్లడం లేదు. పర్యటన రద్దు కావడంతో మంత్రులు మాత్రం హాజరవుతున్నారు. జగన్మోహన్ రెడ్డి సందేశాన్ని మంత్రులు చదివి వినిపిస్తున్నాయి. కియా కారు ప్రారంభోత్సవానికి వెళ్లడం ఇష్టం లేకనే.. జగన్ పర్యటన రద్దు చేసుకున్నారనే విమర్శలు టీడీపీ వైపు నుంచి వస్తున్నాయి. టీడీపీ హయాంలో.. ఒక్క పరిశ్రమ కూడా రాలేదని… జగన్మోహన్ రెడ్డి తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఇప్పుడు.. అదే టీడీపీ హయాంలో వచ్చిన కియా పరిశ్రమ నుంచి తయారైన కారును విడుదల చేస్తే.. తన స్టేట్మెంట్లను తానే తప్పుపట్టినట్లు అవుతుందన్న ఉద్దేశంతోనే.. జగన్ ఆగిపోయారని.. టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.
అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాలు మాత్రం.. ఈ వాదనను తోసి పుచ్చుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి.. ఢిల్లీలో ఏపీకి రావాల్సిన నిధుల కోసమే… పర్యటన పొడిగించుకున్నారని చెబుతున్నారు. తొలి మేడిన్ ఆంధ్రా కారు ప్రారంభోత్సవానికి జగన్ ఎంతో ఆసక్తిగా ఉన్నారని.. అయినా పరిస్థితులు అనుకూలించలేదని చెబుతున్నారు. ఏదైనా కానీ.. జగన్మోహన్ రెడ్డి మాత్రం.. కియా కారుకు సందేశం పంపుతున్నారు.. కానీ ప్రత్యక్షంగా ప్రారంభించడం లేదు.