ఎన్నికలకు ముందు భాజపాతో టీడీపీ విభేదించింది. విభజన హామీలు అమలు చెయ్యలేదనీ, ప్రత్యేక హోదా ఇవ్వలేదంటూ ఎన్డీయే నుంచి బయటకి వచ్చేసింది. ఆ తరువాత, జాతీయ స్థాయిలో భాజపాయేతర పార్టీలను ఏకం చేసే ప్రయత్నం కూడా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేశారు. సరే, ఎన్నికలు ఫలితాలు వేరుగా ఉన్నాయి. ఆ తరువాత, ఏపీలో టీడీపీని భాజపా టార్గెట్ చేసుకుని, ఆ పార్టీకి చెందిన నలుగురు ఎంపీలను ఆకర్షించింది. టీడీపీని నిర్వీర్యం చేసే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. అయితే, ఇలాంటి పరిస్థితుల్లో టీడీపీ – భాజపాల మధ్య ఒక ఒప్పందం ఉందంటే ఎలా ఉంటుంది…? అదే విమర్శ చేస్తున్నారు వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి.
ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ఓడిపోయి మూడు నెలలైనా, ఆయనకి ఇంకా కారణాలు తెలియడం లేదనం సిగ్గుగా అనిపించడం లేదా అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. పాలిచ్చే ఆవుని వదిలేసి దున్నపోతుని తెచ్చుకున్నారంటూ చంద్రబాబు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. దీనికి కౌంటర్ గా విజయసాయి స్పందిస్తూ… పాడి ఆవులాంటి రాష్ట్ర ప్రభుత్వ ఖజానాని పిండుకున్నది మీరే కాదా అన్నారు. ప్రజల నోటి దగ్గర కూడును లాక్కున్నది మీరే అని ఆరోపించారు. మిమ్మల్ని మీరు గోమాతగా అభివర్ణించుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. మీపైకి అవినీతి కేసులు రాకుండా ఉండాలనే వ్యూహంతో… భాజపాతో డీల్ కుదుర్చుకున్నారనీ, టీడీపీని విలీనం చేయాలన్నదే ఆ ఒప్పందమనీ, దాన్లో భాగంగా ముందుగా నలుగురు రాజ్యసభ ఎంపీలను భాజపాలోకి చంద్రబాబు నాయుడు పంపించారని ఆరోపించారు.
అధికారంలో ఉండగా టీడీపీ కూడా ఇలానే… కేసుల నుంచి జగన్మోహన్ రెడ్డి తప్పించుకునేందుకే భాజపా కాళ్లు పట్టుకున్నారని విమర్శించేవారు. ఇప్పుడు అదే విమర్శను విజయసాయి చేస్తున్నారు! అయితే, టీడీపీ పాలనపై ఇంతవరకూ కేసులంటూ ఏవీ నమోదు కాలేదు కదా! ఆ కేసులేవో కేంద్రమే పెట్టాల్సిన పనేముంది, రాష్ట్రంలో వైకాపా కూడా గత టీడీపీ పాలనలో అవినీతిని వెలికి తీసే పనిలో ఉంది కదా. ఐదేళ్ల చంద్రబాబు పాలన అంతా అవినీతిమయం వారే అంటున్నారు. అలాంటప్పుడు, కొన్ని ప్రధానమైన అంశాలపైన అయినా ఆధారాలతో కేసులు పెట్టే వెసులుబాటు రాష్ట్ర ప్రభుత్వానికీ ఉంటుంది! కాబట్టి, కేసుల్లేకుండా చేసుకునేందుకు చంద్రబాబు భాజపాతో డీల్ చేసుకున్నా… వైకాపా తన పని తాను చేసుకోవచ్చు. అయినా, ఇప్పుడున్న పరిస్థితుల్లో టీడీపీ, భాజపాల మధ్య డీల్ ఎలా సాధ్యం? ఒకవేళ టీడీపీ అందుకు సిద్ధం అనుకున్నా… భాజపాకి ఏం అవసరం..?