అందాల రాక్షసి చూశాక.. రాహుల్ రవీంద్రన్ మంచి హీరో అవుతాడనిపించింది.
కానీ సరైన కథల్ని ఎంచుకోకపోవడంతో.. రాహుల్ కెరీర్ గాడి తప్పింది. సడన్ గా `చిలసౌ`తో మెగాఫోన్ పట్టి షాక్ ఇచ్చాడు. హీరోగా అవకాశాలు లేకపోవడం వల్లే దర్శకుడిగా మారాడనుకున్నారు. కానీ… తనలోని ప్రతిభేంటో ఆ సినిమాతో నిరూపించుకున్నాడు. రెండో సినిమాకే నాగార్జునతో పనిచేసే ఛాన్స్ కొట్టేశాడు. వీరిద్దరి కాంబినేషన్లో రూపొందిన `మన్మథుడు 2` రేపే (శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతోంది. ఈ సందర్భంగా రాహుత్ తో చిట్ చాట్.
రీమేక్ సినిమా అంటే ముందు భయపడ్డారట.. నిజమేనా..?
భయపడలేదండీ. కాకపోతే… రీమేకా? ఇది ఫ్రీమేకా? అని ఆలోచించానంతే. అన్నపూర్ణ వాళ్లు అన్నింటిలోనూ పర్ఫెక్ట్గా ఉంటారు కదా? వాళ్లు అఫీషియల్‌గానే రీమేక్ చేయడానికి రెడీ అయ్యారు. అందుకే.. నేనూ ఇక ఆలోచించలేదు.
మన్మథుడు అనే టైటిల్ పెట్టడానికి గల కారణం ఏమిటి? అసలు ఈ ఐడియా ఎవరిది?
మా టీమ్ లో ఎవరు చెప్పారో గానీ, ఈ కథని `మన్మథుడు 2` అనే టైటిల్ పెడితే బాగుంటుందని సూచించారు. మాక్కూడా అది కరెక్టే అనిపించింది. ఈ కథకు మన్మథుడు కి మించిన టైటిల్ దొరకదని బలంగా నమ్మాం. అలాగని మేం మన్మథుడిని మించిపోయే సినిమా తీస్తామని చెప్పడం లేదు. కాకపోతే ఆ పేరుని చెడగొట్టం.
మన్మథుడిని పోల్చుకుంటూ ఈసినిమా చూస్తే కష్టం కదా?
ఆ భయాలు మాకూ ఉన్నాయి. కానీ సినిమా మొదలైన పది నిమిషాలకే టైటిల్‌నీ, పాత మన్మథుడిని మర్చిపోయి కథలోకి వెళ్లిపోతారు. ఆ నమ్మకం నాకుంది.
చిలసౌ తరవాత… మీకొచ్చిన ఆఫర్ ఇదేనా?
చిలసౌ విడదలకు ముందే నాగార్జున నన్ను పిలిచారు. `నీ సినిమా చూశా.. ఎమోషన్స్ బాగా క్యారీ చేశావ్` అన్నారు. నీ ఎమోషన్స్‌కి తగ్గట్టుగా ఫ్రెంచ్ సినిమా ఒకటుంది రీమేక్ చేద్దామా? అని అడిగారు. అప్పటికి అందులో నాగార్జున గారు నటిస్తారని నాకు అస్సలు తెలీదు. ఆయన కేవలం ప్రొడక్షన్ చూసుకుంటారేమో అనుకున్నానంతే. కానీ ఆయనే హీరో అనేసరికి ఆశ్చర్యపోయా. రెండో సినిమాకే ఓ బిగ్ స్టార్‌ని డైరెక్ట్ చేయడం అంటే మాటలు కాదు. నా అవకాశం, అదృష్టం నాకొచ్చినందుకు ఆనందంగా ఉంది.
ప్రీ ప్రొడక్షన్‌కి యేడాది పట్టిందట.. కారణం ఏమిటి?
ప్రీ ప్రొడక్షన్‌కి అంత టైమ్ పట్టలేదు. కేవలం స్క్రిప్టు రాయడానికే సమయం తీసుకున్నారు. దాదాపుగా ఏడెనిమిది వెర్షన్లు రాశాను. `నువ్వు రాసింది బాగుంది.. కానీ… ఈ కథని యూనివర్సల్ అప్పీల్ ఉన్న సినిమాగా తీర్చిదిద్దాలి` అంటూ నాగ్ సార్ నన్ను మోటివేట్ చేస్తూ వచ్చారు. చివరికి నన్ను ఆయన దారిలో తీసుకెళ్లారు. ప్రీ ప్రొడక్షన్‌కి ఎంత టైమ్ తీసుకున్నా ఫర్వాలేదు. ఎందుకంటే…. దానికి ఖర్చేం అవ్వదు. ప్రొడక్షన్ అలా కాదు. రోజుకి లక్షలు మాయం అవుతుంటాయి. అందుకే… స్క్రిప్టు లాక్ అయ్యాకే సెట్స్‌పైకి వెళ్లడం మంచిది.
సినిమాలో కొన్ని డబుల్ మీనింగ్ డైలాగులు వినిపిస్తున్నాయి..
మేం సింగిల్ మీనింగ్ లోనే రాశాం. కానీ దాన్ని డబుల్ మీనింగ్ లో అర్థం చేసుకున్నారు. అది కూడా ఒక్క డైలాగ్‌లోనే. `పిల్లలకు కోచింగ్ ఇవ్వాల్సిన వయసులో బ్యాటింగ్ కి దిగుతావేంట్రా` అంటూ రావు రమేష్ చెప్పే డైలాగ్ ఇది. బ్యాటింగ్ అంటే బయట వేర్వేరు అర్థాలున్నాయని అప్పటికి నాకు తెలీదు. అయినా బూతులు చూపించి టికెట్లు తెంచుకోవాలనుకునే టైపు కాదు నేను.
సమంత మీకు మంచి స్నేహితురాలు కదా? అందుకే ఆమెకు ఓ పాత్ర అప్పజెప్పారా?
అదేం కాదు. ఆ సీన్ రాస్తున్నప్పుడే ఈ పాత్రకు సమంత అయితే బాగుంటుందనుకున్నా. నాగ్ సార్‌కి కలిసి ఈ విషయం చెప్పే ముందు.. సమంతకు ఫోన్ చేశా. `ఈ సినిమాలో కామియో చేస్తావా` అని అడిగా. ఆ తరవాతే.. నాగ్ సార్‌ని కలిసి విషయం చెప్పా. `సమంత అయితే బాగుంటుంది. కానీ ఒప్పుకుంటుందా?` అని ఆయన అడిగారు. `నేను ఒప్పిస్తా` అని చెప్పాను. అలా సమంత ఈ సినిమాలో జాయిన్ అయ్యింది.
మీరు కూడా ఓ నటుడే కదా? ఈ సినిమాలో నటించాలని అనుకోలేదా?
లేదు. ఈ సినిమాలో పెళ్లి చూపులకు సంబంధించిన సన్నివేశం ఉంది. అందులో మీరు నటించేయండి.. అని చాలామంది చెప్పారు. కానీ నేను చేయలేదు. నటుడిగా నేను తెరపై కనిపిస్తే.. ప్రేక్షకుల మూడ్ పాడవుతుంది. పైగా నేనేం స్టార్‌ని కాదు. నేను నటించడం వల్ల సినిమాకి అదనంగా వచ్చే ప్రయోజనం లేదు.
దర్శకుడిగా మీలోని నటుడు మీకు ఎంత వరకూ హెల్ప్ అవుతున్నాడు?
నటీనటుల మూడ్ ఎప్పుడు ఎలా ఉంటుందో నాకు తెలుసు. వాళ్లని ఓ సీన్ కోసం ఎలా ప్రిపేర్ చేయాలో నాకు బాగా అర్థం అవుతోంది. అలా నాలోని నటుడు నాకు దోహదం చేస్తున్నాడు.
మన్మథుడు 2కి ముందే ఆఫర్లు వచ్చాయా?
– చిలసౌకీ, మన్మథుడుకీ మధ్య నాకు టైమ్ లేకుండా పోయింది. తరవాత ఏ కథ చేయాలి? ఎవరితో చేయాలి? అనేది అస్సలు ఆలోచించలేదు. ఈ సినిమా విడుదలయ్యాక నెల రోజులు ఎక్కడికైనా వెళ్లి, తదుపరి కథ కోసం ఆలోచిస్తా.